Politics

జనసేన ఓటమికి చంద్రబాబు చాలు-NewsRoundup-Mar 03 2024

జనసేన ఓటమికి చంద్రబాబు చాలు-CrimeNews-Mar 03 2024

* ఇళ్ల పైకప్పులపై ఏర్పాటు చేసిన సౌర ఫలకాల (Rooftop solar capacity) ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు సామర్థ్యం 2023లో 6.25 శాతం (1.7 గిగావాట్లు) పెరిగిందని ఓ ప్రముఖ నివేదిక వెల్లడించింది. 2022లో ఇది 1.6 గిగావాట్లుగా ఉందని తెలిపింది. అక్టోబరు – డిసెంబరు త్రైమాసికంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుదుత్పత్తి సామర్థ్యం 406 మెగావాట్లు పెరిగిందని అమెరికాకు చెందిన పరిశోధన సంస్థ మెర్కామ్ వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 15.9 శాతం తగ్గడం గమనార్హం. మొత్తంగా డిసెంబరు నాటికి రూఫ్‌టాప్‌ సోలార్‌ సామర్థ్యం 10.5 గిగావాట్లకు చేరింది.

* చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు వైకాపా కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. సీఎం జగన్‌ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. చిత్తూరు అసెంబ్లీ ఇన్‌ఛార్జిగా ఇటీవల విజయానందరెడ్డిని వైకాపా అధిష్ఠానం నియమించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న శ్రీనివాసులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆదివారం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పవన్‌తో భేటీ అయిన కొన్ని గంటల్లోనే శ్రీనివాసులును వైకాపా నుంచి సస్పెండ్‌ చేయడం గమనార్హం.

* తిరుపతి ఎస్పీ మలికా గార్గ్‌ బదిలీ అయ్యారు. ఆమెను విజయవాడ సీఐడీ ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మూడు వారాల్లోనే ఆమె బదిలీ కావడం గమనార్హం. ప్రస్తుతం విజయవాడ డీసీపీగా పనిచేస్తున్న కృష్ణకాంత్‌ పాటిల్‌ను తిరుపతికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* ఏపీలో పదో తరగతి పరీక్షల హాల్‌ టిక్కెట్లు (AP SSC Hall tickets) సోమవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12గంటల నుంచి పాఠశాలల లాగిన్‌తో పాటు విద్యార్థులే నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అధికారిక వెబ్‌సైట్‌ www.bse.ap.gov.in ద్వారా విద్యార్థులు హాల్‌టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో మార్చి 18 నుంచి 30 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

* తనకు లోక్‌సభ స్థానం నుంచి టికెట్‌ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్‌ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్‌ రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్‌ సిట్టింగ్‌ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్‌ గురించి హైకమాండ్‌ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్‌ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్‌ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్‌ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి.

* రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీలు విడుదల చేసిన తొలి జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరును ప్రకటించారు. ఆ పేరు ప్రకటించినప్పటినుంచీ అటు జనసేనలోనూ.. ఇటు తెలుగుదేశంలోనూ కొణతాలను వ్యతిరేకించేవారు బయటికొచ్చారు. ఆయనపై ఒక్కసారిగా అసమ్మతి భగ్గుమంది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యన్నారాయణ అనకాపల్లి సీటు ఆశించారు. గోవిందుకు సీటు రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రోడ్డుపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్ల బ్యాడ్జీలతో తమ అసంతృప్తిని టిడిపి అధిష్టానంకు తెలియజేశారు. అనకాపల్లి టీడీపీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తిని చల్లబరిచేందుకు పీలా గోవిందును చంద్రబాబు అమరావతి పిలిపించి చర్చలు జరిపారు. ఈసారి జనసేనకు సహకరించాలని సూచించారు. పీలా మాత్రం తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చంద్రబాబుకు చెప్పి బయటకు వచ్చేశారు.

* జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ పరిస్థితిని చూస్తే జాలేస్తోందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేశ్‌ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని పవన్‌ కళ్యాణ్‌ తాకట్టు పెట్టాడని విమర్శించారు. 2009 ఎన్నికల సమయంలో పంచలూడగొడతా అని అన్నాడు.. ఇప్పుడేమో పాతాళానికి తొక్కేస్తానని అంటున్నాడని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నిలబెట్టిన అభ్యర్థులపై ఓడిపోయి ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అయినా గ్లాస్‌ గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలని విమర్శించారు. పవన్‌ కళ్యాణ్‌ నిలబెట్టిన 24 మంది అభ్యర్థులను చంద్రబాబే ఓడిస్తాడని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలోనూ ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసిన కమిట్‌మెంట్‌ ఉన్న నాయకుడు జగన్‌ అని కేశినేని నాని కొనియాడారు. సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తున్నారని అన్నారు. విజయవాడకు చంద్రబాబు వంద కోట్లయినా ఇచ్చాడా? అని నిలదీశారు. డ్రైనేజీ వ్యవస్థ కోసం తాను కేంద్రం నుంచి 400 కోట్లు తెస్తే.. ఆ నిధులను కూడా చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఆ నిధులు అన్నీ తన పలుకుబడి ఉపయోగించి తెచ్చినవే అని స్పష్టం చేశారు. ఈ విషయంలో చంద్రబాబుతో చర్చకు సిద్ధమని సవాలు విసిరారు.

* త్వరలో జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలువబోతున్నదని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 12న సెంటిమెంట్‌గా వస్తున్న ఎస్సారార్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానంలో బీఆర్‌ఎస్‌ గెలువబోతుందన్నారు.

* టీడీపీకి చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌ (Kodela Shiva Prasad) మరణానికి చంద్రబాబు (Chandra Babu) కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సత్తెనపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో కోడెల ఓటమి పాలైతే కనీసం ఆయనను పలకరించకపోగా వారి కుటుంబాన్ని రాజకీయంగా పక్కకు పెట్టడడంతో కోడెల మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

* సమాజం నుంచి అంగవైకల్యాన్ని పారద్రోలేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న పల్స్‌పోలియోను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి్ (TTD EO Dharma reddy) పిలుపునిచ్చారు. ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తిరుమలలో 25 ప్రాంతాలలో పల్స్‌పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో భక్తులు, స్థానికులు 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు విధిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రెండు చుక్కలు చిన్నారుల జీవితాలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పారు.

* ఎస్సీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోసం ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ అందిస్తున్న ప్రకటించింది. ఇందులో భాగంగానే అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూ. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన ఎస్సీ విద్యార్థుల కుటుంబాల కోసం తీసుకొచ్చారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ పథకానికి ఎవరు అర్హులంటే..

* దరఖాస్తు చేసుకునే విద్యార్థి కచ్చితంగా 35 ఏళ్లలోపు ఉండాలి.
*60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
* ఇక అభ్యర్థులు కచ్చితంగా జీఆర్‌ఈలో 280 మార్కులు, జీమాట్‌లో 550 మార్కులు సాధించి ఉండాలి.
* అలాగే టోఫెల్‌లో 60 మార్కులు లేదా ఐఈఎల్‌టీఎస్‌లో 6 గ్రేడ్‌ను సాధించి ఉండాలి.
* పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకునే వారు పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌, సైన్సెస్‌, అగ్రికల్చర్ సైన్సెస్‌, మెడిసిన్‌, సోషల్‌ సైన్స్‌ వంటి వాటిలో పీజీ పూర్తి చేసి ఉండాలి.
* అడ్మిషన్‌ లెటర్‌ ఆధారంగా రూ. 20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌ అందిస్తారు.
* వన్‌ వే ఎకానమీ ఫ్లైట్ చార్జీలను ప్రభుత్వమే అందిస్తుంది. విసా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z