Politics

రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వాలు ఉండవు-NewsRoundup-Mar 12 2024

రాజకీయాల్లో యుద్ధమే తప్ప బంధుత్వాలు ఉండవు-NewsRoundup-Mar 12 2024

* రాజకీయాల్లో యుద్ధమే ఉంటుంది.. బంధుత్వాలు ఉండవని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడారు. భీమవరం వదలను.. నాది. అక్కడి నుంచి రౌడీయిజం పోవాలి. జనసేన గెలిస్తే భీమవరంలో డంపింగ్‌ యార్డ్‌ను సరిచేస్తాం. మే 15లోపు వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది. సిద్ధం.. సిద్ధం అని కోకిలలా కూస్తోన్న వ్యక్తికి యుద్ధమే ఇద్దాం అని అన్నారు.

* ఆధార్‌ (Adhaar) వివరాలను ఉచితంగా అప్‌డేట్‌ (Free Aadhaar Update) చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి 14తో ముగియనుండడంతో ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌కు మరో మూడు నెలలు గడువు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో జూన్‌ 14 వరకు ఉచితంగా ఆధార్‌లో మార్పులు చేసుకోవచ్చు. తొలుత 2023 మార్చి15 వరకు ఉన్న గడువును డిసెంబరు 14 వరకు పొడిగించింది. తర్వాత 2024 మార్చి 14 వరకు అప్‌డేట్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా మరోసారి గడువు తేదీని పొడిగించింది. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉడాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

* పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP)లో ముసలం మొదలైంది. అక్కడ పార్టీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మల్లెల రాజేశ్ నాయుడును ఎన్నికల బరి నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి విడదల రజని, వైకాపా అధిష్ఠానం తీరుపై రాజేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి విడదల రజని తన వద్ద డబ్బు తీసుకున్నారని ఆరోపించారు.

* యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ముంగిట తమిళనాట కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ సినీనటుడు ఆర్‌.శరత్‌ కుమార్‌ (Sarath kumar) తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చి (AISMK)ని భాజపాలో విలీనం చేశారు. తన పార్టీ ఆఫీస్‌ బేరర్లతో పాటు తమిళనాడు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమక్షంలో కాషాయ పార్టీలో విలీనం చేసిన విషయాన్ని ప్రకటించారు. చెన్నైలో పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐక్యతతో పాటు ఆర్థిక వృద్ధిని సాధించే దిశగా ప్రధాని మోదీ (PM Modi) ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసి యువత సంక్షేమానికి భరోసాగా నిలుస్తున్నారని కొనియాడారు. 2026లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత భాజపాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని తన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

* ఏపీలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 352 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (KGBV) 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. 6, 11వ తరగతుల్లో కొత్తగా ప్రవేశాలు, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్‌ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( మధ్యలో బడి మానేసిన వారు), పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకొనేందుకు అర్హులు. కేజీబీవీ అధికారిక వెబ్‌సైట్‌ https://apkgbv.apcfss.in/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షలు; పట్టణ ప్రాంతాల్లో రూ.1.4 లక్షలు మించరాదు.

* విశాఖకు చెందిన ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్‌పై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి ఛైర్మన్‌ కె.మోషేన్‌ రాజు ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధకచట్టం నిబంధనల మేరకు ఆయనపై అనర్హత వేటు వేసినట్టు మండలి ఛైర్మన్‌ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో విశాఖ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్టు ప్రకటించారు. విశాఖ నుంచి స్థానిక సంస్థల కోటాలో వైకాపా ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

* హోలీ వేడుకల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. మార్చి 25న హోలీ పండగ నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కాచిగూడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు 18 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. మార్చి 16 నుంచి ఆయా ప్రాంతాలకు వివిధ తేదీల్లో ఈ రైళ్లు సర్వీసులందించనున్నాయి.

* సోషల్‌ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌ వల్ల ఆత్మహత్య చేసుకున్న తెనాలి మహిళ గీతాంజలి (Gitanjali) కుటుంబానికి ఏపీ సీఎ వైఎస్‌ జగన్‌ (CM Jagan) రూ. 20 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఆడపిల్లల గౌరవ ప్రతిష్టలకు, మర్యాదలకు భంగం కలిగించే ఏ ఒక్కరినీ కూడా చట్టం వదిలిపెట్టదని అన్నారు.

* తెలంగాణ రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతుండటంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయని, ఆ కంపెనీ పెట్టుబడులను ఇక్కడే కొనసాగించేలా రాష్ట్రం ఒప్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్‌ (X) హ్యాండిల్‌లో ఒక పోస్టు పెట్టారు. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు తరలిపోతున్నట్టు ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ ఆయన షేర్‌ చేశారు. ‘రాష్ట్రం నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు మేం చేసిన కృషి నిష్ఫలం అవుతున్నది. కేన్స్‌ కంపెనీ గుజరాత్‌కు వెళ్లిపోతున్నట్లు వార్తలు వస్తునాయి. ఎంతో ప్రయత్నించి కేన్స్‌ కర్ణాటక నుంచి తెలంగాణకు వచ్చేలా కన్విన్స్‌ చేశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఆ కంపెనీని ఒప్పించాం. ఫాక్స్‌కాన్‌ దగ్గరలో ల్యాండ్‌ కావాలంటే 10 రోజుల్లోనే భూమి కేటాయించాం. కేన్స్‌ కంపెనీ వస్తే సెమీకండక్టర్‌ రంగంలో ఎంతో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు ఇక్కడే కొనసాగించేలా కేన్స్‌ కంపెనీని రాష్ట్రం ఒప్పించాలి’ అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

* కొత్త రేషన్‌ కార్డుల జారీకి తెలంగాణ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అర్హులైన వారందరికీ తొందరలోనే తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. రేషన్‌ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలుకు కూడా కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లు అందించాలని తీర్మానించింది. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే 16 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపై దాదాపు రెండున్నర గంటలసేపు చర్చించింది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే..

– కొత్త రేషన్‌ కార్డుల జారీకి ఆమోదం
– బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు
– 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలపై కసరత్తుకు నిర్ణయం
– 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు కేటాయింపు
– ఔటర్‌ చుట్టూ మహిళా రైతు బజార్లు
– కాళేశ్వరంపై న్యాయ విచారణకు కమిటీ ఏర్పాటు.. విచారణ కమిటీ చైర్మన్‌గా జస్టిస్‌ పినాకిని చంద్రబోస్‌
– విద్యుత్‌ కొనుగోళ్లపైనా మరో కమిటీ.. చైర్మన్‌గా జస్టిస్‌ నరసింహారెడ్డి
– రెండు రోజుల్లో 93 శాతం రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని నిర్ణయం
– యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ అక్రమాలపై విచారణ జరపాలని నిర్ణయం

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z