Devotional

జూన్ నెల తితిదే బుకింగ్ షెడ్యూల్ విడుదల

జూన్ నెల తితిదే బుకింగ్ షెడ్యూల్ విడుదల

తిరుమ‌ల(Tirumala) శ్రీ‌వారి భ‌క్తుల సౌక‌ర్యార్థం జూన్ నెల‌లో ద‌ర్శనం, ఆర్జిత‌సేవా టికెట్లు, శ్రీ‌వారి సేవలకు సంబంధించి కోటా వివ‌రాల షెడ్యూల్‌(Quota schedule)ను టీటీడీ (TTD) విడుదల చేసింది. మార్చి 18న ఉదయం 10 నుంచి 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల ల‌క్కీడిప్ కోసం న‌మోదు చేసుకోవ‌చ్చని, మార్చి 22న మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.

మార్చి 21న ఉద‌యం 10 గంట‌లకు శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లైన క‌ల్యాణోత్సవం(Kalyanotsavam), ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్రహ్మోత్సవం, స‌హ‌స్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుద‌ల చేస్తామని స్పష్టం చేసింది. జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు భ‌క్తుల‌కు టికెట్లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.

మార్చి 23న‌ ఉద‌యం 10 గంట‌లకు అంగ‌ప్రద‌క్షిణం టోకెన్లు, ఉద‌యం 11 గంట‌లకు శ్రీ‌వాణి ట్రస్టు(Srivani Trust) దాత‌ల ద‌ర్శనం, గ‌దుల కోటా, మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు వృద్ధులు, దివ్యాంగుల ద‌ర్శన‌టికెట్ల కోటాను విడుద‌ల చేస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శన టికెట్లను భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచుతామని, మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని గ‌దుల కోటాను విడుద‌ల చేస్తామని వివరించింది.

మార్చి 27న ఉద‌యం 11 గంట‌లకు తిరుమ‌ల‌, తిరుప‌తిలోని శ్రీ‌వారి సేవ కోటాను, అదేరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు న‌వ‌నీత సేవ కోటాను, మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు ప‌ర‌కామ‌ణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లు బుక్ చేసుకోవాల‌ని అధికారులు కోరారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z