Politics

రేపే 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల-NewsRoundup-Mar 15 2024

రేపే 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల-NewsRoundup-Mar 15 2024

* వైకాపాపై మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి (Suneetha Narreddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైకాపా పునాదులు వైఎస్‌ వివేకానందరెడ్డి రక్తంలో మునిగి ఉన్నాయన్నారు. వైఎస్‌ వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు.

* ట్రాన్సిట్‌ వారెంట్‌ లేకుండా ఎమ్మెల్సీ కవితను ఎలా అరెస్టు చేస్తారని దర్యాప్తు అధికారిని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘‘అరెస్టు చేయమంటూ సుప్రీం కోర్టుకు మాట ఇచ్చి.. ఇప్పుడు ఎలా అరెస్టు చేశారు? కావాలనే శుక్రవారం వచ్చారు. సర్వోన్నత న్యాయస్థానానికి ఇచ్చిన మాట తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని హెచ్చరించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావొద్దంటూ ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేయడంపై ఆయన మండిపడ్డారు.

* భారాస ఎమ్మెల్సీ కవిత(Kavitha)ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో జాయింట్‌ డైరెక్టర్‌ నేతృత్వంలోని 8మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏ ప్రాతిపదికన అరెస్టు చేస్తారంటూ ఈడీ అధికారులను కవిత ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కవిత నివాసం వద్దకు భారాస కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ప్రభుత్వం, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కవితను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదని భారాస లీగల్‌సెల్‌ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌ తెలిపారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా, ఎన్నికల ముందు అరెస్టులు ఏంటని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావుతో పాటు పలువురు భారాస నేతలు కవిత నివాసం వద్దకు చేరుకున్నారు.

* టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ (Venkatesh) ఇంట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. ఆయన రెండో కుమార్తె హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ డాక్టర్‌ కుమారుడితో నేడు వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న (మార్చి 14) మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను నమ్రతా శిరోద్కర్‌ షేర్‌ చేయగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

* ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్‌ ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో డెత్‌ ఓవర్లలో హార్డ్‌ హిట్టింగ్‌ చేసి కీలక పరుగులు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకొచ్చే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వ్యాఖ్యానించాడు. గత సీజన్‌ వరకు ఐపీఎల్‌లో సీఎస్కే జట్టుకు ఆడిన అంబటి రాయుడు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా ధోనీ అవతరిస్తాడు. ‘‘ధోనీ భాయ్‌ తీసుకొనే నిర్ణయాలు ఎవరికీ తెలియదు. గత కొన్ని సీజన్లలో అతడి గురించి తెలుసుకున్నాను కాబట్టి.. చెబుతున్నా. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కొన్ని మార్పులు ఉంటాయి. కానీ, ధోనీ టాప్‌ ఆర్డర్‌కు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏడో స్థానంలో వస్తున్న అతడు అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడు. పైవరుసలో మాత్రం కుర్రాళ్లకే అవకాశం ఇస్తాడు. చాలామంది ధోనీకిదే చివరి సీజన్‌ అని చెబుతున్నారు. కానీ, అతడి ఫిట్‌నెస్‌ను చూస్తే మాత్రం మరో ఏడాది కూడా ఆడతాడు’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు.

* పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలు కోసం భారత్‌ (India) ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యల(CAA Remarks)కు భారత్‌ దీటుగా స్పందించింది. అవి కల్పితం, అనవసరమని వ్యాఖ్యానించింది. ‘‘సీఏఏ అనేది కొత్తగా పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించినది. ఎవరి నుంచి పౌరసత్వాన్ని లాక్కొనేది కాదు. తనకంటూ ఒక దేశం లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మర్యాదపూర్వకమైన జీవితాన్ని అందిస్తుంది. ఆ చట్టం ఒక దేశ అంతర్గత వ్యవహారం. భారత దేశ సమ్మిళిత సంప్రదాయాలకు, మానవ హక్కుల పరిరక్షణకు అనుగుణంగా ఉంది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు సురక్షిత ప్రదేశాన్ని అందిస్తుంది’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ‘‘సీఏఏ అమలుకు సంబంధించి అమెరికా చేసిన ప్రకటన కల్పితమని, అనవసరమైందని మేం భావిస్తున్నాం. భారత్‌ బహుళ సంస్కృతులు, విభజన అనంతర చరిత్రపై పరిమిత జ్ఞానం ఉన్నవారు మాకు ఉపన్యాసాలు ఇవ్వొద్దు. మా శ్రేయాభిలాషులు, భాగస్వాములు సీఏఏ ఉద్దేశాన్ని స్వాగతించాలి’’ అని అమెరికా వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చారు.

* అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి మరణంతో ఎక్కువగా నష్టపోయింది చిన్నమ్మ సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె సునీతాయేనని చెప్పారు. మాజీ మంత్రి వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన స్మారక సభలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌(YS Jagan)పై షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంతలా దిగజారిపోతారని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

* కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్‌.యడియూరప్ప (81) (Yediyurappa)పై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసును తుదుపరి దర్యాప్తు నిమిత్తం క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ (CID)కు బదిలీ చేశారు. బెంగళూరు పోలీసులకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ అలోక్‌మోహన్‌ ఈమేరకు సమాచారం అందించారు. తనపై వచ్చిన ఆరోపణలను యడియూరప్ప ఖండించారు. ‘‘ఆ బాలిక, ఆమె తల్లి కొద్దిరోజుల క్రితం నన్ను కలిసేందుకు వచ్చారు. మోసం కేసులో సాయం చేయమని కోరారు. దాని గురించి బాలికతో మాట్లాడుతుంటే ఆమె ఏదీ సరిగా చెప్పలేదు. అప్పుడే ఆమె మానసిక స్థితిపై నాకు అనుమానం వచ్చింది. అయినా సరే పోలీసులను పిలిపించి వారికి అవసరమైన సాయం చేయమని చెప్పా. ఆర్థికంగా ఉపయోగపడుతుందని కొంత డబ్బు కూడా ఇచ్చా. ఇప్పుడు తిరిగి వాళ్లు నాపైనే ఫిర్యాదు చేశారు. ఇవన్నీ నిరాధార ఆరోపణలు’’ అని వెల్లడించారు.

* సీనియర్‌ నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు. శుక్రవారం ఉదయం తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన. ముద్రగడతో పాటు ఆయన తనయుడు గిరి కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా.. వైఎస్సార్‌సీపీలో చేరడం సంతోషంగా ఉందని, ఎన్నికల్లో జగన్‌ గెలుపు కోసం కృషి చేస్తానని ముద్రగడ తెలిపారు.

* లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు రేపు షెడ్యూల్‌ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.ఈ నేపథ్యంలో కోడ్‌ తక్షణం అమలులోకి రానుండగా.. అభ్యర్థుల ఖరారు.. ఎన్నికల ప్రచారాల హోరుతో ప్రధాన పార్టీలు రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కించబోతున్నాయి. రేపు ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ఉండగా.. అదే సమయంలో ఏపీలో మరో ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అధికార వైఎస్సార్‌సీపీ మొత్తం 175 స్థానాలకు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ నుంచి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నారు.

* సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా స్పందించింది. రేపు.. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని.. ఈ మేరకు ప్రెస్‌మీట్‌ ఉంటుందని ఈసీఐ ప్రతినిధి ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను రేపు ఈసీ అధికారికంగా వెల్లడించనుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z