Politics

ఏపీలో మార్పు తెస్తానంటున్న మోడీ-NewsRoundup-Mar 17 2024

ఏపీలో మార్పు తెస్తానంటున్న మోడీ-NewsRoundup-Mar 17 2024

* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొప్పూడి చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ప్రజాగళం సభా ప్రాంగణానికి విచ్చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌తో పాటు పలువురు ముఖ్య నేతలు స్వాగతం పలికారు. సభకు విచ్చేసిన లక్షలాది మందికి అభివాదం చేస్తూ ప్రధాని.. వేదికపైకి వచ్చారు. భారీగా తరలి వచ్చిన తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలతో బొప్పూడి జనసంద్రంగా మారింది.

* ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘చంద్రబాబు, పవన్‌తో కలిసి బహిరంగ సభలో పాల్గొంటా. ఎన్డీఏకు ఏపీ ప్రజల ఆశీస్సులు కావాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు తీయిస్తాం’’ అని పేర్కొన్నారు. మరి కాసేపట్లో చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద జరిగే సభలో ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఇప్పటికే పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి, నారా లోకేశ్‌, నందమూరి బాలకృష్ణ తదితరులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.

* భారాసకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు రంజిత్‌రెడ్డి భారాసకు రాజీనామా చేశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

* దాదాపు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కార్తికేయ 2’తో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు నిఖిల్‌ (Nikhil). చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సూపర్‌హిట్‌ అందుకుంది. దీనికి కొనసాగింపుగా రానున్న ‘కార్తికేయ 3’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. ‘‘సరికొత్త అడ్వెంచర్‌ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యారు. త్వరలో రానున్నాం’’ అని నిఖిల్‌ తాజాగా పోస్ట్‌ పెట్టారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్‌ – చందు కాంబోలో మరో అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ చూసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గత చిత్రంతో పోలిస్తే ఇది భారీ స్థాయిలో ఉండనుందని టాక్‌.

* దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కేరళ, తెలంగాణ రాష్ట్రాలున్నాయి. లక్షద్వీప్‌, అండమాన్‌ నికోబార్‌, దిల్లీ వంటి ప్రాంతాల్లో పెట్రో ధరలు అతి తక్కువగా ఉండటం గమనార్హం. స్థానికంగా సేల్స్‌ టాక్స్‌ లేదా వ్యాట్‌ (VAT) రేట్లలో వ్యత్యాసం వల్లే ధరల్లో ఈ మార్పులు చోటుచేసున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన ముందు (గతవారం).. ఆయిల్‌ కంపెనీలు లీటరుపై రూ.2 తగ్గించినప్పటికీ అనేక రాష్ట్రాల్లో వీటి ధరలు వంద రూపాయల దిగువకు చేరలేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.109.87గా ఉంది. దేశంలోనే ఇది అత్యధికం. ఎల్‌డీఎఫ్‌ కూటమి అధికారంలో ఉన్న కేరళలో రూ.107.54, కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణాలో పెట్రోల్‌ ధర రూ.107.39గా ఉన్నాయి. భాజపా పాలిత ప్రాంతాల్లోనూ పెట్రోల్‌ ధరలు అధికంగానే ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో (భోపాల్‌) రూ.106.45, భాజపా-జేడీయూ కూటమి ప్రభుత్వమున్న బిహార్‌లో (పట్నా) రూ.105.16, రాజస్థాన్‌లో 104.86, ముంబయిలో రూ.104.19గా ఉన్నాయి.

* ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. భారాస నేత, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ భాజపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పీఏలు, బినామీలు అప్రూవర్‌గా మారి మద్యం కుంభకోణం కేసులో వివరాలు ఇస్తున్నారని చెప్పారు.

* గ్రూప్‌-1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీయింగ్‌ వ్యవహారం ఒంగోలులో వెలుగు చూసింది. స్థానిక వెంగముక్కపాలెం రోడ్డులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఓ అభ్యర్థి మొబైల్‌ సాయంతో కాపీయింగ్‌ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు తనిఖీలు చేసినప్పటికీ వారి కళ్లుగప్పి సెల్‌ఫోన్‌ను లోపలికి తీసుకువెళ్లాడు.

* చాక్లెట్‌ తయారీ సంస్థ బారీ క్యాలిబాట్‌, టెక్‌ సంస్థ బుహ్లర్‌ సహా స్విట్జర్లాండ్‌కు (Switzerland) చెందిన అనేక కంపెనీలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్‌ తెలిపారు. హెస్‌ గ్రీన్‌ మొబిలిటీ 2025 నాటికి భారత్‌లో 3,000 విద్యుత్తు బస్సులను తయారు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

* రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. సీల్ట్‌ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. బాండ్ల పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐపై సుప్రీం కోర్టు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

* ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ (LokSabha Elections 2024)కు దేశం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ప్రజలను తమవైపు ఆకర్షించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. ఇందులో సామాజిక మాధ్యమాలు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లదే కీలక పాత్ర.

* ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార వైకాపా నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి వీఆర్వోను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారణ జరిపించి.. వీఆర్వో రమేష్‌ రాజకీయ పార్టీ ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధరణ కావడంతో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు శాఖపరంగానూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* భారాస నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు కంటోన్మెంట్‌ శాసనసభ ఉప ఎన్నిక బరిలో ఉంటానని, ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు సహకరించాలని దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత సోదరి, భారాస నాయకురాలు నివేదిత కోరారు. తన సోదరి లాస్యనందిత హఠాన్మరణం అనంతరం ఆమె తొలిసారిగా శనివారం కాకాగూడ గృహలక్ష్మి కాలనీలోని నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడుతూ.. లాస్యనందిత ఆశయసాధనకు కృషి చేస్తానని, త్వరలోనే పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తానన్నారు.

* ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అమెరికా అధ్యక్షఎన్నికల్లో తన గెలుపునకు సంబంధించి దేశ మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ ప్రస్తుత అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే దేశంలో రక్త పాతం జరుగుతుందని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ తనతోనే సాధ్యమని, బైడెన్‌తో కాదని చెప్పారు. ఒహియోలో రిపబ్లికన్‌ సెనేట్‌ అభ్యర్థి బెర్నీ మొరినో తరపున ప్రచారం చేస్తూ శనివారం ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

* తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్‌, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి శంషాబాద్‌ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. మధ్యాహ్నం 2.30కు ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయల్దేరలేకపోయింది. దీంతో గంట నుంచి రేవంత్‌, భట్టి, టీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షి విమానంలోనే ఉండిపోయారు.

* వివాదాస్పద యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విజేత ఎల్విష్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాము విషం కేసులో నోయిడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసినట్లు నోయిడా డీసీపీ విద్యాసాగర్ మిశ్రా వెల్లడించారు. ఇవాళ అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ప్రస్తుతం ఎల్విశ్ యాదవ్ పోలీసులు కస్టడీలోనే ఉన్నారు. తాజాగా అతన్ని కోర్టుకు తీసుకెళ్తున్న వీడియోలో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా..గతేడాది గురుగ్రామ్, నోయిడాలోని రేవ్ పార్టీలకు పాము విషాన్ని సరఫరా చేసినట్లు ఆరోపణలు రావడంతో ఎల్విష్‌ను పోలీసులు ప్రశ్నించారు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు మరో ఐదుగురిని కూడా అరెస్టు చేశారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను యూట్యూబర్ ఎల్వీశ్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ఈ కేసులో తాను దోషిగా రుజువైతే కెమెరాలో బట్టలు విప్పి డ్యాన్స్ చేస్తానని అన్నారు.

* ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. రేవంత్‌ రెడ్డి ఖబడ్దార్‌.. నోరు, ఓళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడలంటూ హెచ్చరించారు. ఫోన్‌ ట్యాంపింగ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారస్తులను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న వసూళ్ల చిట్టా రికార్డ్‌ అవుందని అన్నారు. నడమంత్రపు సిరిలాగా ముఖ్యమంత్రి పదవి వచ్చిన రేవంత్ రెడ్డి.. రెండు నాల్కలధోరణితో మాట్లాడుతున్నారని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమకు పెద్దన్న అని.. ఆయన ఆశీర్వాదం ఉంటేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని ఇటీవల రేవంత్‌ మాట్లాడిన ఈటల చెప్పుకొచ్చారు. ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న కొంపల్లి, అల్వాల్‌ ఫ్లై ఓవర్ కోసం 175 ఎకరాల రక్షణ రంగ భూమిని మోదీ కేటాయించారని చెప్పిన సీఎం .. మళ్లీ అదే నోటితో ప్రధానిని తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ కూడా అలానే మాట్లాడారని, ఆయనకు పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందంటూ హెచ్చరించారు.

* కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్రలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని నిలదీశారు. కేసీఆర్‌ ప్రభుత్వం పనితీరు బాగుందని గతంలో మోదీ అనలేదా.. మిషన్‌ భగీరథపై మోదీ ప్రశంసలు కురిపించలేదా? అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే బీఆర్ఎస్ నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్‌మెన్ ఉద్యోగం ఎట్లా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రావుల మాట్లాడారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే బీజేపీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిందని రావుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు. దొంగలు అయితే ఎంపీ టిక్కెట్లు బీజేపీ ఎట్ల ఇస్తుందని ప్రశ్నించారు. గిరిజనుల భూములను ఆక్రమించుకున్నారని సైదిరెడ్డికి వ్యతిరేకంగా గతంలో బీజేపీ ఆందోళనలు చేసిందని.. ఇప్పుడు ఆయనకే నల్గొండ ఎంపీ టికెట్‌ ఇచ్చారని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z