* ఎట్టి పరిస్థితుల్లో మల్కాజిగిరి పార్లమెంట్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తాను సీఎంగా ఉన్నానంటే.. ఆ గొప్పతనం మల్కాజిగిరి కార్యకర్తలదేనన్నారు. ఆనాడు కొందరు నాయకులు అమ్ముడుపోయినా.. కార్యకర్తలు భుజాలపై మోసి గెలిపించి తనను దిల్లీకి పంపించారని గుర్తు చేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం సమావేశమయ్యారు. హోలీ పండగలోగా అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటిస్తుంది. కష్టపడిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత నాది. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాల్సిందే. ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించుకోవాలి. మల్కాజిగిరి క్యాంపెయిన్ మోడల్ రాష్ట్రమంతా అనుసరించేలా చేయాలి. ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నిక అభ్యర్థిది కాదు..ముఖ్యమంత్రిది. నా బలం.. నా బలగం మీరే అని సీఎం వివరించారు.
* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు భాజపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ చెన్నై సౌత్ నుంచి బరిలో దించింది. అలాగే, కోయంబత్తూరు నుంచి భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై పోటీ చేస్తున్నారు.
* ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్‌గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదని స్పష్టం చేశారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి.. మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. గురువారం మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
* మోహన్‌బాబు (Mohan Babu) పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన వ్యాఖ్యలు అంతటా చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. పది మందితో కలిసి ముందుకుసాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండంటూ యువతను ఉద్దేశించిన ఆయన అన్న మాటలను పలువురు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై స్పష్టత నిచ్చారు. ఏ రాజకీయ పార్టీని ఉద్దేశించి తాను మాట్లాడలేదన్నారు.
* జగన్ గత హామీలపై బదులిచ్చాకే.. బస్సు యాత్ర చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్) వేదికగా ఆయన పోస్టు చేశారు. ఐదేళ్ల పదవీ కాలాన్ని దోపిడీకి వెచ్చించారని విమర్శించారు. 99 శాతం హామీల అమలు అనే జగన్ మాట బూటకమని విమర్శించారు. విశ్వసనీయతపై సీఎం కబుర్లు అతిపెద్ద నాటకమంటూ ధ్వజమెత్తారు. జగన్ మోసాలపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విడుదల చేసిన వీడియోను చంద్రబాబు రీపోస్టు చేశారు.
* తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఎంపీ, మిగిలిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై ఇరువురూ మాట్లాడుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై నేతలిద్దరూ సుమారు గంటపాటు చర్చించుకున్నారు.
* ఐదేళ్లుగా ఏపీ వెనుకబడిపోయిందని తెదేపా నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ అన్నారు. రాజధాని లేక రాష్ట్రం దిక్కులేనిదిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవన్లో ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. ‘‘వైకాపా పాలనతో ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. దోపిడీ పెరిగిపోయింది. ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం.. అన్ని రంగాల్లో వెనుకబడేందుకు కారణమైంది. ఉచితాల వల్ల ప్రయోజనం ఉండదు. దాని బదులు ఉపాధి మార్గం చూపితే ప్రజల జీవితం మెరుగుపడుతుంది. చంద్రబాబు సీఎం అయితేనే ఏపీ మళ్లీ గాడిలో పడుతుంది.’’ అని మురళీమోహన్ అన్నారు.
* లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు గురువారం ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, ఎన్నికల బాండ్ల అంశాలపై నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ పార్టీని దెబ్బతీసేందుకే ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ డబ్బులేకపోవడంతో ప్రచారం చేయలేకపోతున్నామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి పాల్పడుతున్న నేరపూరిత చర్య ఇది. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. ఈ రోజుల్లో అకౌంట్లు పనిచేయకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఎలాంటి లావాదేవీలు చేయలేని పరిస్థితి. ఎన్నికల వేళ ప్రచారం కోసం ప్రకటనలు ఇవ్వలేకపోతున్నాం. మా నేతలను ఎక్కడికీ పంపించలేకపోతున్నాం. విమాన ప్రయాణాలు పక్కనబెట్టండి.. కనీసం రైలు టికెట్లు కొనడానికీ మా వద్ద డబ్బుల్లేవ్’’ అని రాహుల్ గాంధీ తెలిపారు.
* గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలను ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, కె.రఘువీరారెడ్డిలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్ మీనా ఆదేశించారు.
* రజాకార్ సినిమా (Razakar Movie) నిర్మాత గూడూరు నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల నివేదిక ఆధారంగా నారాయణరెడ్డికి భద్రతగా 1+1 సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయిస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
* నగరంలోని పాస్‌పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలతో సర్వర్ పనిచేయలేదని అధికారులు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా పలు చోట్ల సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలిపారు. విజయవాడ పాస్‌పోర్టు కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్నారు.
* వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం అంతంపల్లి, జంగంపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో పొలాలను మంత్రి పరిశీలించారు. వర్షం కారణంగా పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు పరిహారం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
* చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త సారథిని నియమించింది. యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ కీలక ప్రకటన చేసింది. భారత మాజీ కెప్టెన్, ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్‌గా నిలిపిన ఎంఎస్ ధోనీ స్థానంలో రుతురాజ్‌కు బాధ్యతలు అప్పగించింది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో సూచీలు రాణించాయి. కీలక వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తూనే.. ఈ ఏడాదిలోనే మూడుసార్లు వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందని ఫెడ్ చీఫ్ సంకేతాలు ఇవ్వడం సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ రాణించాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z