Movies

“వివేకం” సినిమా నిలుపుదల-NewsRoundup-Mar 27 2024

వివేకం సినిమా నిలుపుదల-NewsRoundup-Mar 27 2024

* యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక .. 60 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.‘‘చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్‌. ఆయనో అబద్ధాల కోరు. బోగస్‌ సర్వేలు చేయిస్తారు. రాజకీయాలకు పనికిరాడు. పేదల మనిషి ఎవరో.. పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. మేం ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుంది. ఐదేళ్ల ప్రజల ఆవేదన.. వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలి.

* ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్‌ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) సర్క్యులర్‌ జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్‌ పత్రం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి.. సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. పింఛను పంపిణీ సమయంలో వాలంటీర్లు ఎలాంటి ప్రచారం నిర్వహించకూడదని పేర్కొన్నారు. పంపిణీ చేసినట్టుగా ఫొటోలు, వీడియోలు తీయవద్దని సెర్ప్‌ తేల్చి చెప్పింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించినట్టు తేలితే చర్యలు తీవ్రంగా ఉంటాయని సెర్ప్ సీఈవో కార్యాలయం స్పష్టం చేసింది.

* నటుడు సిద్ధార్థ్‌ (Siddharth).. తన ప్రియురాలు, నటి అదితి రావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం ఉదయం వీరి పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, అతి తక్కువ మంది బంధువులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సినీ ప్రముఖుల కోసం త్వరలోనే విందు ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, పెళ్లి విషయంలో ఇరు వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

* మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రస్తుతం ఈడీ (ED) కస్టడీలో ఉన్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. డయాబెటిక్‌తో బాధపడుతున్న ఆయనకు కస్టడీలో షుగర్‌ లెవల్స్‌ దారుణంగా పడిపోయాయని ఆమ్‌ఆద్మీ పార్టీ వర్గాలు ఆరోపించాయి. ‘‘చక్కెర స్థాయిల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటున్నట్లు తెలుస్తోంది. ఒక దశలో షుగర్‌ లెవల్‌ 46ఎంజీ స్థాయికి పడిపోయింది. ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితి అని వైద్యులు చెబుతున్నారు’’ అని ఆప్‌ వర్గాలు పేర్కొన్నాయి. అంతకుముందు కేజ్రీవాల్‌ సతీమణి సునీత కూడా తన వీడియో సందేశంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కలిసినప్పుడు షుగర్‌ లెవల్స్‌ పడిపోతున్నట్లు చెప్పారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిద్దాం’’ అని అన్నారు.

* ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్‌ (Prabhas). తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. లండన్‌లో విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా షూట్స్‌, వెకేషన్స్‌ కోసం అక్కడికి వెళ్లినప్పుడల్లా అదే ఇంట్లో ఉండేవారని.. రూ.కోటి వరకు అద్దె చెల్లించేవారని సమాచారం. ఆ ఇల్లు బాగా నచ్చడంతో భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

* ఓ రాజకీయ నేత కరెన్సీ నోట్లపై నిద్రించిన ఓ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అవన్నీ రూ.500 నోట్లే. అస్సాంలోని ఉదాల్‌గిరి జిల్లాకు చెందిన బెంజామిన్‌ బసుమతారీ అనే నేత వ్యవహారమది. బోడోలాండ్‌ నేత అయిన బెంజామిన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలులో అక్రమాలకు పాల్పడ్డారంటూ నమోదైన కేసుల్లో నిందితుడు. ఆయన విలేజ్‌ కౌన్సిల్ డెవలప్‌మెంట్‌ కమిటీ (VCDC) ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఈ పథకాల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకున్నారని ఆ ఆరోపణల సారాంశం. ఈ క్రమంలోనే తాజా చిత్రం వైరల్ అవుతోంది. దాంతో అవినీతి వ్యతిరేక పార్టీగా పేరుగాంచిన యునైటెడ్ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

* లోక్‌సభ ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు సుప్రియా శ్రీనేత్‌లకు నోటీసులు పంపింది. మార్చి 29 సాయంత్రం లోగా వీటిపై తమకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆ ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరంగా, చెడు అభిప్రాయంతో కూడుకున్నవిగా ఉన్నాయని ఈసీ పేర్కొంది. వీరిద్దరూ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని, ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు గౌరవప్రదంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా సూచించింది.

* తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2024)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌ https://tstet2024.aptonline.in/tstet/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం.. ఆన్‌లైన్‌ ఆధారిత టెట్‌ పరీక్ష మే 20 నుంచి జూన్‌ 3 మధ్య రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు; అలాగే, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉంటాయి. మే 15 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి వస్తాయి. టెట్‌ ఫలితాలు జూన్‌ 12న విడుదల చేస్తారు.

* ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్యే, ఎంపీగా ఎన్నిక కావాలంటే రూ.కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు.

* పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్‌ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పాలనలో రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదన్నారు. అన్నదాతల్లో బాధ మొదలైందని, యువత ఆవేదనతో ఉన్నారని చెప్పారు.

* మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో మొన్నామధ్య జర్మనీ ప్రకటన విడుదల చేయగా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా స్పందించింది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన భారత్‌ చర్యలు చేపట్టింది. దిల్లీలోని యూఎస్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.

* అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్‌, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్‌ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు.

* ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధికి కీలక హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లో అవినీతి పరులు దోచుకున్న పేద ప్రజల సొమ్ముని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసిందని, తిరిగి ఆ సొమ‍్మును వారికే చెందేలా కృషి చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్‌లోని ఆయా లోక్‌సభ స్థానాల బీజేపీ అభ్యర్ధులకు స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ఎన్నికల ప్రచారంపై ఆరా తీస్తున్నారు. మంగళవారం సందేశ్‌ఖాలీ బాధితురాలు, బసిర్‌హట్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో మాట్లాడిన మోదీ.. ఇవాళ పశ్చిమ బెంగాల్‌ కృష్ణానగర్‌ లోక్‌సభ అభ్యర్ధి, తృణముల్‌ కాంగ్రెస్‌ మహిళా నేత మహువా మొయిత్రాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి రాజమాత అమ్రితా రాయ్‌తో మాట్లాడారు.

* ఏపీలో ప్రధాన పార్టీల మధ్య సినిమాల యుద్ధం కొనసాగుతుంది. అధికార వైసీపీ గత ప్రభుత్వాల ప్రతినిధులపై రెండు సినిమాలు తీస్తే తామేమి తక్కువ కాదంటూ వైసీపీ ఆగడాలపై టీడీపీ నాయకులు మరో చిత్రం తీసి విడుదల చేశారు. వైఎస్‌ వివేకానంద హత్య (YS Viveka Murder) కు సంబంధించిన వివరాలతో కూడిన వివేకం (Vivekam) అనే చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. వివేకా హత్య కేసు కోర్టులో ఉండగానే తప్పుడు రీతిలో సినిమా చిత్రీకరించారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మార్చి 20న కేంద్ర ఎన్నికల సంఘానికి (Central Election Commission) ఫిర్యాదు చేశారు. రాజకీయపార్టీకి సంబంధించిన పలు సన్నివేశాల్లో వైఎస్సార్‌సీపీ జెండాలను పోలి ఉండేలా తీర్చిదిద్దారని , పలు పాత్రలకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్ పేరు సహా ఇతర పాత్రలను కూడా అదే పేర్లతో ఉచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చిత్రం రాష్ట్రంలో హింసను ప్రేరేపించేలా ఉందని, ఈ సినిమాను యూట్యూబ్‌లో ప్రదర్శించడం, వివేకా బయోపిక్‌కామ్‌ అనే వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్‌ చేయడం సరికాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చిత్రాన్ని బ్యాన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ చిత్రాన్ని లైవ్ స్ట్రీమింగ్‌ కాకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌కు బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z