Politics

సీఎం అయినా సరే…ఎవరినీ వదిలిపెట్టను-NewsRoundup-Apr 03 2024

సీఎం అయినా సరే…ఎవరినీ వదిలిపెట్టను-NewsRoundup-Apr 03 2024

* తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. 33 జిల్లాలకు 10 మంది ఐఏఎస్‌లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో తాగునీటి సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది.

* కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌కు పంపారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది.

* మంత్రి కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు కేకే మహేందర్‌రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో, సంబంధంలేని విషయాల్లో తన పేరు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. వారం రోజుల్లో క్షమాపణ చెప్పాలని, లేదంటే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఏ మాత్రం సంబంధం లేకపోయినా.. పదే పదే తనపేరును కుట్రపూరితంగా ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాట్లాడుతున్న వీరిపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. ముగ్గురు నేతలతో పాటు కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్‌ ఛానళ్లకు కూడా కేటీఆర్‌ మరో మారు నోటీసులు పంపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అయినా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు.

* జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నేడు చేపట్టాల్సిన తెనాలి పర్యటన వాయిదా పడింది. ఆయన ఆరోగ్యం సరిగా లేనందున ఈ నిర్ణయం తీసుకున్నారు. తెనాలిలో నిర్వహించాల్సిన రోడ్‌ షో, బహిరంగ సభ రద్దయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ మంగళవారం ఎండలో 20 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

* లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు జోరందుకున్నాయి. తాజాగా ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. హస్తం పార్టీని వీడి భాజపా గూటికి వెళ్లారు. బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా వేసుకున్నారు.

* భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రాంతాలకు మరోసారి అధికారికంగా పేర్లు పెట్టి, రెచ్చగొట్టేందుకు చైనా యత్నించింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చైనా 30 ప్రాంతాలకు పేర్లు పెడితే.. మనం 60 ప్రదేశాలకు పేర్లు మార్చాలని అన్నారు.

* సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా అధిక రాబడులు, ఉద్యోగాలు అంటూ వినూత్న పద్ధతుల్లో ప్రజల్ని బోల్తా కొట్టించి పెద్దఎత్తున డబ్బులు ఎగరేసుకుపోతున్నారు. తాజాగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి దగ్గర హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ అని నమ్మించి రూ.రెండున్నర లక్షలు కొట్టేశారు.

* వైజాగ్‌ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. చెన్నై ఓడిపోయినప్పటికీ అతడి ఆట అభిమానులను అలరించింది. ధోనీ ఆటను చూశాక.. దూకుడు ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. బ్యాటింగ్‌లో మరింత ఆటను చూడాలని ఉంది. అందుకే, అతడు ఆర్డర్‌లో ముందుకురావాలి’ అని ఆసీస్‌ మాజీ క్రికెటర్లు బ్రెట్‌ లీ అన్నారు.

* ఐక్యరాజ్య సమితి(ఐరాస)లో భారత్‌ శాశ్వత సభ్యత్వంపై చర్చలు జరుగుతున్న సమయంలో భారత తొలి ప్రధాని నెహ్రూ భారత్‌ను కాదని చైనాకు ప్రాధాన్యమిచ్చారని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ నాటి ఘటనలను గుర్తుచేశారు. ఆయన చేసిన కొన్ని తప్పిదాలే నేడు పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్(పీవోకే), చైనా రూపంలో భారత్‌ను ఇబ్బందిపెడుతున్నాయన్నారు.

* ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా దేశాధినేతలు బైడెన్‌, జిన్‌పింగ్‌ ఫోన్‌లోనే పరస్పరం వాగ్వాదానికి దిగారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ కాల్‌ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో టెన్షన్‌ను మరింత పెంచింది.

* వైకాపా నేతలు అమరావతిలో 3 రాజధానుల శిబిరం ఎత్తేసి.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. నాలుగేళ్లుగా మందడం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు వద్ద 3 రాజధానుల శిబిరం నిర్వహిస్తున్న వైకాపా అనుబంధ బహుజన పరిరక్షణ సమితి నేతలు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలిసి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ వల్ల లాభం జరుగుతుందని నమ్మి మోసపోయామని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు.

* ఎన్టీఆర్‌ (NTR) ద్విపాత్రాభినయంలో నటించిన యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ‘అదుర్స్‌’ (Adhurs). కోన వెంకట్‌ కథ అందించగా వి.వి.వినాయక్‌ తెరకెక్కించారు. దాదాపు పద్నాలుగేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌.. చారి పాత్రలో కనిపించి కడుపుబ్బా నవ్వించారు. ఆయన కామెడీ టైమింగ్‌కు సినీప్రియులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లోని ది బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా సీక్వెల్‌ను ఉద్దేశించి కోన వెంకట్ తాజాగా స్పందించారు. తారక్‌తో తప్పకుండా ‘అదుర్స్‌ 2’ చేస్తానని చెప్పారు.

* యాపిల్‌ (Apple) ఉత్పత్తులను వినియోగించే యూజర్లకు కేంద్రం భద్రతాపరమైన హెచ్చరికలు చేసింది. ఐఫోన్‌ (iPhone), మ్యాక్‌బుక్స్‌, ఐప్యాడ్స్‌, విజన్‌ ప్రో హెడ్‌ సెట్లకు ‘హై-రిస్క్‌’ అలర్ట్‌ ఇచ్చింది. ఈ ఉత్పత్తుల్లో ‘రిమోట్‌ కోడ్‌ ఎగ్జిక్యూషన్‌’కు సంబంధించి క్లిష్టమైన సెక్యూరిటీ లోపం ఉన్నట్లు తాము గుర్తించామని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ ఆఫ్‌ ఇండియా (CERT-In) వెల్లడించింది. ఈ లోపం వల్ల హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్‌ చేసి మన డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్‌ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. అందువల్ల యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్‌ సెక్యూరిటీ వెర్షన్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనోమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు సెర్ట్‌-ఇన్‌ వెల్లడించింది.

* దాదాపు ఐదేళ్ల తర్వాత విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం వేదికగా ఐపీఎల్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కింది. దిల్లీ తన రెండో సొంత మైదానంగా దీనిని ఎంపిక చేసుకుంది. చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఆ జట్టు గెలిచినా.. అభిమానుల మద్దతు మాత్రం చెన్నైకు ఉండటం విశేషం. దానికి కారణం ఎంఎస్ ధోనీ. దాదాపు సంవత్సరం తర్వాత బ్యాటింగ్‌ చేసిన అతడు ఈ మ్యాచ్‌లో విజృంభించాడు. తమ అభిమాన జట్టు ఓడిపోయినా.. ధోనీ ఇన్నింగ్స్‌తో అభిమానులు సంతోషంగా ఇంటికెళ్లారు. ఇప్పుడు కోల్‌కతాతో దిల్లీ తలపడనున్న నేపథ్యంలో అందరి దృష్టి రిషభ్‌ పంత్‌పైనే ఉంది. చెన్నైపై హాఫ్‌ సెంచరీ సాధించిన అతడి నుంచి మరోసారి అలాంటి ప్రదర్శననే కోరుకోవడం సహజమే. డేవిడ్ వార్నర్‌ ఎలానూ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఈ సీజన్‌లో తొలిసారి బరిలోకి దిగిన పృథ్వీ షా ఆకట్టుకున్నాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. తనపై ఉన్న అంచనాలను అందుకున్నాడు. అయితే, ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ మాత్రం తన స్థాయికి తగ్గట్లు రాణించలేదు. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, కుల్‌దీప్, ముకేశ్‌ ఉత్తమ ప్రదర్శన చేశారు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఆన్రిచ్‌ నోకియా మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్నాడు.

* ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందడానికి మచిలీపట్నం వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, ఫోర్జరీ సంతకాలు, రెవెన్యూ రికార్డుల్లో కనిపించని సర్వే నంబర్లతో రూపొందించిన ఇళ్ల పట్టాలపై జగనన్న బొమ్మ ముద్రించి పంపిణీ చేసేస్తున్నారు. ఇలాంటివి కొన్ని ఇప్పటికే చెలామణిలో ఉండగా నగర పరిధిలో ఒకేసారి పెద్ద ఎత్తున పంపిణీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. దీనికోసం రహదారి మార్జిన్లు, చెరువు గట్లు, ప్రభుత్వ స్థలాలు, శ్మశానవాటికల స్థలాలపై దొంగ పొజిషన్‌ సర్టిఫికెట్లు, నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. పోలింగ్‌ తేదీ నాటికి పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో దొంగ ఇళ్ల పట్టాల పంపిణీపై జాయింట్‌ కలెక్టర్‌ విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంలో 11వ డివిజన్‌ వీఆర్‌వో శ్రీదేవిని అధికారులు సస్పెండ్‌ చేశారు.ఇళ్ల స్థలాలకు సంబంధించి హద్దులు, సర్వే నంబరు లేకుండా పట్టాలు ఎవరు సిద్ధం చేశారన్న అంశంపై అధికారులు విచారణ చేస్తున్నారు. పట్టాలను రుపోందించడంలో వీఆర్ఓ శ్రీదేవి పాత్ర ఉందని అధికారులు తేల్చారు. రాజకీయ పార్టీల ప్రొద్బలంతోనే వీటిని రూపోందించారని మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విఆర్వో శ్రీదేవిని సస్పెండ్ చేసినట్లు ఆర్డీవో తెలిపారు.

* లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చేరికలు జోరందుకున్నాయి. తాజాగా ప్రముఖ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌కు షాకిచ్చారు. హస్తం పార్టీని వీడి భాజపా గూటికి వెళ్లారు. బుధవారం ఆ పార్టీ నేతల సమక్షంలో కాషాయ కండువా వేసుకున్నారు. బాక్సింగ్‌లో భారత్‌ తరఫున తొలి ఒలింపిక్‌ పతకం సాధించిన విజేందర్‌.. గత సార్వత్రిక ఎన్నికల ముందు 2019లో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో దక్షిణ దిల్లీ నుంచి హస్తం అభ్యర్థిగా పోటీ చేసి భాజపా నేత రమేశ్‌ బిధూరీ చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది అప్పటి భారత రెజ్లింగ్‌ సమాఖ్య బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళనకు విజేందర్‌ మద్దతిచ్చారు. వారితో పాటు ఆందోళనలోను పాల్గొన్నారు.

* ప్రతీ సినిమాలోనూ తన నటనతో అలరిస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదుగుతున్నారు మృణాల్ ఠాకూర్‌. పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండతో కలిసి ఆమె నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుండటంతో దీని ప్రమోషన్స్‌ జోరందుకున్నాయి. తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో మృణాల్‌ మాట్లాడుతూ ‘సీతారామం’ హీరో దుల్కర్‌ సల్మాన్‌ ఎప్పటికీ తనకు ఇష్టమైన కోస్టార్ అని పేర్కొంది. ‘నాకు ఇష్టమైన సహనటుడు ఎవరని అడిగితే సమాధానం చెప్పడం కష్టమే. కానీ, దుల్కర్‌ సల్మాన్‌ అని చెబుతాను. ఎందుకంటే ‘సీతారామం’లో నేను చేసిన పాత్ర చాలా కష్టంగా అనిపించింది. ఆ సమయంలో దుల్కర్‌ అడుగడుగునా ధైర్యాన్నిచ్చాడు. అతడి వల్లే నేను ఆ పాత్ర చేయగలిగాను. ఇన్ని భాషల్లో నటిస్తున్నానంటే కూడా ఆయనే స్ఫూర్తి. నాకు మంచి స్నేహితుడు’ అని పేర్కొన్నారు. తన అప్‌కమింగ్‌ మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి మాట్లాడుతూ ఇది పూర్తి స్థాయి కుటుంబానికి సంబంధించిన సినిమా అని తెలిపారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Election) వేళ మాండ్య స్వతంత్ర ఎంపీ, సీనియర్‌ నటి సుమలత (Sumalatha) కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను భాజపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఈ ఎన్నికల్లో మాండ్య నుంచి ఎన్డీయే అభ్యర్థిగా బరిలో వున్న జేడీఎస్‌ నేత కుమారస్వామికి మద్దతు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేను మాండ్యను వీడను. నేను మీ కోసం పనిచేయడం రాబోయే రోజుల్లో చూస్తారు. భాజపాలో చేరాలని నేను నిర్ణయించుకున్నా’’ అని తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో సుమలత వెల్లడించారు. ‘‘నేను ఒక స్వతంత్ర ఎంపీ అయినా కేంద్ర ప్రభుత్వం మాండ్యకు రూ.4వేల కోట్లు గ్రాంటు ఇచ్చింది. ఈ నియోజకవర్గం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకొనేముందు భాజపా నేతలు ఎప్పుడూ నన్ను విశ్వాసంలోకి తీసుకుంటున్నారు. భాజపాకు మీ అవసరం ఉంది. ఈ పార్టీని వదులుకోవద్దు అని ప్రధాని మోదీ కోరినప్పుడు.. ఆయన మాటను నేను గౌరవించాలి కదా. నన్ను వేరే జిల్లా నుంచి పోటీ చేయాలని భాజపా ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించా. మాండ్య జిల్లాకు కోడలిగా ఇక్కడే ఉంటాను. నా మద్దతుదారులు కొందరు నన్ను కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. అయితే, ఆ పార్టీకి సుమలత అవసరం ఇప్పుడు లేదు.. ఇకపైనా రాదంటూ ఒక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అన్నాక.. ఆత్మాభిమానం ఉన్న వ్యక్తిగా ఆ పార్టీలోకి వెళ్లాలని ఎలా అనుకుంటాం’’ అని సుమలత తెలిపారు.

* మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల (YS Sharmila) చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉందని తెదేపా నేత బీటెక్‌ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్లు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘‘బాబాయ్‌ హత్య గురించి షర్మిల కుండబద్దలు కొట్టారు. తనను ఎంపీగా పోటీ చేయించేందుకు చిన్నాన్న ఒత్తిడి తెచ్చారని ఆమె చెప్పారు. గతంలో కడప ఎంపీగా పోటీకి ఆమె ఒప్పుకొన్నట్లు జగన్‌కు వివేకా తెలిపారు. ఆ తర్వాత అంతఃపుర రహస్యం ఏం జరిగిందో? పోటీకి షర్మిల అంగీకరించాక ఆయన హత్యకు కుట్ర జరిగింది. అవినాష్‌రెడ్డికి సిగ్గు ఉంటే ఎంపీ బరి నుంచి తప్పుకోవాలి. వివేకాను హత్య చేసిన వ్యక్తిని షర్మిలపై పోటీకి నిలిపారు. రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ వైకాపా. హంతకులు జగన్‌ చుట్టే తిరుగుతున్నారు.’’ అని బీటెక్‌ రవి అన్నారు.

* పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను నిలువరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకునేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా కుంచనపల్లి గ్రామానికి చెందిన వి.వరలక్ష్మి, మరో ఇద్దరు పింఛను దారులు ఈ పిల్‌ దాఖలు చేశారు. వాలంటీర్లు ఇంటికొచ్చి పింఛను అందించేవారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. పింఛన్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో అందజేసేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ నిన్న కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. వాలంటీర్ల వ్యవస్థలేని ఇతర రాష్ట్రాల్లో కూడా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. సజావుగా పింఛన్ల పంపిణీకి ఈసీఐ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్న నేపథ్యంలో పిల్‌ను కొట్టివేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z