తెలంగాణా రాష్ట్రంలో రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు వారి ముక్కుపిండి మరీ తిరిగి వసూలు చేస్తున్నాయి. లీగల్ నోటీసులు, మౌఖిక ఆదేశాలు, ఒత్తిళ్లతో వడ్డీతో సహా రాబట్టుకుంటున్నా యి. కొన్ని బ్యాంకులు వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఎంతోకొంత తగ్గించి వసూలు చేస్తున్నాయి. కొత్త రుణాలు కావాలంటే పాత అప్పు చెల్లించాల్సిందేనంటూ మెడపై కత్తి పెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లోని రైతుబంధు సొమ్మును లాగేసుకుంటున్నాయి. దీంతో కొందరు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి మరీ బ్యాంకులకు చెల్లిస్తున్నారు. రుణమాఫీ జరుగుతుందనే ఆశతో అప్పులు తిరిగి చెల్లించలేదని, రుణమాఫీ జరగకపోగా వడ్డీ తడిచిమోపెడు అవుతోందని గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ జరిగేవరకు వేచిచూడాలని వేడుకుంటున్నా బ్యాంకులు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బ్యాంకులు నోటీసులు..మరోవైపు వ్యవసాయశాఖ చేతులెత్తేయడం, రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందో తెలియక, కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేక రైతులు నలిగిపోతున్నారు.
తమ పార్టీని గెలిపిస్తే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. ఇప్పుడదే పార్టీ అధికారంలోకి వచి్చంది. కానీ నాలుగు నెలలైనా ఇప్పటివరకు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ మొదలు కాలేదు. కనీసం మార్గదర్శకాలు కూడా ఖరారు చేయలేదు. కానీ రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని మాత్రం ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు.. ఎలా చేయాలి? ఏ తేదీ వరకు రుణమాఫీ చేయాలి అన్న అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల కోడ్‌తో ఇప్పటికిప్పుడు రుణమాఫీకి మార్గదర్శకాలు ఖరారు చేయడం, ఇతరత్రా ప్రక్రియ మొ దలు పెట్టడం కానీ సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. దీంతో జూన్ మొదటి వారం వరకు రుణ మాఫీపై అడుగు ముందుకు పడే అవకాశం లేదు. మరోవైపు వానాకాలం సీజన్ జూన్ నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు మే నుంచే రైతులు సిద్ధం అవుతుంటారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z