DailyDose

అనిశా వలలో మాదాపూర్ ఎస్సై-CrimeNews-Apr 06 2024

అనిశా వలలో మాదాపూర్ ఎస్సై-CrimeNews-Apr 06 2024

* లంచం తీసుకుంటూ మాదాపూర్‌ ఎస్సై రంజిత్‌ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఈ కేసులో స్టేషన్‌ రైటర్‌ విక్రమ్‌ను కూడా అనిశా అధికారులు విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మాదాపూర్‌ సాయినగర్‌లో లక్ష్మణ్‌ నాయక్‌ అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే, తన స్థలంలో ఇల్లు కడుతున్నాడంటూ ఆయనపై సుధ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రంజిత్‌.. ఆయన్ని పోలీస్‌స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తన స్థలంలో ఇల్లు కట్టుకుంటే డబ్బులెందుకు ఇవ్వాలని లక్ష్మణ్‌ ఎదురు ప్రశ్నించారు. ఇవ్వకపోతే.. కూతురు, అల్లుడిపై కేసు నమోదు చేస్తామని ఆయన్ని బెదిరించారు. రూ.20 వేలు మాత్రమే ఇస్తానని చెప్పిన లక్ష్మణ్‌.. ఇదే విషయంపై అనిశా అధికారులకు ఫిర్యాదు చేశారు. గత రెండు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిపై నిఘా ఉంచిన అనిశా… లక్ష్మణ్‌ డబ్బులిస్తుండగా.. రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

* హుజూరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. టిప్పర్‌ బోల్తాపడి అందులో ఉన్న మట్టి మీద పడడంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువతులు, ఒక యువకుడు మృతి చెందారు. ఈ సంఘటన హుజూరాబాద్‌లోని బోర్నపల్లిలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక చోటుచేసుకుంది. సైదాపూర్‌ మండలం ఎలబోతారం గ్రామం నుంచి హుజూరాబాద్‌కు మట్టితో ట్రక్కు బయలుదేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి మూలమలుపు వద్ద డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో ట్రక్కు అదుపుతప్పింది. అదే సమయంలో బైక్‌పై వస్తున్న ముగ్గురు యువతీయువకులపై మట్టి పడింది. దీంతో వెంటనే వారిని హుజూరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విజయ్‌, సింధుజ ఇద్దరు మృతిచెందారు. వర్ష అనే యువతి చికిత్స పొందుతూ చనిపోయింది. మృతులు బోర్నపల్లికి చెందిన వారే. వారంతా పెద్దమ్మ బోనాల జాతరకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింంది. మృతదేహాలను హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

* లిక్కర్‌ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస​ ఎమ్మెల్సీ కవిత తీహార్‌ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఈరోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ అంశంలో తన రిప్లై ఇచ్చేందుకు సమయంలో ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో, సీబీఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్‌ పదో తేదీకి వాయిదా వేసింది. అనంతరం, అప్పటి వరకు స్టేటస్‌ కో మెయింటైన్‌ చేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

* హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్‌ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z