Business

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్-BusinessNews-Apr 07 2024

భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్-BusinessNews-Apr 07 2024

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ప్రపంచ మార్కెట్లపై ఆశావహ దృక్పథం, విదేశీ కొనుగోళ్లు మన సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలను ముందుకు నడిపించాయి. దీంతో సూచీలు భారీగా లాభపడ్డాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ రెండు సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇంట్రాడేలో 74,869.3 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకిన సూచీ.. కాస్త క్షీణించినప్పటికీ తొలిసారి 74,700 ఎగువన ముగిసింది. అలాగే, మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీ మొత్తం విలువ సైతం తొలిసారి రూ.400 లక్షల కోట్లు దాటింది. అటు నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 22,700 మార్కును దాటి చివరికి 22,650 ఎగువన స్థిరపడింది.

* భారత్‌లో మొబైల్‌ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోంది. నగదు, కార్డు ద్వారా చేసే లావాదేవీలు తగ్గిపోతున్నాయి. దీంతో మొబైల్‌ ద్వారా చేసే చెల్లింపుల (Mobile Payments) విలువ 2028లో రూ.531.8 లక్షల కోట్లు దాటుతుందని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డేటా అనలిటిక్స్‌ సంస్థ గ్లోబల్‌డేటా అంచనా వేసింది. 2024 నుంచి 2028 మధ్య 18.3 సమ్మిళిత వార్షిక వృద్ధిరేటు (CAGR) నమోదవుతుందని అంచనా వేసింది. గ్లోబల్‌ డేటా గణాంకాల ప్రకారం 2019-2023 మధ్య మొబైల్‌ ద్వారా చేసిన చెల్లింపుల (Mobile Payments) విలువ 72.1 శాతం సీఏజీఆర్‌తో రూ.202.8 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్లే ఇది సాధ్యమైందని గ్లోబల్‌డేటా పేర్కొంది. ముఖ్యంగా యూపీఐ పాత్ర చాలా కీలకమని అభిప్రాయపడింది. వేగం, భద్రత, సౌలభ్యం, తక్కువ ఖర్చు వంటి ప్రయోజనాల వల్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని వివరించింది.

* దక్షిణ కొరియాకు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీలు హ్యుందాయ్‌ మోటార్‌ (Hyundai Motor), దాని అనుబంధ కియా కార్పొరేషన్‌ (Kia Corporatio) కీలక ప్రకటన చేశాయి. విద్యుత్‌ కార్ల బ్యాటరీల కోసం దేశీయ బ్యాటరీల తయారీ సంస్థ ఎక్సైడ్‌ ఎనర్జీ సొల్యూషన్స్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. తద్వారా దేశంలో తయారు చేసే విద్యుత్‌ కార్లకు బ్యాటరీలను స్థానికంగానే సమీకరించాలని నిర్ణయించాయి. దేశంలో విద్యుత్‌ కార్లను మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు హ్యుందాయ్‌ మోటార్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

* ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తన స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌’ (SBI Amrit Kalash) పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు మార్చి 31తో ముగియగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. గతంలోనూ ఈ పథకం గడువును పలుమార్లు ఎస్‌బీఐ పొడిగించింది.

ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్‌బీఐ శాఖలు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్‌ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్‌ కలశ్‌ పథకం ప్రయోజనకరం. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. రుణ సదుపాయం కూడా ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z