DailyDose

అమెరికాలో కిడ్నాప్ అయిన తెలుగు యువకుడు మృతి-CrimeNews-Apr 09 2024

అమెరికాలో కిడ్నాప్ అయిన తెలుగు యువకుడు మృతి-CrimeNews-Apr 09 2024

* న‌కిలీ ఈ-చ‌లాన్స్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు రూటుమార్చి వాహ‌నాదారుల‌ను నిండా ముంచేస్తున్నారు. న‌కిలీ ఈ-చ‌నాల్స్ టెక్ట్స్ మెసేజ్‌ల‌ను పంప‌డంతో వాటిలో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసిన వాహ‌న‌దారులు పెద్ద‌మొత్తంలో మోసాల‌కు గుర‌వుతున్నారు. ఈ-చ‌లాన్స్‌లో వాహ‌నాల రిజిస్ట్రేషన్‌ నెంబ‌ర్లు, ఇత‌ర వివ‌రాలు స‌క్ర‌మంగా ఉండ‌టంతో అవి స‌రైన‌వేన‌నే న‌మ్మ‌కంతో బాధితులు వాటిని క్లిక్ చేస్తూ పెద్ద‌మొత్తంలో పోగొట్టుకుంటున్నారు. ఇక లేటెస్ట్‌గా ముంబైకి చెందిన ఓ వ్యాపారి ఈ త‌ర‌హా ఫిషింగ్ స్పామ్ ఎస్ఎంఎస్ రిసీవ్ చేసుకున్న అనంత‌రం రూ. 3 ల‌క్ష‌లు పోగొట్టుకున్నారు. పెద్దార్ రోడ్ ప్రాంతంలో నివ‌సించే బాధితుడికి త‌న కారుపై ఈ-చ‌లాన్‌కు సంబంధించిన ఎస్ఎంఎస్ రాగా, అందులో వివ‌రాల‌ను నిర్ధారించుకుని ఆపై ఫైన్ చెల్లించేందుకు వ్యాపారి సిద్ధ‌మ‌య్యారు. మెసేజ్‌లో వివ‌రాల ఆధారంగా వాహ‌న్‌ప‌రివాహ‌న్ అనే యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఆపై యాప్ ద్వారా పేమెంట్ చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డంతో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. అయితే ఓ వారం త‌ర్వాత త‌న క్రెడిట్ కార్డ్ నుంచి దాదాపు 31 లావాదేవీలు జ‌రిగిన‌ట్టు మెసేజ్ రావ‌డంతో కంగుతిన్నారు. రూ. 3 లక్ష‌ల వ‌ర‌కూ పోగొట్టుకోవ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించిన బాధితుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

* తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు ప్ర‌మాదం త‌ప్పింది. స్వ‌ల్ప గాయాల‌తో ర‌వికుమార్ బ‌య‌ట‌ప‌డ్డారు.

* వారిద్ద‌రూ చిన్న‌ప‌ట్నుంచి క‌లిసి చ‌దువుకున్నారు. ప్రేమ‌లో ప‌డ్డారు. ఏమైందో తెలియ‌దు కానీ.. ఇద్ద‌రూ క‌లిసే చ‌నిపోయారు. ఈ విషాద ఘ‌ట‌న క‌ర్నూల్ జిల్లాలోని మంత్రాల‌యంలో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని (20) కర్నూల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉగాది ఉండటంతో రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు(22) ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నాడు. చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇంట్లో కనిపించకపోవడంతో ఎంత వెతికినా ఫలితం లేకపోయింది. చివరకు మంత్రాలయం- మటుమర్రి రైల్వేస్టేషన్‌ల మధ్య ఉన్న టీబీ వంతెన వద్ద రైలు కిందపడి ప్రేమికులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌నే వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

* : అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. కొన్ని వారాల క్రితం క్లేవ్‌ల్యాండ్‌లో అదృశ్యమైన హైదరాబాద్‌ విద్యార్థి (Hyderabad Student) మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ (25) (Mohammed Abdul Arfath) మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారం ఎక్స్‌లో ప్రకటించింది. ‘‘మేము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్‌ అబ్దుల్‌ అర్ఫాత్‌ ఓహైయోలోని క్లేవ్‌ల్యాండ్‌లో మృతి చెందాడు. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో మేం సంప్రదింపులు జరుపుతున్నాం. మృతదేహాన్ని తరలించడానికి సహాయం చేస్తాం’’ అని పేర్కొంది.హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్‌ మార్చి 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్లేవ్‌ల్యాండ్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్‌ డిగ్రీ చేస్తున్నాడు. తమకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిందని అతడి తండ్రి మహమ్మద్‌ సలీం వెల్లడించారు. వారు 1,200 డాలర్లు డిమాండ్‌ చేస్తున్నారని.. ఇవ్వని పక్షంలో తమ కుమారుడి కిడ్నీ విక్రయిస్తామని హెచ్చరించినట్లు చెప్పారు. తాము అంగీకరించి.. అబ్దుల్‌ వాళ్ల అధీనంలోనే ఉన్నట్లు ఆధారాలు చూపాలని అడిగామన్నారు. దీనికి కిడ్నాపర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫోన్‌ పెట్టేశారని.. మళ్లీ కాల్‌ చేయలేదని అప్పట్లో సలీం తెలిపారు. కాకపోతే.. కిడ్నాపర్‌ మాట్లాడటానికి ముందు ఫోన్‌లో ఎవరిదో ఏడుపు వినిపించిందన్నారు. ఆ నంబర్‌ను అమెరికాలోని తమ బంధువులకు పంపి.. క్లేవ్‌ల్యాండ్‌ పోలీసులకు అందజేయాలని చెప్పినట్లు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z