Politics

ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన ఎంపీ-NewsRoundup-Apr 10 2024

ఎన్నికల ప్రచారంలో యువతికి ముద్దుపెట్టిన ఎంపీ-NewsRoundup-Apr 10 2024

* మద్యం కేసులో అరెస్టైన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు (Delhi High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదేం జేమ్స్‌ బాండ్ సీక్వెల్ కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ ఆప్‌ మాజీ ఎమ్మెల్యే సందీప్‌కుమార్ దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగం నిర్దేశించిన విధుల్ని నిర్వర్తించలేని పరిస్థితిలో సీఎం ఇప్పుడు ఉన్నారని, జైలు నుంచి ఆయన పనిచేయడం సాధ్యం కాదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఏ అధికారం ప్రకారం ఆయన కొనసాగుతున్నారో ప్రశ్నించి, పదవి నుంచి తప్పించాలని కోరారు. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

* భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యనేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఈనెల 21న నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో అదే రోజు భువనగిరిలో బహిరంగ సభ నిర్వహించాలని సీఎం సూచించారు.

* వైకాపా ఎమ్మెల్సీ, హిందూపురం నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత మహమ్మద్‌ ఇక్బాల్‌ తెదేపాలో చేరారు. అధినేత చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక్బాల్‌ ఇటీవలే వైకాపాకు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

* కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తమ నేతలను లక్ష్యంగా చేసుకుందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఆరోపించారు. అందులోభాగంగా తమపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)ను ప్రయోగిస్తోందన్నారు. దానికి చెందిన ఓ అధికారితో భాజపా నాయకుడికి డీలింగ్‌ కుదిరిందన్నారు. ఓ పార్శిల్‌ చేతులు మారిందని పేర్కొన్నారు.

* కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్ (Truecaller).. మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. వాట్సప్‌, టెలిగ్రామ్‌ తరహాలో ‘ట్రూ కాలర్‌ వెబ్‌’ను తీసుకొచ్చింది. దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు.

* భారత జట్టులో నికార్సైన పేస్‌ ఆల్‌రౌండర్‌ కొరత చాలా ఏళ్ల నుంచి ఉంది. ఆ స్థానం భర్తీ చేసేందుకు వచ్చిన వాళ్లు అవకాశాలను నిలబెట్టుకోవడం లేదు. ఈ ఐపీఎల్‌లో ఆ లోటును తీర్చేలా ఓ ఆంధ్రా కుర్రాడు కనిపించాడు. అతడే నితీశ్ కుమార్‌రెడ్డి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే ఇతడు హార్దిక్‌ పాండ్యతో కలిసి బాధ్యతలు పంచుకుంటాడా..? అనే చర్చకు కారణమయ్యాడు.

* హమాస్‌ యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి ఇజ్రాయెల్‌ తొలిసారి అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ‘‘నెతన్యాహూ గాజాలో తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని నేను అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను’’ అని వ్యాఖ్యానించారు.

* ‘యానిమల్‌’తో అన్ని భాషల వారికీ చేరువయ్యారు బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ (Bobby Deol). ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్‌నెస్‌తో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో రానున్న సినిమాలో (#NBK109) అవకాశాన్ని అందుకున్నారు. ఇందులో ఆయన ప్రతి నాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

* లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో ఓ భాజపా (BJP) ఎంపీ కూడా ఇటీవల ఓట్ల కోసం ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఆ సమయంలో ఓ యువతి బుగ్గపై ఆయన ముద్దు పెట్టడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బెంగాల్‌లోని ఉత్తర మాల్దా లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా ఎంపీ ఖగేన్‌ ముర్మూ (Khagen Murmu) పోటీ చేస్తున్నారు. గత సోమవారం తన నియోజక పరిధిలోని శ్రిహిపుర్‌ గ్రామంలో ఇంటింటి ప్రచారానికి వెళ్లారు. అక్కడ ఆయన ఓ యువతి చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది.

* కర్ణాటకలోని హసన్‌ (Hassan).. ఒకప్పటి హొయసల సామ్రాజ్య రాజధాని. దేశానికి తొలి కన్నడిగ ప్రధానిని అందించిన నియోజకవర్గం. జేడీఎస్‌ అధినేత దేవెగౌడ (Deve Gowda)కు పెట్టని కోట. చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన ఈ ప్రాంతంలో లోక్‌సభ ఎన్నికల (Lok sabha Elections) పోరు ఈసారి మరింత రసవత్తరంగా మారింది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ రెండు ప్రముఖ రాజకీయ కుటుంబాల మధ్యే అధికార పోరు నడుస్తుండగా.. తాజా ఎన్నికల్లో వారి మూడోతరం తలపడుతోంది. హసన్‌ నియోజకవర్గానికి మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, 33 ఏళ్ల ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లోనూ భాజపా-జేడీఎస్‌ (BJP-JDS) కూటమి అభ్యర్థిగా ఆయనే మరోసారి పోటీ చేస్తున్నారు. ప్రజ్వల్‌ ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ 31 ఏళ్ల శ్రేయస్‌ ఎం.పటేల్‌ను నిలబెట్టింది. ఈయన కర్ణాటక మాజీమంత్రి, దివంగత జి.పుట్టస్వామి గౌడ మనవడు. గతంలో ఇదే స్థానం నుంచి దేవెగౌడ, పుట్టస్వామిలు పోటీ చేయగా.. ఇప్పుడు వారి మనవళ్లు బరిలోకి దిగడం విశేషం.

* త్వరలోనే టీ20 ప్రపంచ కప్‌ కోసం జట్టును ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఎవరిని తీసుకుంటారు? ఎవరిని పక్కన పెడతారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. వరల్డ్ కప్‌ జట్టుపై భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్‌ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ల కంటే కుర్రాళ్లకే అవకాశం ఇవ్వాలని సూచించాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై మరింత దృష్టి పెట్టాలని పేర్కొన్నాడు. ‘‘స్పిన్నర్లపై శివమ్‌ దూబె అత్యుత్తమంగా ఎటాక్‌ చేస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో టాప్‌ బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్. ఫినిషర్‌గా రింకు సింగ్‌ అద్భుతం. మిడిలార్డర్‌లో వీరే కీలకం. తుది 11 మంది జట్టులో ఈ ముగ్గురికీ అవకాశం ఇవ్వాలి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలానూ ఉంటారు. వికెట్ కీపర్‌ ఎవరు అనేది ఇంకా తేలాల్సిఉంది. బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి’’ అని ఎక్స్‌లో వెంకటేశ్‌ ప్రసాద్ పోస్టు పెట్టాడు. దీంతో సీనియర్‌ ప్లేయర్లు కేఎల్ రాహుల్, హార్దిక్‌ పాండ్య, శ్రేయస్‌ అయ్యర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ ముగ్గురూ ప్రస్తుత ఐపీఎల్‌లో నాణ్యమైన ప్రదర్శన చేయడం లేదనే ఉద్దేశంతోనే మాజీ పేసర్ తన జాబితాలో అవకాశం ఇవ్వలేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

* టి తాప్సీ (Taapsee) ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచడంపై ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమన్నారు. ‘‘నా వివాహానికి సంబంధించిన విషయాలను వెల్లడించి అందరిలో ఆసక్తి పెంచాలని అనుకోవడం లేదు. దాని గురించి అందరూ చర్చించుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే బయటకు చెప్పలేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ విషయంలో నా భర్తకు మరో అభిప్రాయం ఉండొచ్చు. అందుకే మేము దీని గురించి మీడియా, సోషల్‌ మీడియాలో చెప్పలేదు. పెళ్లి చేసుకున్న సంగతిని ఎప్పటికీ రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం మాకు లేదు. నా సన్నిహితులు, కుటుంబసభ్యులు మొదటి నుంచి దీనిలో భాగమయ్యారు. వాళ్లకు అన్నీ తెలుసు. వాళ్ల అంగీకారంతోనే చేసుకున్నాం. పెళ్లి అనేది జీవితంలో ఒకేసారి జరుగుతుంది. దాన్ని ఆనందంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నా. ఆర్భాటాలకు చోటివ్వకుండా కొందరి సమక్షంలో ఒక్కటయ్యాం. నా పెళ్లి ఫొటోలు, వీడియోలను కూడా పంచుకోవడానికి ప్రస్తుతం సిద్ధంగా లేను. భవిష్యత్తులో అందరికీ షేర్‌ చేయాలనుకుంటే అప్పుడు పోస్ట్‌ చేస్తాను’ అని చెప్పారు. మార్చి 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ-మథియాస్‌ బో వివాహం జరిగింది. ఇటీవల వీరి పెళ్లి వీడియో లీకవ్వగా అది వైరల్‌గా మారింది.

* సూర్యాపేట జిల్లా గరిడేపల్లికి చెందిన మోదాల గంగయ్య పొలంలో మామిడి (Mango) చెట్టుకు ఒకే చోట 55 కాయలు కాశాయి. ఎండిపోయిందనుకున్న మామిడి చెట్టు కొమ్మ మళ్లీ చిగురించింది. ఆ చిగురే మామిడి కాయల రూపంలో ప్రతిఫలించింది. చెట్టుకు నీళ్లు పెట్టడం వల్ల కొమ్మ పూత పూసి కాయలు రావడంతో రైతు ఆనందం వ్యక్తం చేశారు.

* సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిని ప్రకటించింది. లాస్య నందిత సోదరి, దివంగత సాయన్న కుమార్తె నివేదితను భారాస అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్‌ ఎంపిక చేశారు. కంటోన్మెంట్‌ నేతలతో ఉప ఎన్నికపై చర్చించిన అనంతరం నివేదిత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా జరగనుంది.

* ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచార తీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయ పార్టీలు త్వరలో భారత్‌కు రానున్నాయి. 25 దేశాలకు చెందిన ఆయా పార్టీలను కేంద్రంలోని భాజపా ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు పార్టీల ప్రతినిధులు త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా హ్యాట్రిక్‌ కొట్టాలని ఆ పార్టీలు ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల స్థాయి, అధికార పార్టీ వ్యూహాలు వంటి అంశాలను అంచనా వేసుకోనున్నాయి. 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించగా.. వీటిలో ఇప్పటివరకు 13 ఆహ్వానాన్ని అంగీకరించాయి. జర్మనీ, బ్రిటన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లోని పార్టీ ప్రతినిధులు రానున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z