Business

తొలి ప్రైవేట్ బ్యాంకుగా HDFC రికార్డు-BusinessNews-Apr 11 2024

తొలి ప్రైవేట్ బ్యాంకుగా HDFC రికార్డు-BusinessNews-Apr 11 2024

* ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద ఉన్న ఉద్యోగుల గరిష్ఠ వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం ఇది రూ.15వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.21వేలకు చేర్చనుందనే ప్రచారం జరుగుతోంది. ఏళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఎనకమిక్‌ టైమ్స్‌ కథనంలో పేర్కొంది. కొత్త ప్రభుత్వంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడొచ్చని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగంపైనా ఆ భారం పడుతుంది. దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది. ఈపీఎఫ్‌ఓ గరిష్ఠ వేతన పరిమితి చివరిసారిగా 2014లో సవరించారు. అప్పట్లో రూ.6,500గా ఉన్న మొత్తాన్ని రూ.15వేలకు పెంచారు. మరోవైపు ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ESIC) ఇప్పటికే వేతన పరిమితిని రూ.21 వేలకు చేర్చింది. ఈపీఎఫ్‌ కూడా ఆ మొత్తానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

* విస్తారాలో (Vistara) ఇటీవల చోటుచేసుకున్న సర్వీసుల రద్దు, ఆలస్యంపై ఆ సంస్థ సీఈఓ వినోద్‌ కన్నన్‌ విచారం వ్యక్తంచేశారు. ప్రస్తుతం గడ్డు పరిస్థితులు తొలగిపోయి, కార్యకలాపాలు గాడినపడ్డాయని సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో గురువారం వెల్లడించారు. పైలట్ల మూకుమ్మడి సెలవులతో గతవారం విస్తారా విమానాలు పెద్దఎత్తున నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రణాళికలను మరింత పటిష్ఠంగా రూపొందించి ఉండాల్సిందని.. ఈ అనుభవం తమకు ఒక గొప్ప గుణపాఠమని కన్నన్‌ అన్నారు. ఆర్థిక సంవత్సరం ఆరంభం చాలా సవాళ్లతో ప్రారంభమైందని తెలిపారు. మొత్తానికి తమ కస్టమర్ల ఇబ్బందులను సామరస్యపూర్వకంగా పరిష్కరించగలిగామని చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌ 9 నాటికి విస్తారా ఆన్‌టైమ్‌ పెర్ఫార్మెన్స్‌ 89 శాతానికి చేరిందని.. ఇది పరిశ్రమలో రెండో అత్యుత్తమమని చెప్పారు.

* ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శపాలైంది కెనడాకు చెందిన ఓ కంపెనీ. సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోయటంతో దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. కొంత సొమ్ము చెల్లించి బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే, ఇలా కస్టమర్లపై జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పడం గమనార్హం. ఇటీవల భువన్‌ చిత్రాంశ్‌ అనే వ్యక్తి డీబ్రాండ్‌ (dbrand) అనే ఎలక్ట్రానిక్స్‌ యాక్సెసరీస్‌ కంపెనీ నుంచి మ్యాక్‌బుక్‌ ‘స్కిన్‌’ను కొనుగోలు చేశారు. రెండు నెలలు తిరగకముందే అది రంగు వెలిసిపోవడం ప్రారంభించింది. ఇదే విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా ఫిర్యాదు చేస్తూ కంపెనీ అధికారిక ఖాతాకు ట్యాగ్‌ చేశారు. దీనిపై స్పందించిన ఆ సంస్థ అతడి పేరులోని కొన్ని అక్షరాలను మార్చి విపరీతార్థం వచ్చేలా రాసింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక విదేశీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ బుద్ధి చెప్పారు. హద్దులు మీరుతున్నారని గుర్తు చేశారు. భారత్‌ వంటి అతిపెద్ద మార్కెట్‌ ఇకపై మీ వస్తువులను కొనుగోలు చేయకపోవచ్చునని హెచ్చరించారు. మీ ప్రతిష్ఠను దిగజార్చుకుంటారా? అని నిలదీశారు.

* హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) లక్షద్వీప్‌లోని కవరత్తీ ద్వీపంలో తొలి శాఖను ప్రారంభించింది. ఈ కేంద్రపాలిత ప్రాంతంలో బ్రాంచిని ఏర్పాటు చేసిన తొలి ప్రైవేటు బ్యాంకుగా నిలిచింది. మాల్దీవులతో వివాదం నేపథ్యంలో లక్షద్వీప్‌ (Lakshadweep) పర్యటక స్థలంగా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు అక్కడ పర్యటకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ తరుణంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తమ శాఖను ప్రారంభించడం గమనార్హం.

* దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ బోర్డులు (పీసీబీ), కమిటీల్లో 50శాతానికి పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(CPCB) జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌కు సమర్పించిన ఓ నివేదికలో ఈ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం.. 28 రాష్ట్రాల కాలుష్య మండలి నియంత్రణ బోర్డులు, ఎనిమిది కాలుష్య నియంత్రణ కమిటీల్లో మొత్తంగా 12,016 పోస్టులు మంజూరుకాగా.. వాటిలో 6,075 (50.56 శాతం) ఖాళీగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. బిహార్‌లో అత్యధికంగా 249 పోస్టులకు గాను 209 (84శాతం) ఖాళీలు ఉండగా.. ఝార్ఖండ్‌లో 271 పోస్టులకు గాను 198 (73శాతం) ఖాళీగా ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z