ScienceAndTech

అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర-NewsRoundup-Apr 12 2024

అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర-NewsRoundup-Apr 12 2024

* దిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కవితను సీబీఐ కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటలకు కవితను కోర్టులో హాజరు పర్చాలని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

* తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి నెలకొన్న వేళ కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్‌ జలాశయంలో 500 అడుగులపైన ఉన్న 14 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అందుబాటులో ఉన్న 14 టీఎంసీలలో తెలంగాణకు 8.5, ఆంధ్రప్రదేశ్‌కు 5.5 టీఎంసీల నీటిని కేటాయించారు.

* ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌ (Tejashwi Yadav) చేప వీడియోపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. వసంత నవరాత్రి సమయంలో ఇదేంటని పలువురు భాజపా నేతలు ప్రశ్నించారు. తేజస్వీ యాదవ్‌ ‘సీజనల్‌ సనాతన వాదని’, ఆయన బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ విమర్శించారు. ఈ వీడియోపై ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.

* చైనాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ తన ఉద్యోగులకు ఇచ్చిన ఆఫర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెంట్రల్ చైనాలోని రిటైల్ సంస్థ పాంగ్ డాంగ్ లాయ్‌ (సూపర్ మార్కెట్) వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ యు డాంగ్లాయ్(Yu Donglai) తమ కంపెనీకి లాభాలు తెస్తున్న ఉద్యోగులకు పదిరోజుల లీవ్‌ ఆఫర్‌ ఇచ్చారు. విధులకు హాజరు కావడానికి మానసికంగా సిద్ధంగా లేని రోజున సెలవు కోరవచ్చు. ఈ లీవ్‌ను మేనేజ్‌మెంట్‌ కుదరదని చెప్పడానికి వీల్లేదని షరతు కూడా విధించారు.

* సార్వత్రిక ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్క పౌరుడినీ భాగస్వాముల్ని చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) చర్యలు తీసుకుంటోంది. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఇప్పటి వరకు ఓటరుగా నమోదు కాని వారికి ఇచ్చిన అవకాశం మరో మూడు రోజుల్లోనే (ఏప్రిల్‌ 15తో) ముగియనుంది. ఇప్పటికే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు, 2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారందరూ కొత్తగా ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేయించుకోవచ్చు.

* రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం. ప్రజల మనిషి వివేకాను ఘోరంగా నరికి చంపేశారు. ఆయన గొడ్డలి పోట్లకు బలైపోయి ఐదేళ్లయింది. నేటి వరకు హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడలేదు. వారంతా యథేచ్ఛగా తిరుగుతున్నారు’’ అని షర్మిల అన్నారు.

* తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, మాజీ మంత్రి సిద్దార్థనాథ్‌ సింగ్‌లు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం.

* ఐఫోన్‌ (iPhone) రిపేర్‌ ప్రక్రియను ఎట్టకేలకు యాపిల్‌ సులభతరం చేయనుంది. పాత ఫోన్లలోని విడి భాగాలతో మరమ్మతులు చేసుకునేందుకు త్వరలో అనుమతించనున్నట్లు గురువారం ప్రకటించింది. వీటి వాడకం వల్ల రిపేర్‌ చేసిన ఫోన్ల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. అయితే, ఈ మార్పును కొన్ని మోడళ్లకు మాత్రమే అనుమతించనుంది. అవేంటనేది మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

* అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్‌ తోటకూర (Gopichand Thotakura) రికార్డు సృష్టించనున్నారు. ‘బ్లూ ఆరిజిన్‌’ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్‌’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లనున్నారు. 1984లో రాకేశ్‌ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్‌ టూరిస్ట్‌గా తాజాగా గోపీచంద్‌ (Gopichand Thotakura) చరిత్ర సృష్టించనున్నారు.

* తన తల్లి శోభ కోరిక మేరకు నటుడు విజయ్‌ దేవాలయం కట్టించారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఆయా కథనాలను ఉద్దేశించి శోభ తాజాగా స్పందించారు. ఆ వార్తల్లో నిజం ఉందన్నారు. ‘‘సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్‌తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతీ గురువారం నేను ఇక్కడికి వస్తుంటా. స్వామి వారిని దర్శించుకుంటుంటా. విజయ్‌ కూడా పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు’’ అని ఆమె చెప్పారు. పేదల కోసం ఇక్కడ రోజూ అన్నదానం చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది.

* ఏపీ ఇంటర్‌ ఫలితాల్లో (AP Inter Results) మొదటి సంవత్సరం 67 శాతం, ద్వితీయ సంవత్సరం 78 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 71 శాతం, బాలురు 64 శాతం పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలో బాలికలు 81 శాతం, బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

* లోక్‌సభలో భాజపా (BJP) వరుసగా రెండు సార్లు సాధించిన మెజార్టీని తమ ప్రభుత్వం ఈ దేశాభివృద్ధి కోసమే ఉపయోగించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) అన్నారు. కానీ, అంతకుముందు కాంగ్రెస్‌ (Congress) మాత్రం దశాబ్దాల పాటు తమకున్న మెజార్టీతో ఓ కుటుంబాన్ని బలోపేతం చేసిందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఎన్డీయే ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షాలకు కూడా తెలుసని ఎద్దేవా చేశారు.

* ఆప్‌ నేతలు మరోసారి సంచలన ఆరోపణలకు తెరతీశారు. రానున్న రోజుల్లో దేశ రాజధానిలో రాష్ట్రపతి పాలన విధించేందుకు భాజపా (BJP) యత్నిస్తోందని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని దిల్లీ మంత్రి ఆతిశీ(Atishi) ఆందోళన వ్యక్తం చేశారు.

* వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ (Britain) ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా (UK Family Visa) నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచింది.

* కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముందు నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న జాతీయ పార్టీలు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. దిల్లీలో క్లీన్ స్వీప్ చేసి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 స్థానాల్లో ఐదింట నెగ్గిన భాజపా.. ఈసారి మరిన్ని సీట్లు పెంచుకోవాలని యత్నిస్తోంది. సర్వేలు కూడా భాజపాకు అనుకూలంగానే ఉన్నాయి. పూర్తి కథనం

* రామాయణ మహా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) ఓ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేసిన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించనున్నారని సమాచారం. ఇప్పుడీ ఈ ప్రాజెక్ట్‌లో కన్నడ నటుడు యశ్‌ భాగమయ్యారు. భారీ బడ్జెట్‌తో సిద్ధం కానున్న ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈమేరకు ఆయన చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రా తో టీమ్‌ అప్‌ అయ్యారు. ‘‘భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లే చిత్రాలు తెరకెక్కించాలనే ఉద్దేశంతో మాన్‌స్టర్ మైండ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌ మొదలుపెట్టా. అలాంటి కథల కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈక్రమంలోనే లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఒక అత్యుత్తమ వీఎఫ్‌ఎక్స్‌ స్టూడియోతో పొత్తు పెట్టుకోవాలనుకున్నా. అది నమిత్‌ మల్హోత్రాదేనని తెలిసి ఆశ్చర్యపోయా. సినీ పరిశ్రమకు సంబంధించి మేమిద్దరం ఎన్నో అభిప్రాయాలు పంచుకున్నాం. కొత్త ప్రాజెక్ట్‌లపై చర్చలు జరుపుతున్న సమయంలో రామాయణం టాపిక్‌ వచ్చింది. ఈ చిత్రానికి సహ నిర్మాతగా పని చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించేలా గ్రాండ్‌ స్కేల్‌లో దీనిని రూపొందించనున్నాం’’ అని యశ్‌ పేర్కొన్నారు.

* తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. చంద్రబాబుతో జనసేనాని పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌, మాజీ మంత్రి సిద్దార్థనాథ్‌ సింగ్‌లు సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టో, తదుపరి ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్తు కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. పరస్పర మార్పు కోరుకుంటోన్న వివిధ స్థానాలపైనా కూటమి నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైనా నేతలు చర్చించారు. ఫోన్‌ ట్యాపింగ్‌, కొందరు ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరి, తదితర అంశాలపై నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

* ప్రపంచ ఛాంపియన్‌, దిగ్గజ బాక్సర్‌ మేరీ కోమ్‌ (Mary Kom) కీలక ప్రకటన చేశారు. వచ్చే పారిస్‌ ఒలింపిక్స్‌ (Paris Olympics)కు భారత్‌ తరఫున చెఫ్‌ డి మిషన్‌ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ (IOA) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, తనకు మరో అవకాశం లేదని మేరీ కోమ్‌ వెల్లడించారు. పారిస్‌ ఒలింపిక్స్‌లో మేరీ కోమ్‌ను చెఫ్‌ డి మిషన్‌గా నియమిస్తూ మార్చి 21న భారత ఒలింపిక్స్‌ అసోసియేషన్ ప్రకటన చేసింది. జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొనే భారత బృందానికి ఆమె లాజిస్టికల్‌ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు.

* తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు యాపిల్‌ సంస్థ సెక్యూరిటీ అలర్ట్‌ పంపింది. ఫోన్‌ ట్యాపింగ్‌, హ్యాకింగ్‌కు ప్రయత్నం జరుగుతోందని ఈమెయిల్‌లో పేర్కొంది. దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయనకు సూచించింది. మరోవైపు లోకేశ్ ఫోన్‌ను వైకాపా ప్రభుత్వమే ట్యాప్‌ చేస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌, సీఈవోకు ఫిర్యాదు చేయనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z