Politics

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో!?

ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో!?

ఖమ్మం లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆశావహులపై పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవటం, రోజుకో పేరు తెరపైకి వస్తుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేక మలుపులు తిరుగుతోంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌కు ఆదివారం రానున్నారని, అభ్యర్థి ఎంపికపై కీలక నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది. రాష్ట్రంలో మూడు స్థానాలకు మినహా మిగిలిన 14 చోట్ల అభ్యర్థులను కాంగ్రెస్‌ ప్రకటించింది. ఆయా చోట్ల అభ్యర్థులు, ముఖ్యనేతలు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను హస్తం పార్టీ ప్రకటించాల్సి ఉంది. సుమారు నెలన్నరకు పైగా చేస్తున్న కసరత్తు కొలిక్కి రావటం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్యనేతలు తమతమ కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబడుతుండటంతో అభ్యర్థి ఎంపిక ప్రక్రియ మరింత క్లిష్టంగా మారింది. ఒకవేళ తాము సూచించిన వారికి సీటు ఇవ్వటం కుదరకపోతే.. ఇంకో నేత కుటుంబీకులు, బంధువులకూ ఇవ్వొద్దంటూ షరతులు విధిస్తున్నట్లు సమాచారం.

ఖమ్మం లోక్‌సభ అభ్యర్థిత్వం కోసం దాదాపు అర డజను మంది దరఖాస్తు చేశారు. స్క్రీనింగ్‌ కమిటీలో వడపోత తర్వాత ముగ్గురు, నలుగురు పేర్లతో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా చేరింది. అధినాయకత్వం పలుమార్లు చర్చించినా అభ్యర్థిని తేల్చలేదు. మల్లు నందిని, పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, తుమ్మల యుగంధర్‌, వీవీసీ ట్రస్ట్‌ అధినేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. సీనియర్‌ నేతలు వీహెచ్‌, కుసుమకుమార్‌ తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. తాజాగా రోజుకో పేరు తెరపైకి వస్తుండటం గమనార్హం. సీనియర్‌ నేతలు మండవ వెంకటేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. బీసీ కోటాలో తమకు టికెట్‌ ఇవ్వాలంటూ నాగ సీతారాములు, లోకేశ్‌యాదవ్‌ పట్టుబడుతున్నారు. కేసీ వేణుగోపాల్‌ హైదరాబాద్‌ పర్యటనతో అభ్యర్థి ప్రకటన ఉంటుందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z