* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ 2023-24 తరహాలోనే 40,000 మంది తాజా ఉత్తీర్ణులను (ఫ్రెషర్లు) నియమించుకుంటామని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈఓ, ఎండీ కృతివాసన్ స్పష్టంచేశారు. ఇప్పటికే కళాశాల ప్రాంగణాల్లో తాము ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 మంది ఫ్రెషర్లను నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. ఆర్డర్లు, స్థిరమైన ఆదాయ వృద్ధి ఉన్నా.. ఉద్యోగుల సంఖ్య ఎందుకు తగ్గిందనేదానిపై ఆయన మాట్లాడుతూ ‘కళాశాలల్లో ఎంపిక చేసుకున్న ట్రైనీలు, మా అంతర్గత శిక్షణ అనంతరం 6-8 నెలలకు గానీ ఉత్పాదకతలోకి రారు. కాబట్టి నియామకాలు చేపట్టిన సమయానికి, వాళ్లు ప్రాజెక్టుల్లో చేరే సమయానికి మధ్య అంతరం ఉంటుంది. అందువల్ల సిబ్బంది సంఖ్య తగ్గడాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేద’ని ఆయన వివరించారు. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను మించి రాణించడంతో, టీసీఎస్ షేరు ప్రారంభ ట్రేడింగ్‌లో 1.56% పెరిగి రూ.4.063 వద్ద గరిష్ఠాన్ని నమోదుచేసింది. లాభాల స్వీకరణతో చివరకు 1.47% తగ్గి రూ.3,941.30 వద్ద ముగిసింది.
* సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్టులకు ఛార్జ్ చేయడానికి ఎలాన్ మస్క్ (Elon Musk) సిద్ధమయ్యారు. మైక్రోబ్లాగింగ్ సైట్‌లో కొత్త యూజర్లు చేసే పోస్ట్‌తో పాటు, లైక్, రిప్లయ్, బుక్‌మార్క్ చేయాలన్నా చిన్న మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావొచ్చని బిలియనీర్ వెల్లడించారు. బాట్స్, నకిలీ ఖాతాల నివారణకు ఇది తప్పకపోవచ్చని సంకేతమిచ్చారు. ఫాలో, బ్రౌజింగ్ ఉచితంగానే చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ‘ఎక్స్ డైలీ న్యూస్’ ఖాతా నుంచి వచ్చిన ఓ ప్రశ్నకు బదులిస్తూ మస్క్ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. బాట్‌ల సమస్య నివారణ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కృత్రిమ మేధ విధానాలు సమర్థంగా పనిచేయట్లేదని తెలిపారు. ‘క్యాప్చా’ వంటి పరీక్షలను చాలా సులువుగా అధిగమించగలుగుతున్నాయని చెప్పారు. దీంతో ఫీజును తీసుకొస్తామని పేర్కొన్నారు. కొత్త యూజర్లు ఫీజు చెల్లించకపోయినా ఎక్స్‌లో పోస్ట్ చేసేందుకూ అవకాశం ఇస్తామని మరొకరు అడిగిన ప్రశ్నకు మస్క్ (Elon Musk) బదులిచ్చారు. కానీ, అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత కనీసం మూడు నెలలు వేచి చూడాలన్నారు. ఈ కొత్త విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారా? లేదా? అనే విషయంలో స్పష్టత రాలేదు.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడోరోజూ నష్టాలను మూటగట్టుకున్నాయి. ‘పశ్చిమాసియా’ భయాలే ఇందుక్కారణం. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలతో పాటు ఫెడ్ వడ్డీ రేట్లపై అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో నిన్నటి అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మన మార్కెట్లూ అదే తోవలో నడిచాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ స్టాక్స్‌లో అమ్మకాలు మన సూచీలను పడేశాయి. ఉదయం 72,892.14 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా అదే బాటలో పయనించింది. ఇంట్రాడేలో 72,685.03 – 73,135.43 మధ్య చలించిన సూచీ.. చివరికి 456.10 పాయింట్ల నష్టంతో 72,943.68 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 124.60 పాయింట్ల నష్టంతో 22,147.90 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్, హిందుస్థాన్ యూనిలీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ 89.84 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
* ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఓమ్ని ఛానెల్ D2C ప్లాట్‌ఫాం ‘ఆదిత్యా బిర్లా క్యాపిటల్ డిజిటల్’ (ABCD) యాప్ ప్రారంభించింది. దీన్ని లాంచ్ చేసిన సందర్భంగా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా సేవలను అందించడమే ఈ ప్లాట్‌ఫాం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా వచ్చే మూడేళ్లలో 3 కోట్ల మంది కొత్త వినియోగదారులను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ఉన్నతాధికారి ఒకరు పేర్కోన్నారు. ఈ యాప్ తయారీ కోసం ఆదిత్య బిర్లా రూ.100 కోట్లు వెచ్చించారని సీఈఓ విశాఖ మూలే తెలిపారు. ప్రస్తుతం, ఆదిత్య బిర్లా క్యాపిటల్ తన వ్యాపారాలకు సంబంధించి.. రుణాలు, బీమా, ఆస్తుల నిర్వహణతో సహా 3.5 కోట్ల మంది వినియోగదారులకు సేవలు అందిస్తుండగా.. టెలికాం, ఫ్యాషన్, రిటైల్ వంటి ఉత్పత్తులు, సేవలు ద్వారా 25 కోట్ల మంది వినియోగదారులకు సేవలను అందిస్తోంది. ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు సంబంధించిన బీమా, క్రెడిట్, పెట్టుబడి వ్యాపారాలు రాబోయే 3-5 సంవత్సరాల్లో 19-21 శాతం వార్షిక వృద్ధి రేటుతో వృద్ధి చెందొచ్చని బిర్లా చెప్పారు.
* ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato) మరో కొత్త తరహా సేవలకు శ్రీకారం చుట్టింది. పార్టీలు, చిన్నచిన్న ఈవెంట్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు ప్రత్యేక ఫ్లీట్‌ను ప్రారంభించింది. ఇకపై ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ ఆర్డర్‌ను డెలివరీ చేయనుంది. ఈమేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయెల్ కొత్త సేవల వివరాలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశంలోనే తొలిసారిగా లార్జ్ ఆర్డర్ ఫ్లీట్‌ను ప్రారంభించినట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. 50 మంది వరకు స్నేహితులు/ కుటుంబసభ్యులతో నిర్వహించుకునే పార్టీలు/ ఈవెంట్లకు ఈ ఫ్లీట్ ద్వారా ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. ఇంతకుముందు పెద్దపెద్ద ఆర్డర్లు తీసుకున్నప్పటికీ.. రెగ్యులర్ ఫ్లీట్ డెలివరీ పార్టనర్లే అందించేవారని చెప్పారు. దీనివల్ల కస్టమర్ల అనుభవం తాము ఆశించిన స్థాయిలో ఉండేది కాదన్నారు. ఈ కొత్త వాహనాలు ఆ సమస్యకు చెక్ పెట్టనున్నాయని చెప్పారు.
* ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. పిన్ చాట్, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్.. ఇప్పుడు చాట్ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్ తీసుకురానుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్ ఒకేచోట దర్శనమివ్వనుంది. దీంతో కమ్యూనికేషన్ అనుభవం మరింత మెరుగుకానుందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది. సాధారణంగా వాట్సప్ కాంటాక్ట్స్ లిస్ట్‌లో ఓపెన్ చేయగానే చాట్ లిస్ట్ దర్శనమిస్తుంది. అందులో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారు? ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉన్నారు? అనే వివరాలు తెలియాలంటే చాట్ లిస్ట్ ఓపెన్ చేయాల్సిందే. అలాకాకుండా కాసేపటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్న వారి జాబితాను చూపిస్తే బాగుంటుంది కదూ! అదే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు వాట్సప్ సన్నద్ధమవుతోంది. వాట్సప్ ఓపెన్ చేయగానే యాక్టివ్ చాట్ లిస్ట్ కనిపించేలా కొత్త ఆప్షన్‌ను త్వరలోనే వాట్సప్ తీసుకురానున్నట్లు తెలిపింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z