* అందని ద్రాక్షగా ఉన్న చందమామ దక్షిణ ధ్రువంపైకి విజయవంతంగా ల్యాండర్‌ను దింపి అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్రను లిఖించింది భారత్. ఈ ప్రయోగం గురించి తాజాగా దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ (Somanath) మరోసారి స్పందించారు. భవిష్యత్తుల్లోనూ మరిన్ని జాబిల్లి యాత్రలు (Lunar Missions) చేపడతామని చెప్పారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆస్ట్రోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రయాన్-3 (Chandrayaan 3) విజయవంతమైంది. దాన్నుంచి డేటాను సేకరించి శాస్త్రీయ అధ్యయనం చేస్తున్నాం. ఇక, జాబిల్లిపై భారతీయుడు అడుగుపెట్టేంతవరకు చంద్రయాన్ సిరీస్‌లను కొనసాగించాలని అనుకుంటున్నాం. అంతకంటే ముందు ఇంకా చాలా సాంకేతికతలపై పట్టు సాధించాలి. అక్కడికి వెళ్లి తిరిగి రావడంపై పరిశోధనలు చేయాలి. తదుపరి మిషన్‌లో దీన్ని ప్రయత్నిస్తాం’’ అని వెల్లడించారు.
* సార్వత్రిక ఎన్నికల సమరానికి (Lok Sabha Elections) సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుండగా.. తొలి దశ పోలింగ్‌కు సంబంధించి ప్రచారానికి నేటితో తెర పడింది. రాజకీయ పార్టీల ప్రచారంతో మార్మోగిన మైకులు.. బుధవారం సాయంత్రం ఐదు గంటలకు మూగబోయాయి. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా అక్కడ ఒకేరోజు పోలింగ్ జరగనుంది. రాజస్థాన్ 12, ఉత్తర్‌ప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అయిదు చొప్పున, బిహార్‌లో నాలుగు, పశ్చిమ బెంగాల్‌లో మూడు, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్, మేఘాలయాల్లో రెండు చొప్పున, ఛత్తీస్‌గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలలో ఒక్కో లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
* ‘మోదీ వేవ్ లేదు’ అంటూ భాజపా అభ్యర్థి నవనీత్ రాణా (Navneet Rana) అన్నట్టుగా ఉన్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని తన సిటింగ్ నియోజకవర్గం అమరావతిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇదికాస్తా ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ‘‘పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ పోరాడాలి. మధ్యాహ్నం 12 కల్లా ఓటర్లందరినీ బూత్‌కు తీసుకురావాలి. మోదీ వేవ్ ఉందనే భ్రమలో ఉండకండి. 2019లో కూడా మోదీ వేవ్ ఉంది. కానీ నేను అప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాను’’ అని ఆమె అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌సీపీ మద్దతుతో అమరావతి నుంచి ఆమె విజయం సాధించారు. ఇదిలాఉంటే.. ఈ వీడియోపై ఎన్‌సీపీ(శరద్‌పవార్), శివసేన(యూబీటీ) విమర్శలు గుప్పించాయి. భాజపా క్యాడర్‌లో భయం నెలకొని ఉందన్నాయి. ‘‘మోదీ వేవ్ గురించి మర్చిపోండి. ఆయన తన సొంత స్థానాన్ని గెలుచుకోగలరా లేదా అన్నది కూడా ప్రశ్నే. భాజపా దేశవ్యాప్తంగా 45 స్థానాలు మాత్రమే గెలుస్తుందని ఇప్పటికే మన అధినేత(ఉద్ధవ్ ఠాక్రే) చెప్పారు. చివరకు ఆ పార్టీ నేతలు బహిరంగంగా నిజాలు చెప్తున్నారు’’ అని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేశారు.
* జపాన్ బుల్లెట్ రైళ్లు కచ్చితత్వానికి పెట్టింది పేరు. ఆలస్యం మాట పక్కనపెడితే నిర్దేశించిన సమయం కంటే ముందే గమ్యస్థానాలు చేరిన చరిత్రా ఉంది. అలాంటిది నగోయా-టోక్యో మధ్య ప్రయాణించిన ఒక షింకాన్‌సెన్ రైలు ఏకంగా 17 నిమిషాలు ఆలస్యమైంది. ఈ అరుదైన ఘటనకు ఓ పాము కారణమైంది..! మంగళవారం సాయంత్రం ప్రయాణికులు రైలుపై ఒక పామును గుర్తించారు. అయితే అది అక్కడకు ఎలా చేరిందో పరిశీలిస్తున్నామని సెంట్రల్ జపాన్ రైల్వే కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. సాధారణంగా ఈ రైళ్లలో పావురాలు, చిన్న కుక్కపిల్లలను తీసుకెళ్లే వీలుంది. పాములకు మాత్రం అనుమతి లేదు. కానీ, తాము ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయబోమని వెల్లడించారు. బుల్లెట్ రైలును జపాన్‌లో షింకాన్‌సెన్ అని పిలుస్తారు. ఆ దేశ భాషలో ‘కొత్త ట్రంక్‌లైన్’ అని దీని అర్థం. 1964 అక్టోబరు 1న.. టోక్యో ఒలింపిక్స్‌కు తొమ్మిది రోజుల ముందు ఈ సర్వీసు ప్రారంభమైంది. తొలుత టోక్యో నుంచి ఒసాకా మధ్య దీని రాకపోకలు సాగాయి. ప్రస్తుతం జపాన్‌లో షింకాన్‌సెన్ నెట్‌వర్క్.. 2,700 కిలోమీటర్లకు విస్తరించింది. ఈ రైళ్ల విశ్వసనీయత చాలా ఎక్కువ. ఒక ట్రిప్‌లో ఈ రైళ్ల ఆలస్యం.. సరాసరిన నిమిషం కన్నా చాలా తక్కువే ఉంటుంది. అందువల్ల ప్రయాణికులు సకాలంలో గమ్యస్థానాలకు చేరుకుంటారు. మొదట్లో ఈ రైలు గరిష్ఠ వేగం గంటకు 210 కిలోమీటర్లు. ఆ తర్వాత ఇది గంటకు 300 కిలోమీటర్లకు పెరిగింది. నిత్యం లక్షల మందికి ఇదే ప్రయాణ సాధనం.
* బెంగళూరుకు చెందిన ఓ మహిళ 270 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. హెల్మెట్ లేకుండా బండి నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్ మొదలైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఆమెకు రూ.1.36 లక్షలు జరిమానా విధించినట్లు వారు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన అనేక సీసీటీవీ కెమెరాల్లో ఆ మహిళ ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినట్లు వీడియోలు రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను, జరిమానాలను కట్టవలసిందిగా ఆమెకు వరుసగా నోటీసులు పంపారు.
* తీవ్ర ఎండలు, పొడి వాతావరణంతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వానలకు దుబాయ్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి (Dubai floods). తీవ్ర గాలులు, భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. 24 గంటల వ్యవధిలోనే 142 మి.మీ. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఈతరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారుల అంచనా. అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి.
* తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధ, గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో, గురువారం… కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ మూడు రోజుల పాటు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
* లోక్‌సభ ఎన్నికల వేళ తృణమూల్ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. కోల్‌కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆ పార్టీ ముఖ్య నేతలు ‘ఇండియా’ కూటమిలో భాగంగా పలు ప్రజా సంక్షేమ హామీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. కేంద్రంలో ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రతీ కుటుంబానికి ఏటా 10 వంట గ్యాస్ సిలిండర్లు, ఐదు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడంతో పాటు ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలుచేసి రైతులను ఆదుకుంటామన్నారు.
* మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్.. సారా వ్యాపారిగా మారారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కల్తీ మద్యం ద్వారా రూ.40వేల కోట్లు సంపాదించి.. ఆ డబ్బుతో ఓట్లు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
* భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా (USA) మరోసారి సూచించింది. ఉగ్రవాదులు ఎక్కడికి పారిపోయినా.. అక్కడికి వెళ్లి మరీ అంతంచేస్తామని ఇటీవల ప్రధాని మోదీ (Modi), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ స్పందన వచ్చింది. ‘‘ఇప్పటికే చెప్పినట్టుగా..రెండు దేశాల మధ్య అమెరికా (USA) జోక్యం చేసుకోవడం లేదు. కానీ, ఉద్రిక్తతలు నివారణకు ఆ దేశాలు చర్చల ద్వారా పరిష్కారం కనుగొనాలని సూచిస్తున్నాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ స్పందించారు. పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రవాదుల మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందంటూ యూకే మీడియా రాసిన కథనంపై కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు.
* ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయం (Ayodhya Ram Mandir)లో ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటాయి. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలి నవమి ఇదే కావడంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వామి దర్శనం కోసం దేశవిదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బాలరాముడి నుదిటిపై కన్పించిన ‘సూర్య తిలకం (Surya Tilak)’తో భక్తజనం పరవశించిపోయారు. అధునాతన సాంకేతికత సాయంతో సూర్యకిరణాలు గర్భగుడిలోని రాముడి విగ్రహం నుదుటిపై తిలకం వలే 58 మిల్లీమీటర్ల పరిమాణంలో కొన్ని నిమిషాల పాటు ప్రసరించాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z