DailyDose

టొరోంటో విమానాశ్రయ దొంగల అరెస్ట్-CrimeNews-Apr 18 2024

టొరోంటో విమానాశ్రయ దొంగల అరెస్ట్-CrimeNews-Apr 18 2024

* 20 మిలియన్‌ కెనడియన్‌ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులతో ఉన్న కార్గో కంటెయినర్‌ (cargo container)ను గత ఏడాది టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొందరు దుండగులు చోరీ చేసిన సంగతి తెలిసిందే. కెనడా చరిత్రలోనే ఈ అతిపెద్ద దోపిడీ కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులు ఉన్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనలో మరో ముగ్గురికి వారెంట్లు జారీ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 17న స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చిన విమానం టొరంటో ఎయిర్‌పోర్టులో దిగింది. దానిలో 20 మిలియన్‌ Canada డాలర్ల విలువైన బంగారం, 2.5 మిలియన్ల విలువైన విదేశీ నగదు ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో అదృశ్యమైంది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ కేసులో పురోగతి కనిపించింది. బుధవారం ఆరుగురు వ్యక్తుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దోపిడీ సమయంలో వీరిలో ఒకరు ఆ దేశ విమానయాన సంస్థ ఎయిర్‌ కెనడాలో పని చేస్తున్నారు. అలాగే ఆ సంస్థకు చెందిన కొందరు సిబ్బంది సహకరించినట్లు తెలిపారు. కెనడా ఎయిర్‌పోర్టులో ఇంత భారీ చోరీ జరగడం ఇదే తొలిసారి కాదు. 1952లో టొరంటో ఎయిర్‌పోర్టులో అప్పట్లోనే 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారం అపహరణకు గురైంది. ప్రస్తుతం దాని విలువ సుమారు 23 లక్షల డాలర్లకు సమానం. ఈ కేసు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అలాగే 1974లో అట్టావా విమానాశ్రయంలో సురక్షిత ప్రదేశంలో ఉంచిన బంగారాన్ని ఒక గార్డు తుపాకీతో బెదిరించి దొంగిలించాడు. దాని విలువ నేడు 4.6 మిలియన్‌ కెనడియన్‌ డాలర్లకు సమానం.

* కొత్త ఫోన్లు కొనుగోలు చేస్తే.. గుర్తింపు కార్డుల ఆధారంగా పట్టుకోవడం చాలా తేలిక. అదే సెకెండ్‌ హ్యాండ్‌.. థర్డ్‌ హ్యాండ్‌ ఫోన్లు అయితే గుర్తించడం కష్టం.. ఇక వాడేసిన సిమ్‌లు వినియోగిస్తే గుర్తించేదెవరు..? ఇది రామేశ్వరం కెఫే కేసు (Rameshwaram cafe blast case)లో ఉగ్రవాదుల ఐడియా. కానీ, చివరికి వారు సమర్పించిన తప్పుడు ఐడీనే పోలీసులకు బలమైన క్లూను ఇచ్చింది. తొలుత రామేశ్వరం కెఫే కేసు దర్యాప్తులో బాంబర్‌ వాడిన లిమిటెడ్‌ ఎడిషన్‌ బేస్‌బాల్‌ క్యాప్‌ దర్యాప్తు సంస్థల చేతికి చిక్కింది. వారు దాని ఆధారంగా చెన్నైలోని ఓ లాడ్జిలో తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో కర్ణాటకలో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఈక్రమంలో ఓ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ మేనేజర్‌ అయిన ముజమ్మిల్‌ షరీఫ్‌ను అరెస్టు చేసింది. వాస్తవానికి నిందితులు చెన్నైలోని లాడ్జిలో ఉండేందుకు ఓ గుర్తింపు పత్రంతోపాటు.. షరీఫ్‌కు సంబంధించిన ఫోన్‌ నెంబర్‌ ఇచ్చారు. ఆ నెంబర్‌గల సిమ్‌ను అప్పటికే షరీఫ్‌ దాదాపు ఐదు నెలల క్రితం వరకు తన ఫోన్‌లో వాడాడు. ఇది దర్యాప్తులో కీలక మలుపుగా మారింది. ఈ దాడికి లాజిస్టిక్స్‌ సాయం చేసిన షరీఫ్‌ను అధికారులకు పట్టించింది. అతడిని అరెస్టు చేసిన రోజే..ప్రధాన నిందితులైన షాజిబ్‌, తాహ పేర్లను దర్యాప్తు సంస్థ ప్రకటించింది. వీరిద్దరూ విఘ్నేష్‌, సుమిత్‌, మహమ్మద్‌ జునైద్‌ సయీద్‌ పేర్లతో ఫిబ్రవరిలో చెన్నైలోనే మకాం వేసినట్లు మార్చి 29న ఎన్‌ఐఏ గుర్తించింది.

* బిట్‌కాయిన్లతో మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖ నటి శిల్పాశెట్టి (Shilpa Shetty) దంపతులపై ఈడీ (ED) చర్యలు చేపట్టింది. ఆమె భర్త రాజ్‌కుంద్రా (Raj Kundra)కు చెందిన రూ.97.79కోట్ల స్థిర, చరాస్తులను అటాచ్‌ చేసింది. ఇందులో జుహూలోని ఓ నివాస ఫ్లాట్‌ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్లు తెలిపింది. దీంతో పాటు పుణెలోని ఓ నివాస బంగ్లా, రాజ్‌కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. ముంబయికి చెందిన ‘వేరియబుల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ అనే సంస్థ 2017లో ‘గెయిన్‌ బిట్‌కాయిన్‌ పోంజీ స్కీమ్‌’ను నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్‌కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10 శాతం లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ-లెవల్‌ మార్కెటింగ్‌ (MLM) పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబయి, దిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి రూ.6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడటంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ స్కామ్‌ మాస్టర్‌మైండ్‌ అయిన అమిత్ భరద్వాజ్‌ నుంచి రాజ్‌ కుంద్రా 285 బిట్‌కాయిన్లను తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. వీటితో ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ను ఏర్పాటు చేయాలని రాజ్‌కుంద్రా ప్రణాళికలు వేసినట్లు తెలిపింది. ఈ కాయిన్లు ఇప్పటికీ అతడి వద్ద ఉన్నాయని, ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం వాటి విలువ రూ.150 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే కేసు దర్యాప్తులో భాగంగా రాజ్‌కుంద్రా ఆస్తులను అటాచ్‌ చేసింది.

* అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్న డిప్యూటీ త‌హ‌సీల్దార్ చెంప ఛెల్లుమ‌నిపించింది ఓ మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న నారాయ‌ణ‌ఖేడ్ ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. నారాయ‌ణ‌ఖేడ్ ప‌ట్ట‌ణంలోని ఓ ఇంట్లో డిప్యూటీ త‌హసీల్దార్ నివాస‌ముంటున్నాడు. అయితే ప‌క్క పోర్ష‌న్‌లో నివాస‌ముంటున్న ఓ మ‌హిళ ప‌ట్ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. లైంగికంగా వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. అంతేకాకుండా ఫోన్‌లో వీడియోలు, ఫొటోలు తీసి వేధిస్తున్నాడ‌ని బాధిత మ‌హిళ వాపోయింది. డిప్యూటీ త‌హ‌సీల్దార్ వేధింపులు భ‌రించ‌లేని ఆమె అత‌ని చెంప ఛెల్లుమ‌నిపించింది. అనంత‌రం త‌న భ‌ర్త‌కు స‌మాచారం ఇచ్చింది. డిప్యూటీ త‌హ‌సీల్దార్‌పై బాధితురాలి భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z