Business

తమిళనాడులో Jaguar-LandRover ఈవీ ప్లాంట్

తమిళనాడులో Jaguar-LandRover ఈవీ ప్లాంట్

విద్యుత్‌ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) ఈవీలను యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. కొత్త ఈవీ విధానం ప్రకారం, కార్ల తయారీ సంస్థలు విదేశాల నుంచి ఈవీలను దిగుమతి చేసుకోవడానికి గతంలో ఉన్న సుంకాన్ని 100 శాతం నుంచి 15 శాతానికి ప్రభుత్వం తగ్గించింది. అయితే దీనికి అర్హత సాధించడానికి దేశీయంగా మూడేళ్లలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో పాటు 500 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికా సంస్థ టెస్లా ఈ విధానం కింద ప్రోత్సాహకాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, టాటా మోటార్స్‌ కూడా తన అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌ ఈవీలను దిగుమతి చేసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. తమిళనాడులో రూ.8,300 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కొత్త ప్లాంటులో జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) కార్లను తయారు చేసేందుకు టాటా మోటార్స్‌ ప్రణాళిక సిద్ధం చేస్తున్నందునే, తాజా అభిప్రాయానికి కారణమని చెబుతున్నారు. కొత్త ఈవీ పాలసీకి సంబంధించిన నిబంధనలపై చర్చించేందుకు కార్ల తయారీ సంస్థల ప్రతినిధులతో ప్రభుత్వం గురువారం సమావేశమైంది. ఇందులో హ్యుందాయ్‌ మోటార్‌ కంపెనీ, విన్‌ఫాస్ట్‌, ఫోక్స్‌వ్యాగన్‌, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్‌, మారుతీ సుజుకీ, ఎం అండ్‌ ఎం, టయోటా మోటార్‌ కంపెనీ, టెస్లా ప్రతినిధులు పాల్గొన్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z