* లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ (Kerala) నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 22వేలకు పైగా ఎన్నారై (NRI)లు కేరళకు వచ్చినట్లు అంచనా. పోలింగ్ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. కేరళలో మొత్తం 20 స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. కేరళ నుంచి లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో ఎన్నారై ఓటర్లుగా 89,839 మంది నమోదు చేసుకున్నారు. కోజికోడ్ (సుమారు 36వేలు), మళప్పురం (15వేలు), కన్నూర్ (13వేలు)తోపాటు పళక్కడ్, వయనాడ్, వడకర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు. వీరిని పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. రాష్ట్రంలో కీలకమైన వటకర స్థానం నుంచి పోటీ చేస్తోన్న యూడీఎఫ్ నేత షఫీ పరంబిల్, గల్ఫ్ దేశాల్లో ముమ్మర ప్రచారం నిర్వహించారు. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
* కేంద్ర మంత్రి, భాజపా (BJP) అభ్యర్థి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) బుధవారం అస్వస్థతకు గురయ్యారు. మహారాష్ట్ర (Maharashtra)లోని యవత్మాల్‌లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ స్పృహ కోల్పోయారు. యవత్మాల్-వాశిమ్ స్థానం నుంచి మహాయుతి కూటమి తరఫున సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గానికి చెందిన శివసేన నాయకురాలు రాజశ్రీ పాటిల్ పోటీ చేస్తున్నారు. ఆమె తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గడ్కరీ సభలో మాట్లాడుతుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇతర నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
* ప్రజల జీవితాలతో చెలగాటమాడిన జలగ.. సైకో జగన్ అని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. ‘‘తెదేపా సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబ భవిష్యత్తుకు గ్యారంటీ లభిస్తుంది. అప్పులు తెచ్చి బటన్ నొక్కడం గొప్ప కాదు. సంపద సృష్టించే, ఉద్యోగాలు కల్పించే వాళ్లు నాయకులు’’అని అన్నారు.
* సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘భారాస అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ.. కేసీఆర్‌ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. అతని పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారు’’అని వ్యాఖ్యానించారు.
* ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పటి వరకు 62వేల మంది రాజీనామా చేశారని, 900 మందిపై చర్యలు తీసుకున్నామని ఎన్నికల కమిషన్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ కోర్టుకు తెలిపారు.
* కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భారాస 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొన్నారు.
* ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(EVM) నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈసందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంది.
* లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో ‘దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక సర్వే’ హామీ రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందంటూ ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాము అలా చెప్పలేదని రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.
* వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్‌కు దీటుగా ప్రత్యేక వేదికను తెచ్చేందుకు ఎలాన్ మస్క్ సిద్ధమయ్యారు. యూజర్లు హైక్వాలిటీ వీడియోలు అప్‌లోడ్ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా టీవీ యాప్ (X TV app)ను అందుబాటులోకి తేనున్నట్లు ‘ఎక్స్’ సీఈవో లిండా యాకరినో ప్రకటించారు.
* ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ కార్యాలయం బయట వెలసిన ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా పోస్టర్లు కొత్త చర్చకు దారితీశాయి. ఆ పోస్టర్లలో ‘‘అమేఠీ ప్రజలు ఈసారి రాబర్ట్ వాద్రాను కోరుకుంటున్నారు’’ అని రాసి ఉంది. దీంతో ఈ స్థానం నుంచి రాహుల్ పోటీ ప్రశ్నార్థకంగా మారింది.
* తైవాన్‌లో మంగళవారం 6.1 తీవ్రతతో సంభవించిన భూకంప దృశ్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 80 ప్రకంపనలు రావడంతో తైవాన్ వాసులు భయంతో వణికిపోయారు. రాజధాని తైపీతో సహా, పశ్చిమ తైవాన్‌లోని పలు ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉన్నట్టు అధికారులు తెలిపారు.
* టీ20 ప్రపంచకప్ కోసం 15 మందితో టీమ్ ఇండియాను ఎంపిక చేయనున్నారు. త్వరలో దీనికోసం సెలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఒకవేళ మీకు అవకాశం వస్తే ఈ దిగువ 30 మందిలో ఎవరిని ఎంచుకుంటారు. లింక్‌లో పోల్ (Poll)లో మీ టీమ్‌ని ఎంచుకోండి. ఎక్కువమంది ఎంచుకున్న టీమ్ వివరాలను త్వరలో ప్రచురిస్తాం.
* సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) 51వ ఏడాదిలోకి అడుగుపెట్టాడు. మాస్టర్ బ్లాస్టర్‌గా క్రికెట్ అభిమానులను అలరించిన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, యువరాజ్, సెహ్వాగ్, రైనా విషెస్ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే, అందరికంటే తనకు ముందు శుభాకాంక్షలు తెలిపిన వారి గురించి సచిన్ ప్రత్యేకంగా పోస్టు పెట్టడం విశేషం. తన సతీమణి అంజలితో కలిసి ‘సచిన్ తెందూల్కర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో సచిన్ పాల్గొన్నాడు.
* వైకాపా ఎంపీ నందిగం సురేశ్‌పై ఓ వాలంటీరు పోటీకి దిగుతున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వడ్డే సంఘానికి చెందిన కట్టా ఆనంద్‌బాబు అనే వాలంటీర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి బాపట్ల పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఐదేళ్లలో ఎంపీ సురేశ్ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని, ప్రజల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. అరాచకాల్ని భరించలేకే పోటీకి దిగినట్లు ఆనంద్‌బాబు తెలిపారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో సామాన్య జీవితం గడిపే సురేశ్.. బాపట్ల ఎంపీ అయిన తర్వాత రూ.వందల కోట్లు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. అద్దంకికి చెందిన ఓ బాలింత సీఎం సహాయనిధికోసం ఉద్దండరాయునిపాలెంలోని ఎంపీ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
* చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 16 సీజన్‌లు ముగియగా.. ముంబయి, చెన్నై అయిదేసి మార్లు విజేతగా నిలిచాయి. రోహిత్‌శర్మ అత్యధికంగా ఆరు సార్లు ఐపీఎల్ టైటిళ్లు గెలవగా.. ఆ రికార్డును నిరుడు రాయుడు సమం చేశాడు. ‘‘ఫలితాల్ని చెన్నై ఎక్కువగా విశ్లేషించదు. ప్రక్రియపై దృష్టిసారిస్తుంది. ఫలితాలపై మానసికంగా ఆందోళన చెందదు. ముంబయి పూర్తిగా భిన్నం. గెలుపే ఆ జట్టు లక్ష్యం. ముంబయి సంస్కృతి విజయాలపైనే ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా గెలవాల్సిందే.. ఆ విషయంలో రాజీపడొద్దని అనుకుంటుంది. చెన్నై, ముంబయి జట్ల సంస్కృతి పూర్తిగా భిన్నం. కానీ రెండు జట్లు బాగా కష్టపడతాయి. చెన్నై జట్టులో కాస్త మెరుగైన వాతావరణం ఉంటుందన్నది నా అభిప్రాయం. అక్కడ సుదీర్ఘ కాలం ఆడొచ్చు. ముంబయి జట్టుకు ఎక్కువ కాలం ఆడితే బుర్ర పగిలిపోతుంది’’ అని రాయుడు పేర్కొన్నాడు.
* మంత్రి బొత్స సత్యనారాయణ తనకు తండ్రి సమానులంటూ సీఎం జగన్ (YS Jagan) చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై బొత్స ఎన్నో విమర్శలు చేశారని గుర్తు చేశారు. ‘‘అసెంబ్లీలో వైఎస్‌ఆర్‌ను బొత్స సత్యనారాయణ తిట్టారు.. తాగుబోతు అన్నారు. జగన్‌కు ఉరిశిక్ష వేయాలని వ్యాఖ్యానించారు. విజయమ్మను సైతం అవమాన పరిచారు. అలాంటి బొత్స జగన్‌కు తండ్రి సమానులు అయ్యారు. జగన్ కేబినెట్‌లో ఉన్నవాళ్లంతా వైఎస్‌ఆర్‌ను తిట్టినవాళ్లే. వాళ్లంతా అతడికి తండ్రులు, అక్కలు, చెల్లెళ్లు. నిజంగా ఆయన కోసం పనిచేసిన వాళ్లు మాత్రం ఏమీ కారు. ఆయన కోసమే పనిచేసి గొడ్డలి పోటుకు గురై వాళ్లూ ఏమీ కారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలో వైఎస్‌ఆర్ లేరు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి.. ఎస్ అంటే సాయిరెడ్డి.. ఆర్ అంటే రామకృష్ణారెడ్డి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.
* ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం ఆయన తన నామినేషన్ సమర్పించారు. ఈసందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పుల వివరాలను పంచుకున్నారు. సినిమాలతో పాటు, వివిధ వ్యక్తిగత అవసరాల కోసం పవన్ రూ.46.70 కోట్ల అప్పు చేసినట్లు అఫిడవిట్‌లో తెలిపారు. అత్యధికంగా విజయ్ లక్ష్మి వి.ఆర్. నుంచి రూ.8 కోట్లు అప్పుగా చేయగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి రూ.10 లక్షలు మాత్రమే తీసుకున్నారు. చిరంజీవి సతీమణి, పవన్ వదిన వద్ద రూ.2 కోట్లు అప్పు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
* స్క్రాప్ మెటీరియల్ మాఫియా (Scrap Mafia) ద్వారా అక్రమంగా రూ.కోట్లు సంపాదించిన రవి కానా, అతడి ప్రియురాలు కాజల్ ఝా ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. థాయ్‌లాండ్ పోలీసులు వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. నోయిడా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి కానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్. స్క్రాప్ మెటీరియల్‌ను సేకరించి అమ్మేందుకు రానా 16 మందితో కూడిన గ్యాంగ్‌ను నడిపేవాడు. దిల్లీలోని పలువురు వ్యాపారవేత్తలను మోసగించి అనతికాలంలో రూ.120 కోట్లకు పైగా సంపాదించాడు. దోపిడీ, కిడ్నాపింగ్ వంటి పలు కేసుల్లో కీలక నిందితుడు. రానాతో సహా గ్యాంగ్‌లోని వారిని పట్టుకునేందుకు నోయిడా పోలీసులు ప్రణాళిక వేశారు. ఈ క్రమంలోనే థాయ్‌లాండ్ పోలీసులతో సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.
* పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 తెదేపా సానుభూతి కుటుంబాలను 2019లో రాజకీయ కక్షలతో వైకాపా నేతలు గ్రామ బహిష్కరణ చేశారు. దీంతో ఆ కుటుంబాలకు చెందిన వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక తమపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేశారని, గ్రామంలో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. బెదిరింపులు తాళలేక ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని, గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు నర్రా శ్రీనివాస్, ముప్పాల బాలకృష్ణ వాదనలు వినిపించారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z