* టీ20 ప్రపంచకప్ జట్టులోకి రింకూ సింగ్ (Rinku Singh)కు స్థానం కల్పించకపోవడం అతిపెద్ద షాక్‌గా క్రికెట్ మాజీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనీని తలపించేలా మ్యాచ్‌లకు అద్భుతమైన ఫినిషింగ్‌ను ఇవ్వగల సత్తా అతడి సొంతం. కేవలం 15 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతడు 176 స్ట్రైక్ రేటుతో 356 పరుగులు సాధించాడు. సగటు 89. ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో అతడు 82 బంతులు ఆడి 150 స్ట్రైక్ రేటుతో 123 పరుగులు చేశాడు. హార్దిక్, అర్ష్‌దీప్ వంటి వారి ఎంపికకు ఐపీఎల్ ఆటతీరును ప్రామాణికంగా తీసుకోని సెలక్టర్లు.. రింకూ విషయంలో మాత్రం దానిని ఎందుకు తీసుకొన్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* జనతాదళ్ నుంచి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను మంగళవారం సస్పెండ్ చేసిన వెంటనే- ప్రత్యేక దర్యాప్తు దళం దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తునకు 18 మంది అధికారులను ప్రత్యేకంగా నియమించారు. హొళెనరసీపుర ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితురాలి (47) వాంగ్మూలాన్ని సిట్ నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న హెచ్‌డీ రేవణ్ణకు సిట్ మంగళవారం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందిన 24 గంటల్లో విచారణకు హాజరు కావాలని సూచించింది. ప్రజ్వల్‌ను అరెస్టు చేసి విచారణ చేపట్టాలని కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, విద్యార్థి సంఘాలు బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కేంద్రాల్లో ధర్నా, నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి.
* ఉస్మానియా విశ్వవిద్యాలయం మెస్‌ల మూసివేతపై దుష్ప్రచారం చేసిన కేసులో భారాస నేత క్రిశాంక్, ఓయూ విద్యార్థి నాగేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తుండగా పంతంగి టోల్‌గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఏటా వసతి గృహాల మెస్‌ల మూసివేతపై ఉస్మానియ విశ్వవిద్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అధికారులు సర్క్యూలర్ జారీ చేయగా.. వాటిపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేసి విశ్వవిద్యాలయం ప్రతిష్ఠకు భంగం కలిగించినట్టు ఓయూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్రిశాంక్, నాగేందర్‌ను అదుపులోకి తీసుకొని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
* కేసీఆర్ (KCR) పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. రాష్ట్రంలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు గతం కంటే భిన్నమన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలవాలని భాజపా చూస్తోందని.. తద్వారా దేశాన్ని అమ్మేయాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో రేవంత్ మాట్లాడారు. ‘‘బలహీన వర్గాలకు దక్కాల్సిన అవకాశాలు, నిధులు రాలేదు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ ఇచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి?ఈ అంశంపై నేను ప్రశ్నించా. మోదీ, అమిత్‌షా నాపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు రేవంత్ భయపడడు. చర్లపల్లి జైలుకు కేసీఆర్ పంపితే తిరగబడి కొట్లాడాం. మీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండొచ్చు.. నా వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు. మోదీ గుజరాత్ వ్యక్తిలా వచ్చి మనల్ని తిట్టారు.. శపించారు. ఐదు రోజుల్లో ఇస్తామన్న పసుపు బోర్డు ఐదేళ్లయినా ఇవ్వలేదు. 20 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు చూశా. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణలో పెత్తనం చేద్దామనుకుంటున్నారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి మధ్య ఈ ఎన్నికల్లో పోటీ. ప్రెస్ మీట్ పెట్టి భాజపా కుట్రలు బయటపెడతా. రాజ్యాంగాన్ని ఎలా మార్చాలని చూస్తోందో వివరిస్తా. రాజ్యాంగం మార్పు అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలోనే చేర్చారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తా. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్పినందుకు నాపై కేసా? గుజరాత్ నుంచి వచ్చి నా రాష్ట్ర నడిగడ్డపై నిలబడి సీఎంను బెదిరిస్తారా? మోదీ భయపెడితే బెదరడానికి ఇక్కడెవరూ లేరు’’ అని రేవంత్ అన్నారు.
* జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. ‘పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటని నిలదీయాలి’అని పిలుపునిచ్చారు.
* తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు.
* గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్ తప్పుగా అర్థం చేసుకుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు.
* దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్ కమిషన్ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు, షాద్‌నగర్ తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.
* పూర్తిగా అమలు చేయదగ్గ మ్యానిఫెస్టోనే తాము రూపొందించామని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కూటమి మ్యానిఫెస్టోపై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వివరించారు.
* దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఆ పార్టీ నాయకుడు జైరామ్ రమేష్ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయాధికారాన్ని కట్టబెట్టిందన్నారు.
* ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గతేడాది రిటర్నులు ఫైల్ చేయని 5 లక్షల మంది మొబైల్ ఫోన్ సిమ్ కార్డులను బ్లాక్ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది.
* టీ20 ప్రపంచకప్ కోసం (T20 World Cup 2024) భారత జట్టును ప్రకటించిన తర్వాత వివిధ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు టీమ్ సమతూకంగా ఉందని అభినందించగా.. కొందరు ఫామ్‌లో లేని వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో పెద్దగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్య సెలక్షన్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. పది మ్యాచుల్లో కేవలం 197 పరుగులు చేసిన పాండ్య 4 వికెట్లను మాత్రమే తీశాడు. అతడినే వైస్ కెప్టెన్‌గా చేయడం గమనార్హం. తాజాగా వాటిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
* దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక పోరు జరుగుతున్న లోక్ సభ స్థానాల్లో ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేస్తున్న వారణాసి(Varanasi) ముందు వరుసలో ఉంటుంది. ఈ ఎన్నికల్లో వారణాసి పార్లమెంటు స్థానం నుంచి ప్రధాని మోదీపై మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా(29) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రాజస్థాన్‌కు చెందిన ఆయన ప్రధాని మోదీ వాయిస్‌ను అనుకరిస్తూ మిమిక్రీ చేయడం వల్ల సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై శ్యామ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం జీవించే ఉంది అని తెలియజేయడానికే ప్రధానిపై పోటీకి దిగుతున్నాను’’అని పేర్కొన్నారు. ఈ వారాంతంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి ఆయన వారణాసి చేరుకోనున్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z