Business

రిటైల్ మదుపర్లకు అందుబాటులోకి కార్పోరేట్ బాండ్లు-BusinessNews-May 01 2024

రిటైల్ మదుపర్లకు అందుబాటులోకి కార్పోరేట్ బాండ్లు-BusinessNews-May 01 2024

* అమెరికాలోని డాలస్‌ నుంచి జపాన్‌ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. టెక్సాస్‌లోని హోటల్‌లో బస చేసిన విమాన పైలట్‌ ఫ్లైట్‌ బయలుదేరే సమయానికి మద్యం మత్తులో హోటల్‌ సిబ్బందితో, అతిథులతో అభ్యంతరకరంగా ప్రవర్తించినట్టుగా అధికారులు పేర్కొన్నారు. పైలట్‌ మద్యం మత్తులో ఉండడం, మరో పైలట్‌ అందుబాటులో లేని కారణంగా విమానాన్ని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ రద్దు చేసింది. అనంతరం అందులోని 157 మంది ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాలు ఏర్పాటు చేసింది. విమాన సిబ్బందిలో ఒకరికి అనారోగ్యం కారణంగా విమానాన్ని రద్దు చేస్తున్నట్లుగా ఎయిర్ లైన్స్‌ ప్రయాణికులకు తెలిపిందని స్థానిక వార్తా సంస్థ పేర్కొంది. ‘‘ఫ్లైట్‌ రద్దు చేయడం వల్ల అసౌకర్యానికి గురైన ప్రయాణికులకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాము. మా సేవలపై నమ్మకాన్ని ఉంచండి ’’ అని ఎయిర్‌లైన్స్‌ పేర్కొంది.

* ‘‘చాలామంది భారతీయులకు సరైన పెట్టుబడి సాధనం బాండ్లనే మేము ఎల్లప్పుడూ విశ్వసిస్తాం. ఎందుకంటే ఇవి ఎఫ్‌డీ కంటే మెరుగైన రాబడి ఇస్తాయి, అలాగే స్టాక్‌ కంటే తక్కువ రిస్క్‌’’ అని కామత్‌ గతంలో కూడా బాండ్లపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. బాండ్లు.. ఇప్పటివరకు సంపన్న భారతీయులు మాత్రమే ఇన్వెస్ట్‌ చేసే మదుపు సాధనంగా ఉండేవి. తాజాగా సెబీ ఆయా డెట్‌ సెక్యూరిటీల ముఖ విలువను తగ్గించడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా మదుపు చేసే అవకాశం కలిగింది అంటారు జెరోదా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, కంపెనీ సీఈఓ నితిన్‌ కామత్‌ (Nithin Kamath).

* సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) ఖాతాలకు నామినీ ఎంపికను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐచ్ఛికం (Optional) చేసింది. ఈ పెట్టుబడి సాధనంలో మదుపు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కమొడిటీ, విదేశీ పెట్టుబడుల పర్యవేక్షణకు ఒకే ఫండ్ మేనేజర్‌ ఉండటానికి ఫండ్‌ హౌస్‌లకు అనుమతించింది. సెబీ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) నిబంధనలను సమీక్షించి, వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. పై రెండు సిఫార్సులపై సెబీ విస్తృత సంప్రదింపులు జరిపింది. జాయింట్ హోల్డర్‌లకు నామినీ నిబంధనల సడలింపు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎవరైనా ఒకరికి జరగకూడనిది జరిగిన సమయంలో నిధుల బదిలీ సహా ఇరత ప్రక్రియలు సులువవుతాయని వివరించారు. జీవించి ఉన్న సభ్యుడిని నామినీగా చేర్చడాన్ని ఈ నిబంధన అవకాశం కల్పిస్తుందన్నారు.

* ఏప్రిల్‌లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు (GST Collections) రికార్డు గరిష్ఠానికి చేరాయి. ఏడాది క్రితంతో పోలిస్తే 12.4% పెరిగి రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా లావాదేవీలు 13.4% పెరగడం ఇందుకు కలిసొచ్చిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. 2017 జులైలో జీఎస్‌టీ విధానం అమల్లోకి వచ్చాక, నెలవారీ వసూళ్లకు సంబంధించి ఇదే అత్యధిక మొత్తం కావడం గమనార్హం. 2023 ఏప్రిల్‌ నాటి రూ.1.87 లక్షల కోట్లే.. ఇప్పటివరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైన సంగతి తెలిసిందే. రిఫండ్ల తర్వాత 2024 ఏప్రిల్‌లో నికర జీఎస్‌టీ రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 17.1 శాతం పెరిగి రూ.1.92 లక్షల కోట్లుగా నమోదైంది.

* రికార్డు స్థాయిలో ధరలు పెరుగుతున్నా.. దేశంలో బంగారానికి ఆదరణ మాత్రం తగ్గడం లేదు. ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ1)లో 136.6 టన్నులు (ఆభరణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ కలిపి)గా నమోదైంది. గతంతో పోల్చితే 8 శాతం పెరగడం గమనార్హం. నిరుడు జనవరి-మార్చిలో 126.3 టన్నులే. ఇక మంగళవారం విడుదలైన ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) నివేదిక ‘గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ1 2024’ ప్రకారం భారతీయ గోల్డ్‌ డిమాండ్‌ విలువ వార్షిక ప్రాతిపదికన 20 శాతం ఎగిసి రూ.75,470 కోట్లుగా నమోదైంది. నిరుడు రూ.63,090 కోట్లు. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ధరల సగటు కూడా 11 శాతం ఎగబాకడం విశేషం. కాగా, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) పెద్ద ఎత్తున చేస్తున్న పసిడి కొనుగోళ్లు కూడా డిమాండ్‌ పెరుగుదలకు కారణమవుతున్నదని డబ్ల్యూజీసీ ఈ సందర్భంగా అభిప్రాయపడింది.

* భారత్‌కు ఎలాన్‌ మస్క్‌ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్‌తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారుతున్నది. ఇండియా టూర్‌ను రద్దు చేసుకున్న మస్క్‌.. హఠాత్తుగా చైనాలో తేలారు మరి. భారత్‌లో వారం, 10 రోజుల కిందటే మస్క్‌ పర్యటించాల్సి ఉందన్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడికి రానన్న ఈ టెస్లా అధినేత.. ఆదివారం ఆగమేఘాల మీద పొరుగు దేశానికి వెళ్లారు. దీంతో దేశ, విదేశీ మీడియాల్లో ‘హలో చైనా.. గుడ్‌బై ఇండియా’ అన్న వార్తలు వస్తుండటం గమనార్హం.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z