* మానవ చరిత్రలోనే అతిపెద్ద ఎన్నికల సంవత్సరంగా 2024 నిలవనుంది. ఈసారి చాలాచోట్ల ప్రాంతీయ, జాతీయ ఎన్నికలను జనాలు చూడనున్నారు. అంతేకాదు.. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న పది దేశాల్లో ఏడుచోట్ల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో చాలా విశేషాలున్నాయి. మొత్తం 64 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
* తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులను విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రైతు భరోసా చెల్లింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్.వేణు కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు.
* ప్రజల ఓటే భారత్‌ను ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టిందని, ప్రపంచంలో దేశ పరపతి పెంచిందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. ఆయన మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనేలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ప్రజా నిర్ణయంతోనే ఆదివాసి కుమార్తె రాష్ట్రపతి అయ్యారని, మహిళలకు రిజర్వేషన్లు లభించాయని, అవినీతిపరులు జైళ్లకు పోతున్నారని, ఉచిత రేషన్ వస్తోందన్నారు.
* గుజరాత్(Gujarat)లో పోలింగ్ ఉత్సాహంగా జరుగుతోంది. దేశంలో అత్యంత అరుదుగా ఉన్న మినీ-ఆఫ్రికా గ్రామంలో కూడా పోలింగ్ హడావుడి కనిపిస్తోంది. జునాఘడ్ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే జంబుర్ (Jambur)లో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది.
* ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. పార్టీ నేతలతో దిల్లీ నుంచి కాన్ఫరెన్స్‌లో కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ, రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
* పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం (Teachers recruitment Scam) వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court) మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వానికి కఠిన ప్రశ్నలు సంధించింది. ఎంపిక ప్రక్రియ అంశం కోర్టులో ఉండగానే కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు ఎలా చేపట్టారని ప్రశ్నించింది.
* జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని (Nani) ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని తెలుపుతూ పోస్ట్ పెట్టారు. ‘పవన్ కల్యాణ్.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా. మీ వాగ్దానాలన్నింటినీ నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నా. మీకు ఎంతోమంది ప్రేమాభిమానాలు తోడున్నాయి. నా మద్దతు మీకే. ఆల్ ది బెస్ట్ సర్’ అని తెలిపారు. చిరంజీవి వీడియోను తన ఎక్స్ వేదికగా పంచుకున్న రామ్‌చరణ్ ‘భవిష్యత్ కోసం పాటుపడే నాయకుడు పవన్ కల్యాణ్‌ను గెలిపించండి’ అని పోస్ట్ చేశారు.
* తాను ఇస్లాంను, ముస్లింలను వ్యతిరేకించనని ప్రధాని మోదీ (Modi) వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతోన్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన ఈవిధంగా స్పందించారు. ‘‘అది మా విధానం కాదు. నెహ్రూ కాలం నుంచే వారు (విపక్షాలను ఉద్దేశించి) ఈ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ముస్లిం వ్యతిరేకులు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు. దానినుంచి లబ్ధి పొందాలని చూస్తున్నారు. మమ్మల్ని వ్యతిరేకులుగా చూపించి.. తాము వారికి స్నేహితులమంటూ కపట ప్రేమను ప్రదర్శిస్తారు. కానీ ముస్లిం సమాజం చైతన్యవంతంగా మారింది. ట్రిపుల్ తలాక్ రద్దు చేసినప్పుడు వారి ఆందోళనపై నేను నిజాయతీగా ఉన్నానని ముస్లిం సోదరీమణులు భావించారు. ఆయుష్మాన్ కార్డులు ఇచ్చినప్పుడు, కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చినప్పుడు వారు అలాగే భావించారు. నేను ఎవరిపైనా వివక్ష చూపడం లేదని వారు అర్థం చేసుకున్నారు. విపక్షాలు అబద్ధాలు బయటపడ్డాయి. అదే వారి బాధ. అందుకే తప్పుదోవ పట్టించేందుకు రకరకాల అబద్ధాలు చెప్తూనే ఉంటారు’’ అని మోదీ విపక్షాలపై విరుచుకుపడ్డారు.
* దారుణంగా వైఎస్ వివేకా హత్య జరిగితే సాక్షిలో హార్ట్‌ఎటాక్ అని ప్రసారం చేసింది జగన్‌మోహన్‌రెడ్డి భార్యనే కదా? అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో మంగళవారం ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవినాష్‌రెడ్డి ఏనాడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్‌లో మాట్లాడారా? అని ప్రశ్నించారు. ‘‘వివేకా హత్య జరిగిన రోజు ఎవరు చంపారో మాకు కూడా తెలియదు. సీబీఐ సాక్ష్యాలు, ఆధారాలను సేకరించాకే అవినాష్ హస్తం ఉందని తెలిసింది. అవినాష్ అమాయకుడని సీఎం జగన్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి చెబుతున్నారు. వాళ్లను అమాయకులంటే ఎవరైనా నమ్ముతారా? సాక్షాత్తూ ముఖ్యమంత్రే అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన్ను కాపాడుతున్నారు’’ అని షర్మిల ఆరోపించారు.
* ప్రభుత్వం ఇచ్చే పథకాలేవీ ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలని.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ సుమారు 70 శాతం పూర్తయిందని సీఈవో చెప్పారు. అవసరమైతే 9వ తేదీ వరకు అవకాశం కల్పిస్తామన్నారు. సొంత నియోజకవర్గాల పరిధిలోనే ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కోసం మొత్తం 4.30లక్షల మంది దరఖాస్తు చేసుకోగా. 3.30లక్షల మంది వినియోగించుకున్నారని తెలిపారు. కొన్నిచోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందన్నారు. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని వారు మంగళవారం, బుధవారం ఓటు వేయవచ్చన్నారు. సెక్యూరిటీ డ్యూటీకి వెళ్లిన వారికి ఈనెల 9న కూడా అవకాశం కల్పించినట్టు చెప్పారు.
* రావణాసురుడిని సంహరించడానికి వానరసైన్యం కలిసి వచ్చినట్టు ఏపీలో వైకాపాను అంతం చేయడానికి తెదేపా-జనసేన-భాజపా కూటమి కలిసి వస్తోందని సినీనటుడు నారా రోహిత్ (Nara Rohit) అన్నారు. రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్‌కు మద్దతుగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో నారా రోహిత్, హాస్య నటుడు రఘు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఓటుతో అందరి లాస్ట్ పంచ్ బ్యాలెట్‌పై పడి.. ఫ్యాన్ రెక్కలు తెగిపడాలని వ్యాఖ్యానించారు. కూటమి అభ్యర్థులను గెలిపించి ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్దామని రోహిత్ పిలుపునిచ్చారు.
* సార్వత్రిక ఎన్నికల వేళ.. పోలింగ్‌కు ముందే పలు పార్టీలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. నిధుల కొరత కారణంగా పలువురు అభ్యర్థులు వెనక్కి తగ్గుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. డబ్బులు లేవని, పార్టీ నుంచి సరైన మద్దతు లభించడం లేదని పార్టీలను వీడుతున్నారు. మొన్న కాంగ్రెస్‌కు ఓ అభ్యర్థి ఇలాంటి షాకే ఇవ్వగా.. తాజాగా శిరోమణి అకాలీదళ్ ఆ జాబితాలో చేరింది.
* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది. మానుకొండూర్, హుజూరాబాద్, పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, వేములవాడలో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్ జనజాతర సభకోసం కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కుప్పకూలాయి.
* జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు శివమ్ దూబె (Shivam Dube), యశస్వి జైస్వాల్ ఎంపికయ్యారు. ఎంతోమంది పోటీలో ఉన్న ఐపీఎల్ 17 సీజన్‌లో చెన్నై తరఫున మిడిల్ ఆర్డర్‌లో పవర్‌ఫుల్ ఇన్నింగ్స్‌తో అలరిస్తున్న శివమ్ దూబె వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై నమ్మకం ఉంచారు. వీరిద్దరిపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. దూబె సిక్స్‌ల హిట్టింగ్‌తో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోర్లు చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు. యశస్వి జైస్వాల్ కూడా కీలకంగా మారతాడని అభిప్రాయపడ్డాడు.
* ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. క్రెమ్లిన్‌లో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరో ఆరేళ్లు (2030 వరకు) దేశాధినేతగా ఆయన కొనసాగనున్నారు. రష్యా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం అక్కడి అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌లో ఘనంగా కొనసాగింది. ఎరుపు రంగులో ఉన్న ‘రాజ్యాంగం’ మీద ప్రమాణం చేసిన పుతిన్..దాన్ని పరిరక్షిస్తానన్నారు. దీంతో 24 ఏళ్లుగా రష్యా అధినేతగా కొనసాగుతోన్న ఆయన.. ఆధునిక రష్యాను అత్యధిక కాలం పాలించిన స్టాలిన్ రికార్డును తిరగరాయనున్నారు. ప్రచ్ఛన్నయుద్ధం ముగిసే సమయంలో జర్మనీలో సోవియట్ గూఢచారిగా ఉన్న పుతిన్, దేశాధ్యక్షుడిగా ఎదగడమే కాకుండా సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన వ్యక్తిగా నిలవనున్నారు.
* మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ (Prajwal Revanna)లపై నమోదైన లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తాజాగా దీనిపై స్పందించారు. ఎన్నికల ముందు ఆ అభ్యంతరకర వీడియోలున్న 25వేల పెన్‌డ్రైవ్‌లను పంచారని విమర్శించారు. ఈ కుట్ర వెనక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
* మెటాకు చెందిన సోషల్‌మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే కంటెంట్ క్రియేటర్ల కోసం సరికొత్త ఎడిట్ ఆప్షన్లు తీసుకొచ్చిన ఈ యాప్.. తాజాగా మరో నాలుగు ఫీచర్లను జోడించింది. ఇన్‌ఫ్లూయెన్సర్లు తమ ఫాలోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు వీలుగా వీటిని పరిచయం చేసినట్లు పేర్కొంది. ఇంతకీ ఏంటా ఫీచర్లు? ఎలా ఉపయోగించాలి? సాధారణంగా ఇన్‌స్టాలో స్టోరీ పెట్టే ముందు స్టిక్కర్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే లొకేషన్, క్విజ్, హ్యాష్‌ట్యాగ్, అవతార్.. లాంటి పలు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇకపై అందులో ‘REVEAL’ అనే మరో ఆప్షన్ కూడా దర్శనమివ్వనుంది. దాన్ని ఎంచుకోగానే ‘Message to reveal’ ఆనే ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో స్టేటస్‌కు సంబంధించిన హింట్ ఇవ్వొచ్చు.. లేదా మీకు నచ్చిన అంశాన్ని టైప్ చేసి స్టోరీగా పోస్ట్ చేయొచ్చు. మీ అనుచరులందరికీ స్టోరీపై క్లిక్ చేయగానే మొదట మీరు పెట్టిన హింట్ కనిపిస్తుంది. వారు డీఎం చేస్తేనే స్టోరీ రివీల్ అవుతుందన్నమాట. మీ స్టోరీ ఫాలోవర్లకు ఎలా కనిపిస్తుందో తెలుసుకోవడానికి ఎడమవైపు కింద ‘Preview’ ఆప్షన్ ఉంటుంది. స్టోరీ చూసేందుకు ప్రతి డీఎంను అప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు.
* ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో పలుచోట్ల గందరగోళం నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. విధులు నిర్వహించే చోట ఓటు లేదని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత నియోజకవర్గాలకు వెళ్లి వేయాలని చెప్పడంపై మండిపడుతున్నారు. దీనికోసం ఫాం-12 దరఖాస్తు చేసినా ఉపయోగమేంటని నిలదీస్తున్నారు. గుంటూరులో పోస్టల్ బ్యాలెట్ కోసం ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. నగరంలోని లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద పలువురి పేర్లు ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. ఉన్నతాధికారుల తీరుపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం రాలేదని కాకినాడ జిల్లాలో పలువురు మండిపడ్డారు. సుమారు 200 మందికి అవకాశం రాలేదంటూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సుమారు 30 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోలేకపోయారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఉద్యోగులు తమ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z