Business

జీవితకాల కనిష్ఠానికి PayTM స్టాక్ ధర-BusinessNews-May 08 2024

జీవితకాల కనిష్ఠానికి PayTM స్టాక్ ధర-BusinessNews-May 08 2024

* టాటా గ్రూప్‌నకు (Tata group) చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. ఎయిర్‌లైన్స్‌కు చెందిన సిబ్బంది ఒక్కసారిగా అనారోగ్య కారణంతో సెలవు పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కొన్ని రోజుల క్రితం ఇదే గ్రూప్‌నకు చెందిన విస్తారాలోనూ ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇంతకీ టాటా గ్రూప్‌నకు ఈ పరిస్థితి ఎందుకెదురవుతోంది? ఉద్యోగులు తరచూ ‘మూకుమ్మడి సెలవుల’పై ఎందుకు వెళుతున్నారు..? అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికే ఈ గ్రూప్‌ విస్తారా విమానయాన సంస్థను నడుపుతోంది. అయితే, కొనుగోలు తర్వాత విమానయాన సంస్థలను ఏకీకృతం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులోభాగంగా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్‌ కనెక్ట్‌ (గతంలో ఎయిరేషియా ఇండియా); ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేయాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఈ విలీనంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంస్థగతంగా నిర్వహణ లోపాలు, ఉద్యోగులపై అనుసరిస్తున్న వైఖరిపైనా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) మరోసారి ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. లోక్‌సభ ఎన్నికల వేళ మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తుండడమే ఇందుక్కారణం. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ స్టాక్స్‌లో అమ్మకాలు సూచీలపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్ల మేర లాభనష్టాల మధ్య చలించి చివరికి ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ 22,300 స్థాయిని నిలబెట్టుకుంది. సెన్సెక్స్‌ 73,225 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. మధ్యాహ్నం కాసేపు లాభాల్లోకి వచ్చినా.. మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 73,073.92 – 73,684.93 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 45.46 పాయింట్ల నష్టంతో 73,466.39 వద్ద ముగిసింది. నిఫ్టీ నిన్నటి ముగింపు వద్దే (22,302.50) స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు నష్టపోగా.. టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ, ఎల్‌అండ్‌టీ, మారుతీ షేర్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ చమురు 82.27 డాలర్లుగా ఉంది.

* భారత్‌లో ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను (Google Wallet) విడుదల చేసింది. ఇందులో లాయల్టీ కార్డులు, మూవీ టికెట్లు, పాసులు, ఐడీలను భద్రంగా స్టోర్‌ చేసుకోవచ్చు. ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. దీన్ని తీసుకురావడం వల్ల ‘గూగుల్‌ పే’పై ఎలాంటి ప్రభావం ఉండదని, దాన్ని ప్రాథమిక చెల్లింపుల యాప్‌గా కొనసాగిస్తామని గూగుల్‌ స్పష్టం చేసింది. ప్రధానంగా లావాదేవీలయేతర అవసరాల కోసమే వాలెట్‌ను రూపొందించినట్లు తెలిపింది.

* పేటీఎం బ్రాండ్ పేరెంట్ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ ఒత్తిడికి గురవుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లలో పేటీఎం షేర్ బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.317.45లతో మరో ఆల్ టైం కనిష్ట స్థాయికి పడిపోయింది. గత ఫిబ్రవరి 15 నాటి పేటీఎం షేర్ విలువ రూ.318.35 కంటే దిగువకు పడిపోయింది. దీంతో బుధవారం మధ్యాహ్నం పేటీఎం షేర్ ను ఫ్రీజ్ చేశారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పేటీఎం ప్రెసిడెంట్ కం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భావిష్ గుప్తా రాజీనామా చేయడంతో వరుసగా మూడో రోజూ పేటీఎం షేర్ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. ఆర్బీఐ ఆంక్షలు అమల్లోకి వచ్చిన తర్వాత గత కొన్ని నెలల్లో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో భవీష్ గుప్తా రాజీనామా మూడవది. గత మూడు రోజుల్లో పేటీఎం షేర్ 14 శాతం పతనమైంది. గతేడాది అక్టోబర్ 20న పేటీఎం షేర్ రూ.998.30లతో 52 వారాల గరిష్ట స్థాయి నుంచి 68 శాతానికి పడిపోయింది. అంతకుముందు ఐపీఓ ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయినప్పుడు 2021 నవంబర్ 18న పేటీఎం షేర్ రూ.1961.05లతో రికార్డు నమోదు చేసింది. షేర్ విలువ రూ.2,150 వద్ద షేర్ల విక్రయంతో పేటీఎం రూ.18,300 కోట్ల నిధులు సేకరించింది. ఇదిలా ఉంటే ఈ నెల నాలుగో తేదీన భవిష్ గుప్తా చేసిన రాజీనామాను పేటీఎం డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఈ నెల 31 నుంచి భవిష్ గుప్తా రాజీనామా అమల్లోకి వస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z