‘నామీద ఒక్క కేసు లేదని తెలంగాణ, ఆంధ్రా డీజీపీలు ఇచ్చిన ధ్రువీకరణలు ఉన్నాయి. మీరు నాపై రెరా కేసు ఉంది.. ఈడీ కేసు ఉంది అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దమ్ము, ధైర్యం ఉంటే వాటిని రుజువు చేయండి. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ తప్పుగా ఉందని రుజువు చేయండి.. అఫిడవిట్‌ను రద్దు చేయించండి!’ అని ఎన్డీయే కూటమి తరఫున విజయవాడ లోక్‌సభకు పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) సవాల్ విసిరారు. వైకాపా తరఫున తన సోదరుడు కేశినేని నాని పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన కేశినేని శివనాథ్(చిన్ని)పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో చిన్ని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కుటుంబ వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు చేస్తున్న నాని ఏనాడైనా నియోజకవర్గ ప్రజలకు సేవ చేశావా? అని ప్రశ్నించారు. ఎంపీ స్టిక్కర్లంటూ మహిళల మీద కేసులు పెట్టడమేనా మీ నైజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మోసాలకు పాల్పడితే కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
‘నేను గతంలో చేసినవి.. భవిష్యత్తులో చేసేవి చెప్తుంటే నాని మాత్రం నాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు. నానిపై ఉన్న కేసులు, ఆయన చేసిన మోసాలు మొత్తం నిరుపిస్తా. దమ్ముంటే నాపైౖ చేసిన ఆరోపణలు నిరూపించు’ అని శివనాథ్ సవాల్ చేశారు. గన్నవరం విమనాశ్రయంలో ఇంటర్నేషనల్ టెర్మినల్ పనులు 2019 నుంచి ఎందుకు ఆగిపోయాయని, పలు అంతర్జాతీయ సర్వీసులు ఎందుకు రద్దయ్యాయని.. ఈ ప్రశ్నలకు ఎయిర్‌పోర్ట్ వైస్ ఛైర్మన్‌గా ఉన్న నాని సమధానం చెప్పాలన్నారు. విజయవాడలో పై వంతెనల నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కాకుండా నాని సొంత నిధులతో కట్టించినట్లు షో చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి గురించి ఏనాడు నాని పట్టించుకోలేదన్నారు. 2014 నుంచి 1019 వరకు కొనసాగిన టాటా ట్రస్టు సేవలు తర్వాత ఎందుకు ఆగిపోయాయన్నారు. నాడు చంద్రబాబుపై నమ్మకంతో విస్తరించారని, జగన్‌రెడ్డిపై విశ్వాసం లేక నిలిపివేశారన్నారు.
కరోనా సమయంలో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడితే ఆ సమయంలో ఎక్కడ ఉన్నారని ఎంపీ నానిని శివనాథ్ నిలదీశారు. జగన్ వద్ద కోవర్టుగా ఉన్న మీకు చంద్రబాబును విమర్శించే స్థాయి లేదన్నారు. విజయవాడ అభివృద్ధికి జగన్ ఏం చేశారో చెప్పాలన్నారు. గతంలో పీవీపీపై చేసిన వ్యాఖ్యలకు ఆయన నోటీసులు ఇస్తే.. తిరిగి ఆయన కాళ్ల మీద పడిన విషయం గుర్తు ఉందా అన్నారు. నాని అరాచకాలు, భూకబ్జాలపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. దిల్లీ, హైదరాబాద్ వెళ్లి గోల్ఫ్ ఆడుకోవడమే నాని పని అన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనపై చేసిన ఆరోపణలు నిరూపించేందుకు మీడియా ముఖంగా నాని బహిరంగ చర్చకు రావాలన్నారు. ఇటీవల ఒక హోటల్ కూడా ప్రారంభించిన నాని రూ.34 కోట్లు అప్పు తీసుకుని దాన్ని వేరే వ్యక్తుల పేరుమీదకు మార్చారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా వద్దని చెప్పడానికి నోరు ఎలా వచ్చిందన్నారు. నాడే వద్దని ఉంటే నానీని తరిమి కొట్టేవారని, ఇప్పుడు విజయవాడ ప్రజలు అదే చేయబోతున్నారన్నారు. తాను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని. అమరావతి వద్దన్న కేశినేని నాని కావాలా? అమరావతి నిర్మించే తెదేపా కావాలా..? తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. తాను 264 గ్రామాల్లో పర్యటించి వాటి అభివృద్ధి, మౌలిక వసతులకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు చిన్ని వివరించారు. సొంత నిధులతో 3 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z