* ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (AI Express) తమ విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది. అనారోగ్య సెలవులపై వెళ్లి.. తమ నిరసన వ్యక్తం చేసిన క్యాబిన్ సిబ్బంది మొత్తం విధుల్లో చేరినట్లు కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. మంగళవారం నాటికి పూర్తిస్థాయిలో విమానాలు నడుస్తాయని తెలిపారు. కంపెనీలో నిర్వహణ లోపాలు, కొంత మంది సిబ్బందిపై వివక్ష వంటి ఆరోపణలతో క్యాబిన్ సిబ్బందిలో దాదాపు 300 మంది సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో గతవారంలో చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సంస్థ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఓవైపు వారితో సంప్రదింపులు జరుపుతూనే.. మరోవైపు వెంటనే విధుల్లో చేరకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. సెలవుపై వెళ్లిన సిబ్బంది మే 11 నాటికి పూర్తిగా విధుల్లో చేరారని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ వెల్లడించింది. అయితే, కంపెనీ షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌లో లోపాల కారణంగా ఇంకా కొంత మంది సెలవుపై ఉన్నట్లు చూపిస్తోందని తెలిపింది.
* అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో 2025 నాటికి ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా భారత్ నిలువనుందని నీతీ ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ (Amitabh Kant) అంచనా వేశారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ను అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, గడిచిన మూడు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి స్థిరంగా ఉండటం, ట్రేడింగ్ కోసం 27 దేశాలు భారత్ కరెన్సీని ఉపయోగించడం, ద్రవ్యోల్బణ స్థాయి నిర్వహణ పరిధిలోనే ఉండటం అనేవి సానుకూల అంశాలుగా నీతీ ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు. స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాలతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాల్లోనూ మనదేశం అగ్రగామిగా కొనసాగుతుండటం కలిసొచ్చే అంశాలని అన్నారు. వీటితోపాటు రిజర్వు బ్యాంకు ఆర్థిక పరపతి విధానం కూడా దోహదపడుతుందన్నారు.
* ఇంజినీరింగ్ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఐటీ సెక్టార్లో నియామకాలు నెమ్మదించిన వేళ.. ఫ్రెషర్లకు ప్రత్యామ్నాయం చూపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఇందులో 85 శాతం మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకే అవకాశం కల్పించనున్నట్లు బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. 3 వేల మంది పీఓలు, 8 వేల మంది అసోసియేట్లకు బ్యాంకింగ్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చి ఆపై వివిధ వ్యాపార విభాగాల్లో నియమించుకోనున్నట్లు చెప్పారు. ఒకప్పటిలా కాకుండా బ్యాంకింగ్ సెక్టార్‌లోనూ సాంకేతికతపై ఆధారపడడం పెరిగిందని ఖారా చెప్పారు. సాంకేతికత ఆధారంగా కస్టమర్లకు కొత్తగా ఏ విధంగా సేవలందించాలనే దానిపై దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలోనే కొన్ని బ్యాంకులు సవాళ్లు ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావించారు. శిక్షణ పొందిన వారిని.. వారి వారి ప్రతిభను బట్టి వివిధ వ్యాపార, ఐటీ బాధ్యతలు అప్పగించనున్నట్లు చెప్పారు. దీనివల్ల బ్యాంకింగ్ సెక్టార్‌కు తగిన స్థాయిలో టెక్ మ్యాన్‌పవర్ అందించడం సాధ్యపడుతుందన్నారు. బాధ్యతల విషయంలో ఎలాంటి వివక్ష కూడా ఉండబోదన్నారు.
* ల్యాబ్ తయారీ వజ్రాల (ఎల్జీడీ) ఎగుమతులు 2024-25లో 7-9 శాతం వృద్ధి చెంది 1500-1530 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.12,450-12,700 కోట్ల)కు చేరొచ్చని కేర్ఎడ్జ్ అడ్వైజరీ నివేదిక అంచనా వేసింది. సహజంగా వెలికితీసే వజ్రాలకు గిరాకీ మందకొడిగా ఉండటం ఇందుకు దోహదపడనున్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మానవ తయారీ వజ్రాల ఎగుమతులు, దేశీయ వినియోగం పెరిగే అవకాశం ఉందని, తక్కువ ధరలే ఇందుకు కారణమని వెల్లడించింది. అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో.. రత్నాభరణాల పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్న ఎల్జీడీ మార్కెట్‌పై ఆధారపడుతోందని కేర్ఎడ్జ్ అనలిటిక్స్ అండ్ అడ్వైజరీ డైరెక్టర్ తన్వీ షా అన్నారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z