Business

ఇక అందరూ ఉచితంగా GPT4o వినియోగించుకోవచ్చు-BusinessNews-May 14 2024

ఇక అందరూ ఉచితంగా GPT4o వినియోగించుకోవచ్చు-BusinessNews-May 14 2024

* ప్రముఖ కృత్రిమ మేధ (AI) సంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) తమ ఏఐ మోడల్‌ చాట్‌జీపీటీలో కొత్త వెర్షన్‌ను విడుదల చేసింది. జీపీటీ-4ఓ (GPT-4o “o” for “omni”) పేరిట దీన్ని తీసుకొచ్చింది. మరికొన్ని వారాల్లో అందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అయితే, కొన్ని పరిమితులుంటాయని పేర్కొంది. పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రం అవి వర్తించవని స్పష్టం చేసింది. జీపీటీ-4ఓలో (GPT-4o) అత్యాధునిక వాయిస్‌, టెక్ట్స్‌, విజన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. జీపీటీ-4 టర్బోతో పోలిస్తే కొత్త వెర్షన్‌ రెండింతలు వేగంగా పనిచేస్తుందని చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ మీరా మురాటీ వెల్లడించారు. సబ్‌స్క్రిప్షన్‌ ధర సగానికి తగ్గుతుందని తెలిపారు. కొత్త మోడల్‌ దాదాపు 50 భాషలను సపోర్ట్‌ చేస్తుంది. వీటిలో తెలుగు, గుజరాతీ, తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ వంటి భారతీయ భాషలు ఉండడం విశేషం. వాయిస్‌ కమాండ్లకు మనిషి తరహాలోనే కేవలం 232 మిల్లీ సెకన్లలోనే జీపీటీ-4ఓ (GPT-4o) సమాధానం ఇస్తుందని ఓపెన్‌ఏఐ తెలిపింది. టెక్ట్స్‌, రీజనింగ్‌, కోడింగ్‌ ఇంటెలిజెన్స్‌లో టర్బో కంటే మెరుగ్గా పనిచేస్తుందని తెలిపింది. మరోవైపు మ్యాక్‌ఓఎస్‌ యూజర్లకు డెస్క్‌టాప్‌ యాప్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో విండోస్‌ యూజర్లకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.

* ఇంట్లో వండుకునే ఆహారం వెజిటేరియన్‌తో పోలిస్తే సాధారణంగా నాన్‌ వెజ్‌ ఆహారానికయ్యే ఖర్చు ఎక్కువ. దీంతో చాలామంది వెజిటేరియన్‌ అయితే పెద్దగా ఖర్చు ఉండదని భావిస్తుంటారు. కానీ, మాంసాహారం కంటే శాకాహారం ధర రోజురోజుకూ ప్రియమవుతోంది. అదే సమయంలో నాన్‌ వెజ్‌ ధర తగ్గుతోంది. ఏప్రిల్‌ నెలలో వెజిటేరియన్‌ (శాకాహార) థాలీ సగటు ధర సుమారు 8% పెరగ్గా.. మాంసాహార థాలీ ధర తగ్గడం గమనార్హం. క్రిసిల్‌ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ అనాలసిస్‌ తాజాగా వెలువరించిన ‘రోటీ రైస్‌ రేట్‌’ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. రోటీ, కూరగాయలు (టమటాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు), అన్నం, పప్పు, పెరుగు, సలాడ్‌తో కూడిన వెజ్‌ థాలీ సగటు ధర గతేడాది(2023) ఏప్రిల్‌లో రూ.25.4 ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.27.4కు చేరింది. ఈ ఏడాది మార్చి నాటి రూ.27.3తో పోల్చినా స్వల్పంగా పెరిగింది. అదే నాన్‌-వెజ్‌ థాలీలో పప్పు స్థానంలో చికెన్‌ ఉంటుంది. 2023 ఏప్రిల్‌లో సగటు ధర రూ.58.9 ఉండగా, గత నెలలో రూ.56.3 ఉంది. ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ధర రూ.54.9తో పోలిస్తే మాత్రం ఏప్రిల్‌లో ధర పెరిగింది.

* ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై (AI) అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) చీఫ్‌ క్రిస్టాలినా జార్జివా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయేకాలంలో దీనినుంచి ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. జాబ్‌ మార్కెట్‌పై ఇది ‘సునామీ’లా విరుచుకుపడబోతోందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాల్లో సమూల మార్పులు తీసుకురాబోతోందన్నారు. ఈమేరకు జ్యూరిచ్‌లో నిర్వహించిన ఓ ఈవెంట్‌లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఏఐ అభివృద్ధి విషయంలో బిగ్ టెక్‌ కంపెనీలు పోటీపడుతున్న వేళ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాజాగా చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్‌ ఏఐ జీపీటీ-4 మోడల్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకురాగా.. గూగుల్‌ ఆండ్రాయిడ్‌ టెక్నాలజీకి ఏఐ ఫీచర్లతో మరింత మెరుగులద్దేందుకు సిద్ధమవుతోంది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) రాణించాయి. వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి. ఆటో, మెటల్‌, బ్యాంకింగ్‌ షేర్లతో పాటు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా ఏప్రిల్‌ నెలలో రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మదుపరుల్లో కాస్త ఉత్సాహానికి కారణమైంది. దీంతో సెన్సెక్స్‌ ఓ దశలో 400 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మళ్లీ 22,200 స్థాయి ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 72,696.72 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై.. కాసేపటి తర్వాత కోలుకుంది. అనంతరం లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 73,286.26 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 328.48 పాయింట్ల లాభంతో 73,104.61 వద్ద ముగిసింది. నిఫ్టీ 113 పాయింట్ల లాభంతో 22,217.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.51గా ఉంది. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎన్టీపీసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. టీసీఎస్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ చమురు ధర 83.40 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

* ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. మార్చితో ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల లాభం రూ.1.4 లక్షల కోట్లు దాటింది. మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులు నికర లాభం అంతకుముందు ఏడాది రూ.1,04,649 కోట్లు లాభాన్ని ఆర్జించగా.. 35 శాతం వృద్ధితో రూ.1,41,203 కోట్ల నికర లాభం నమోదైంది. ఇందులో బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ వాటానే 40 శాతం కావడం గమనార్హం. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్‌బీఐ రూ.61,077 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది వచ్చిన లాభం రూ.50,232 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ లాభం ఏకంగా 228 శాతం వృద్ధి చెందింది. సమీక్షిస్తున్న ఆర్థిక సంవత్సరంలో రూ.8,245 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. యూనియన్‌ బ్యాంక్‌ 62 శాతం వృద్ధితో రూ.13,649 కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ 61 శాతం వృద్ధితో రూ.2,549 కోట్ల లాభాన్ని ప్రకటించాయి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z