DailyDose

నాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సాయి వర్షిత్-CrimeNews-May 14 2024

నాజీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్న సాయి వర్షిత్-CrimeNews-May 14 2024

* ఐరోపా, బ్రిటన్‌లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్‌పిన్‌ ‘ది స్కార్పియన్‌’ను ఎట్టకేలకు ఇరాక్‌లో అరెస్టు చేశారు. అతడి గ్యాంగ్‌ ఏకంగా 10,000 మందిని అక్రమంగా ఇంగ్లిష్‌ ఛానెల్‌ దాటించి బ్రిటన్‌లోకి చేర్చి ఉంటుందని అంచనా. స్కార్పియన్‌ అసలు పేరు బర్జాన్‌ మాజిద్‌. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బీబీసీ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో అతడిని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు. దీని ఆధారంగా యూకేకు చెందిన నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసింది. అతడు కుర్దిస్థాన్‌లో ఇంట్లో ఉండగా అధికారులు వెళ్లి అదుపులోకి తీసుకొన్నారు. అతడిపై ఉన్న నేరాలను తొలుత దర్యాప్తు చేస్తామని యూకే అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఐరోపా దేశాల్లో అధికారులు ప్రశ్నించేందుకు అనుమతిస్తామన్నారు. ఈ గ్యాంగ్‌ 2016-21 మధ్యలో భారీ స్థాయిలో మానవ అక్రమ రవాణాకు పాల్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా ఆ గ్యాంగ్‌కు చెందిన దాదాపు 26 మందిని అరెస్టు చేశారు. మాజిద్‌పై బెల్జియం కోర్టులో కేసు ఉంది అయితే హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ కేసులో ఇప్పటికే న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష, 9,6,800 యూరోల ఫైన్‌ను విధించింది. మాజిద్‌ను మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా తొలుత గుర్తించారు. పోలీసులు అక్రమ వలసదారులను అరెస్టు చేసిన సమయంలో వారి మొబైళ్లలో ఒక నెంబర్‌ తరచూ కనిపించేది. దానికి స్కార్పియన్‌ అని పేరుగానీ, బొమ్మగాని గుర్తుగా పెట్టుకొని సేవ్‌ చేసేవారు. వాస్తవానికి 2006లో మాజిద్‌ కూడా యూకేలోకి అక్రమంగానే ప్రవేశించాడు. అతడిని దాదాపు 11 ఏళ్లు జైల్లో ఉంచి చివరికి ఇరాక్‌లో వదిలేసి వచ్చారు. ఆ తర్వాత తన అన్న మొదలుపెట్టిన మానవ అక్రమ రవాణాను అతడు చేపట్టాడు.

* గతేడాది అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) వద్ద ఓ యువకుడు ట్రక్కు (Rented Truck)తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన భారత సంతతి (Indian National) కుర్రాడు 20 ఏళ్ల కందుల సాయి వర్షిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అతడు కోర్టులో తన నేరాన్ని అంగీకరించాడు. బైడెన్‌ ప్రభుత్వాన్ని దించి.. నాజీ సర్కారును తీసుకొచ్చేందుకు తాను దాడికి పాల్పడ్డానని చెప్పినట్లు అటార్నీ తెలిపింది. దీంతో ఈ కేసులో అతడికి ఆగస్టు 23న శిక్ష ఖరారు చేయనున్నట్లు యూఎస్‌ (USA) డిస్ట్రిక్ట్‌ కోర్టు వెల్లడించింది. 2023 మే 22న ఈ ఘటన చోటుచేసుకుంది. సాయి వర్షిత్‌ (Kandula Sai Varshith) అద్దె ట్రక్కుతో వైట్‌హౌస్‌ వద్ద బీభత్సం సృష్టించాడు. శ్వేతసౌధంలోకి వెళ్లి అధికారాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యమని నిందితుడు విచారణలో అంగీకరించాడు. ఇందుకోసం అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden), ఇతరులను కూడా చంపాలని ముందుగానే ప్లాన్‌ చేసుకున్నట్లు చెప్పాడు. ఉద్దేశపూరితంగా ప్రజా ప్రభుత్వానికి హాని చేసేందుకు ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో రుజువైందని యూఎస్‌ అటార్నీ తెలిపింది. కోర్టు పత్రాల ప్రకారం.. మే 22 సాయంత్రం మిస్సోరిలోని సెయింట్‌ లూయిస్‌ నుంచి సాయి వర్షిత్‌ వాషింగ్టన్‌ డీసీకి చేరుకున్నాడు. అక్కడ ఓ ట్రక్కును అద్దెకు తీసుకుని రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకు వెళ్లి సైడ్‌వాక్‌పై వాహనాన్ని నడిపాడు. పాదచారులు భయాందోళనకు గురై పరుగులు పెట్టారు. అనంతరం శ్వేతసౌధం (White House) ఉత్తరభాగం వైపు భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ బారియర్స్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కును రివర్స్‌ చేసి మరోసారి ఢీకొట్టాడు. వాహనం నుంచి కిందకు దిగి నాజీ జెండాను పట్టుకుని నినాదాలు చేశాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

* వికారాబాద్ జిల్లా తాండూర్‌లో విషాదం నెల‌కొంది. గౌతాపూర్‌లోని నాప‌రాతి పాలిష్ యూనిట్‌లో ద‌త్తు, లావ‌ణ్య అనే దంప‌తులు కూలీలుగా ప‌ని చేస్తున్నారు. అయితే పాలిషింగ్ యూనిట్ య‌జ‌మాని ఓ పెంపుడు కుక్క‌ను పెంచుకుంటున్నాడు. ఈ కుక్క ద‌త్తు కుమారుడు సాయినాథ్‌(5 నెల‌లు)పై దాడి చేసి చంపింది. దాంతో ఆగకుండగ ఆ పసికందును కండ కండలు పీక్కుతిన్నది. దీంతో బిడ్డ‌ను కోల్పోయామ‌న్న బాధ‌లో ద‌త్తు అత‌ని భార్య క‌లిసి పెంపుడు కుక్క‌పై దాడి చేసి చంపారు. సాయినాథ్ కుటుంబ స‌భ్యులు శోక‌సంద్రంలో మునిగిపోయారు. చ‌నిపోయిన బిడ్డ‌ను గుండెల‌కు హ‌త్తుకుని రోదించిన తీరు అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టించింది.

* ఢిల్లీలోని పహర్‌గంజ్‌ ప్రాంతానికి చెందిన రాజేశ్ కపూర్ చోరీలోతనకు తానే తోపు అనుకున్నాడు. మొదట రైళ్లలో చోరీ చేసేవాడు. చాలాకాలానికి అక్కడ దొరికిపోవడంతో ఇక విమానాల్ని ఎంచుకున్నాడు. ఒకదాని తరువాత మరొకటి దర్జాగా లక్షల రూపాయల విలువచేసే బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను కొట్టేసేవాడు. కానీ ఎప్పటికైనా పాపం పండుతుంది అన్నట్టు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కానీ పోలీసుల పని అంత ఈజీగా అవ్వలేదు. ఢిల్లీ, హైదరాబాద్, అమృత్‌సర్ విమానాశ్రయాల్లోని కొన్ని గంటల సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసిన తర్వాత రాజేష్ కపూర్‌ను పట్టుకున్నట్టు వెల్లడించారు. ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి అందించిన సమాచారం ప్రకారం, లగ్జరీ ప్రయాణికుడిలాగా పోజు కొడుతూ విమానాల్లో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులు ముఖ్యంగా మహిళలు, వృద్ధులును ట్రాప్ చేసి చోరీ చేయడంలో రాజేశ్‌ ఆరితేరిపోయాడు.కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే వారిని టార్గెట్ చేసి చోరీలు చేసేవాడు. ప్రయాణికులతో మాటలు కలిపి వారికి సాయం చేస్తున్నట్టు నటించి నగలు, విలువైన వస్తువులు దోచేసేవాడు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ మహిళ ఐజిఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిరిండియా విమానంలో ఆమె బ్యాగు నుంచి రూ. 7 లక్షల విలువైన నగలు కొట్టేశాడు. అంతేకాదు అమెరికాకు చెందిన వర్జిందర్‌జిత్ సింగ్‌ కూడా ఇతని బాధితుడే. అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చి కనెక్టింగ్ ఫ్లైట్‌లో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు వెళుతున్న వర్జిందర్‌జిత్ సింగ్‌ క్యాబిన్ బ్యాగ్ నుండి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z