* ఐపీఎల్ 17వ సీజన్‌లో చెన్నై తన లీగ్ స్టేజ్‌లో చివరి మ్యాచ్ ఆడబోతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. మ్యాచ్ జరగాలని ప్రతిఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్లకపోతే ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఆడే చివరి మ్యాచ్ ఇదే అవుతుంది. కాబట్టి, అతడినుంచి అసలైన ఆట బెంగళూరుపై చూడబోతున్నామని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వరుణ్ ఆరోన్ వ్యాఖ్యానించాడు. ‘‘శనివారం ఎంఎస్ ధోనీ షోను చూస్తామనే నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మనం అతడి ఆటను చూశాం. చిన్నస్వామి స్టేడియంతో ధోనీకి ప్రత్యేక అనుబంధం ఉంది. అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఇక్కడ ఆడాడు. గతంలో ఓసారి చివరి ఓవర్‌లో 20 పరుగులను ఒక్కడే బాదేశాడు. కాబట్టి, అతడు అత్యంత ప్రమాదకారి. మరోసారి అతడి నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నా’’ అని ఆరోన్ వెల్లడించాడు. ప్రస్తుత సీజన్‌లో ధోనీ ఇన్నింగ్స్ చివర్లోనే బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఒకటి లేదా రెండు ఓవర్లు ఉన్నప్పుడు ధనాధన్ షాట్లతో అలరించాడు. ఇప్పటివరకు 13 మ్యచుల్లో 136 పరుగులు రాబట్టాడు. అందులో ఎక్కువగా బౌండరీల రూపంలో వచ్చినవే. అయితే, ఈసారి మాత్రం ఇంకాస్త ముందుగా బ్యాటింగ్ చూడాలనేదే అభిమానుల ఆకాంక్ష.
* తిరుమలలో (Tirumala) శుక్రవారం మధ్యాహ్నం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. జోరు వాన పడటంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం నెలకొంది.
* వైకాపా నేతల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని గొట్టిముక్కల సుధాకర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తెనాలిలో తమ ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై సుధాకర్ శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని కలిశారు. కోర్టు ఆదేశాల మేరకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ పోలింగ్ కేంద్రంలో ఈనెల 13న క్యూలో వచ్చి ఓటేయాలని చెప్పినందుకు సుధాకర్ అనే ఓటరుపై వైకాపా ఎమ్మెల్యే శివకుమార్, అతని అనుచరులు విచక్షణా రహితంగా దాడి చేసిన విషయం తెలిసిందే.
* టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. దీంతో అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ‘డార్లింగ్స్.. ఎట్టకేలకు మన జీవితంలోకీ ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి’ అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌లో చెప్పిన ప్రత్యేక వ్యక్తి ఎవరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఫ్యాన్స్ ఎక్స్‌లో షేర్ చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న ‘కల్కి’ సినిమాలో కమల్ హాసన్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ సినిమా ప్రమోషన్స్ కోసమే ఈ పోస్ట్ పెట్టినట్లు సమాచారం.
* చావో రేవో లాంటి మ్యాచ్ వర్షార్పణం కాకుండా ఉండాలని బెంగళూరు బలంగా కోరుకుంటోంది. ఐపీఎల్ 17వ సీజన్‌లో తన చివరి లీగ్ మ్యాచ్‌ను చెన్నైతో ఆడేందుకు సిద్ధమవుతోంది. ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ జరగడం బెంగళూరుకు అత్యంత కీలకం. మరోవైపు ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా చెన్నై నాకౌట్‌కు వెళ్లిపోతుంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరగాలనేది ఆర్సీబీ అభిమానుల ఆకాంక్ష. మరి వర్షం పడి ఆగిన తర్వాత మైదానాన్ని సిద్ధం చేసేందుకు చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక పద్ధతులు ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్ సందర్భంగా అహ్మదాబాద్‌లో పిచ్‌ను సిద్ధం చేయడంలో ఇబ్బంది ఎదురైన సంగతి తెలిసిందే. బెంగళూరులో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఇక్కడ అత్యాధునికమైన ‘సబ్‌ఎయిర్’ సిస్టమ్ అందుబాటులో ఉంది.
* గృహనిర్బంధంలో ఉన్న మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 14న మాచర్ల నియోజకవర్గంలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పిన్నెల్లి సోదరులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. గురువారం రాత్రి నుంచి ఎమ్మెల్యే, అతని సోదరుడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇంటి వద్ద పోలీసులు కాపలా ఉన్నప్పటికీ వారి కళ్లుగప్పి ఎలా వెళ్లారనేదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రక్షణగా ఉన్న గన్‌మెన్‌లను కూడా వదిలేసి వెళ్లిపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిన సమాచారాన్ని ఆయన గన్‌మెన్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి తెలియజేయడంతో ఈవిషయం వెలుగు చూసింది. కారంపూడి ఘటన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతోనే.. పిన్నెల్లి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు.. విశ్రాంతి కోసమే ఆయన హైదరాబాద్ వెళ్లారని వైకాపా నేతలు చెబుతున్నారు.
* భారత్‌లో ప్రతీ విద్యార్థి చదవాల్సిన ఓ పుస్తకాన్ని ఇన్ఫోసిస్ సహ-వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) పంచుకున్నారు. పాల్ జి.హెవిట్ రాసిన ‘కాన్సెప్చువల్ ఫిజిక్స్’ను (Conceptual Physics) ప్రతిఒక్కరూ చదవాలని సూచించారు. దీన్ని రచయిత అద్భుతంగా రాశారని.. అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ప్రస్తుతం నేను కాన్సెప్చువల్ ఫిజిక్స్ అనే పుస్తకాన్ని చదువుతున్నాను. దీన్ని హైస్కూల్ టీచర్ పాల్ హెవిట్ రాశారు. హైస్కూల్ విద్యార్థులను దృష్టిలోఉంచుకొని రచించారు. ఫిజిక్స్ ఎలా బోధించాలో అద్భుతంగా వివరించారు. రచయిత నుంచి అనుమతి లభిస్తే దీన్ని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి. దీంట్లో అద్భుతమైన ఎక్సర్‌సైజులు ఉన్నాయి. క్లిష్టమైన ఐడియాలను చాలా చక్కగా వివరించారు. శ్రీనగర్ నుంచి కన్యాకుమారి.. మేఘాలయ నుంచి జామ్‌నగర్ వరకు ప్రతిఒక్కరూ దీన్ని చదవాలి. ‘సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేథమేటిక్స్ సబ్జెక్టుల్లో మంచి అవగాహన ఏర్పడుతుంది’’ అని ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి (Narayana Murthy) వెల్లడించారు.
* కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా విశ్వాసంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల సమరంలో భాగంగా ఇప్పటివరకు నాలుగు విడతల పోలింగ్ పూర్తికాగా.. మరో మూడు దశల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమయంలో భాజపా అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. జూన్ 4న భాజపాకు 272 సీట్లు రాకపోతే ఎలా..? ప్లాన్ బి ఏంటి..? అంటూ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. అలాగే ఆప్ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ‘‘అలాంటి అవకాశాలు నాకు కనిపించడం లేదు. 60 కోట్ల లబ్ధిదారుల సైన్యం మోదీకి అండగా ఉంది. వారికి ఎలాంటి కులం లేదు. వయసుతో సంబంధం లేదు. మోదీ అంటే ఏమిటి..?ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి..? అనేది వారికి తెలుసు. ‘ప్లాన్ ఎ’ సక్సెస్ రేట్ 60 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడే ‘ప్లాన్ బి’ని రూపొందించాలి. మాకు ఆ అవసరం లేదు. ప్రధాని మోదీ అఖండ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయం’’ అని అన్నారు. 400 సీట్లు వస్తే.. రాజ్యాంగాన్ని మారుస్తారనే ఊహాగానాలపై స్పందించారు. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని మార్చడానికి కావాల్సిన మెజార్టీ తమకు ఉందని, కానీ తాము ఎన్నడూ అలా చేయలేదన్నారు. అలాంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పారు.
* రాష్ట్రంలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేయనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిట్‌ను వేయనుంది. ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటనపైనా సిట్ నివేదిక ఇవ్వనుంది. పల్నాడు, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ విచారణ జరపనుంది. తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తెచ్చే అంశంపైనా అధికారులు ఆలోచన చేస్తున్నారు. తాడిపత్రి ఘటనలో చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉంది. ప్రతి ఘటనపైనా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఈసీ ఆదేశించింది. వివిధ ఘటనల్లో పోలీసు అధికారుల వైఫల్యం కనిపించడంతో ఇప్పటికే ఈసీ పలువురు అధికారులపై వేటు వేసింది.
* పర్యావరణ పరిరక్షణ ( Environment Protection), సుస్థిరతను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే వ్యక్తులకు సుదీర్ఘకాల రెసిడెన్సీ వీసాను తీసుకురానుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ ‘బ్లూ రెసిడెన్సీ వీసా (Blue Residenency Visa)’ల జారీకి ఆమోదం తెలిపినట్లు యూఏఈ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ వెల్లడించారు. తమ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం అనేది పర్యావరణ సమతుల్యతతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. పదేళ్ల పాటు యూఏఈలో నివాసం ఉండేందుకు వీలుగా ఈ ప్రత్యేక ‘బ్లూ వీసా (Blue Visa)’లను ఇవ్వనున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా పలు రంగాల్లో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు వీటిని జారీ చేస్తారు. మెరైన్ లైఫ్, భూ ఉపరితలంపై పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత, సుస్థిర సాంకేతికత తదితర రంగాల్లో పనిచేస్తున్న వారు ఈ వీసాలకు అర్హులు. వీటి కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌సిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్ సెక్యూరిటీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
* ‘నేను అంగారక (Mars Planet) గ్రహం మీద చనిపోవాలనుకుంటున్నాను..’ స్పేస్‌ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) గతంలో ఓసారి చెప్పిన మాటలివి. మరో గ్రహంపై మానవాళి జీవనం సాగించాలని గత కొంతకాలంగా బలంగా వాదిస్తున్న మస్క్ ఆ దిశగా ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు. తాజాగా దీనిపై ఆయన చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరో 30 ఏళ్లలో అంగారకుడిపై నగరం ఏర్పడటమే గాక.. అక్కడ మనుషులు కూడా జీవిస్తారని ఆయన అంచనా వేశారు. ‘మరికొన్ని సంవత్సరాల్లో మనం అంగారకుడిపై అడుగుపెడతాం’ అని ఓ ఎక్స్ యూజర్ చేసిన పోస్ట్‌కు మస్క్ స్పందించారు. ‘‘ఐదేళ్లలోపే ఆ గ్రహంపైకి మానవరహిత యాత్ర విజయవంతమవుతుంది. 10 ఏళ్లలోపే అక్కడికి మనుషులను కూడా పంపించగలుగుతాం. 20 ఏళ్లలో ఓ నగరాన్ని నిర్మిస్తాం. కచ్చితంగా వచ్చే 30 ఏళ్లకు అక్కడ సురక్షితంగా నాగరికత విరాజిల్లుతుంది’’ అని ఆయన రాసుకొచ్చారు.
* ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్‌గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్‌ను అప్‌గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు.. గవర్నర్, ఏపీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ‘ఈ-ఆఫీస్’ అప్ గ్రేడేషన్‌పై ఎన్‌ఐసీ ప్రతినిధులను పిలిపించి ఆరా తీశారు. అనంతరం అప్‌గ్రేడేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ఎన్‌ఐసీని ఎంకే మీనా ఆదేశించారు.
* బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ (Janhvi Kapoor) మొదటిసారి శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. గత కొంతకాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ మొదటిసారి శిఖర్ గురించి మాట్లాడారు. ‘నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడే శిఖర్ నా జీవితంలోకి వచ్చాడు. మేమిద్దరం కలిసి పెరిగాం. నా కలలను తనవిగా భావిస్తాడు. తన కలలు నావి అనుకుంటాను. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటాం’ అని చెప్పారు. తాజాగా జాన్వీ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘నా కలలు నిజమవ్వడానికి పూర్తి సపోర్ట్ ఇవ్వాలి. ధైర్యం చెప్పాలి. ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి అండగా నిలవాలి’ అన్నారు. దీంతో జాన్వీ.. శిఖర్ గురించే చెప్పారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గతంలో బోనీకపూర్ కూడా శిఖర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జాన్వీతో పరిచయం కాకముందు ముందునుంచే శిఖర్ తనకు తెలుసని బోనీ అన్నారు. మంచివాడని.. అందరితో త్వరగా కలిసిపోతారని చెప్పారు.
* తిరుమల(Tirumala)కు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజన సందోహం కనిపిస్తోంది. అనూహ్యంగా పెరిగిన రద్దీతో సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు భక్తులతో నిండిపోయి.. ఔటర్ రింగురోడ్డులో 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. క్యూలైన్‌లలో వేచి ఉన్న భక్తులకు తితిదే సిబ్బంది తాగునీరు, అల్పాహారం అందిస్తున్నారు. తిరుమలలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం తడిసిముద్దయింది. స్వామివారి దర్శనం అనంతరం లడ్డూ విక్రయ కేంద్రాలు, గదులకు వెళ్లేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. తితిదే ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద భక్తులు తలదాచుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో తిరుమల కొండల్లో చల్లని వాతావరణం ఏర్పడింది.
* చార్ ధామ్ యాత్ర (Char Dham Yatra)లో ఇకపై వీడియోలు, రీల్స్ చిత్రీకరణను నిషేధిస్తున్నట్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి (Radha Raturi) తెలిపారు. డెహ్రాడూన్‌లో చార్‌ధామ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) పలువురు భక్తుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. ఇకపై ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారిందని, వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని రాధా రాటూరి వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని ఆమె అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రకు దేశ, విదేశాల నుంచి 26 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హరిద్వార్, రిషికేశ్‌లకు గతేడాదికంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని కమిషనర్ వినయ్‌శంకర్ పాండే తెలిపారు. మే 10న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరిచినప్పటినుంచి లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు చార్ ధామ్‌ను సందర్శించారు. కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రితో సహా మూడు ధామ్‌లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్‌నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z