Business

MDH-Everest మసాలాలపై మరో దేశం నిషేధం-BusinessNews-May 18 2024

MDH-Everest మసాలాలపై మరో దేశం నిషేధం-BusinessNews-May 18 2024

* స్టాక్‌ మార్కెట్లకు నేడు ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ నిర్వహించారు. ఇందులో సూచీలు రాణించాయి. సెన్సెక్స్‌ 74వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ 22,500 మైలురాయి పైన స్థిరపడింది. మొత్తం రెండు సెషన్లలో ప్రత్యేక ట్రేడింగ్‌ నిర్వహించగా.. ఇందులో సెన్సెక్స్‌ 88.91 పాయింట్లు లాభపడి 74,005.94 వద్ద, నిఫ్టీ 35.9 పాయింట్ల లాభంతో 22,502 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు రాణించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌, ఫార్మా, రియల్టీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటర్స్‌ షేరు విలువ దాదాపు 2 శాతం పెరగ్గా.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేరు విలువ పతనమైంది. సాధారణంగా శనివారం మార్కెట్లు (Stock market) పనిచేయవు. కానీ, ప్రాథమిక సైట్‌లో ఏమైనా లోపాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్‌ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్‌ సెషన్‌ను బీఎస్‌ఈ (BSE), ఎన్‌ఎస్‌ఈ (NSE) నిర్వహించాయి. రెండు సెషన్లలో ఈ ప్రత్యేక ట్రేడింగ్‌ కొనసాగింది. మొదటి సెషన్‌ ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై 10.15 గంటలకు.. రెండో సెషన్‌ 11.30 – 12.30 గంటల మధ్య ముగిసింది. తొలుత ప్రాథమిక సైట్‌లో.. తర్వాత డిజాస్టర్‌ రికవరీ సైట్‌లో ట్రేడింగ్‌ చేశారు. ఈ సమయంలో అన్ని సెక్యూరిటీస్‌, డెరివేటివ్‌ ఉత్పత్తులను ట్రేడింగ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. గరిష్ఠ పరిమితిని 5 శాతంగా నిర్ణయించారు.

* 140 కోట్ల భారతీయులున్న దేశానికి ఆర్థిక మంత్రి. 3937 బిలియన్‌ డాలర్ల మూలధన లెక్కలను చూసే నాయకురాలు ఢిల్లీ మెట్రో ఎక్కి ప్రయాణం చేస్తే ఆశ్చర్యపోరా మరి.! అవును కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సాధాసీదా ప్రయాణికురాలిగా ఢిల్లీ మెట్రో రైలులో లక్ష్మీ నగర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. ఆ ఫోటోల్ని, వీడియోల్ని ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు. అయితే నిర్మలా సీతారామన్‌ మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడంపై మెట్రోలో ప్రయాణించడంపై నెటిజన్లు ప్రశంసిస్తుండగా.. మరికొందరు మాత్రం 2024 లోక్‌ సభ ఎన్నికల స్టంట్‌ అంటూ విమర్శిస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో నిర్మలా సీతారామన్ ప్రయాణిస్తున్న వీడియోపై నెటిజన్లు ఇలా స్పందించారు ‘పన్ను సంబంధిత ప్రశ్న అడగాలి’ అని ఒక యూజర్‌ అంటుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ ప్రజా రవాణాను ఎంచుకుని, తోటి ప్రయాణికులతో మమేకమవడం సంతోషంగా ఉంది. సహచరులకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. మరో యూజర్‌ మాత్రం.. నిర్మలా సీతారామన్‌ మెట్రో ప్రయాణం ఎన్నికల స్టంట్‌. ఎందుకంటే.. అధికారంలో ఉన్న 10ఏళ్లలో ఒక్కసారైనా మెట్రోలో ప్రయాణించారా? సాధారణ ప్రయాణికులతో ఎప్పుడైనా ముచ్చటించారా అని వ్యాఖ్యానించారు.

* భారతీయ మసాల దినుసుల తయారీ సంస్థ ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ సంస్థలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌ మసాల దినుసుల్లో క్యాన్సర్ కారక పెస్టిసైడ్, ఇథిలీన్ ఆక్సైడ్ అధిక స్థాయిలో ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సింగపూర్, హాంకాంగ్‌లు భారత్‌ మసాల దినుసుల్ని వినియోగించరాదంటూ ఆ రెండు దేశాలు అధికారంగా ప్రకటించారు. తాజాగా, నేపాల్ సైతం భారత్‌లో తయారయ్యే మసాల దినుసుల్ని వినియోగించడానికి వీలు లేదని, అందుకు నాణ్యతాపరమైన కారణాల్ని ఎత్తి చూపింది. నేపాల్‌ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, అనుమానాస్పద ఇథిలీన్ ఆక్సైడ్ కారణంగా ఎండీహెచ్‌, ఎవరెస్ట్‌కు చెందిన నాలుగు మసాలా దినుసులపై నిషేధం విధించింది. నేపాల్‌ నిషేధం విధించిన మసాలలలో మద్రాస్ కర్రీ పౌడర్, సాంభార్ మిక్స్డ్ మసాలా పౌడర్, నేపాల్‌లో ఎండీహెచ్‌ మిక్స్‌డ్ మసాలా కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలు ఉన్నాయి. ఈ నాలుగు ఉత్పత్తులలో ఇథిలీన్ ఆక్సైడ్ పరిమితిని మించి ఉన్నట్లు గుర్తించామని, ఆహార నియంత్రణ 2027 బీఎస్‌ ఆర్టికల్ 19 ప్రకారం ఈ ఉత్పత్తుల దిగుమతి, అమ్మకం దేశంలో నిషేధిస్తూ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. భారత్ ప్రపంచ సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది ఇక్కడ తయారైన 200కు పైగా మసాలాలు దాదాపు 180 దేశాలకు ఎగుమతి అన్నాయి. వీటి విలువ రూ. 33 వేల కోట్లు అని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. దేశీయ మార్కెట్ రూ. 83 వేల కోట్లకు పైమాట. కానీ ఇప్పుడు మసాల దినుసలపై వెల్లువెత్తున్న ఆరోపణలతో భారత్‌ మసాలా మార్కెట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. భారతదేశ మసాలా ఎగుమతులు దాదాపు 40 శాతం క్షీణించవచ్చని భారత సుగంధ ద్రవ్యాల వాటాదారుల సమాఖ్య (FISS) తెలిపింది. అదే సమయంలో ఈ ప్రఖ్యాత మసాల దినుసులు ఎంత వరకు సేఫ్ అన్న అంశంపై ఆందోళనలు తలెత్తుతున్నాయి.

* యాపిల్‌ ఐఫోన్‌ ప్రియులకు శుభవార్త. త్వరలో మార్కెట్‌కి పరిచయం కానున్న ఐఫోన్‌ 16 తయారీ వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐఫోన్‌ 15 విడుదలైన మరుక్షణం నుంచి ఐఫోన్‌ 16 ఇలా ఉండబోతుందంటూ రకరకాల డిజైన్లను ప్రస్తావిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తయారీ ప్రారంభంతో ఆ ఫోన్‌ డిజైన్‌పై స్పష‍్టత రానుంది. ఐ ఫోన్‌ డిస్‌ప్లే అనలిస్ట్‌ రాస్ యంగ్ ఐఫోన్‌ 16 సిరీస్ వచ్చే నెల నుంచి తయారీ ప్రారంభం కానుందని ట్వీట్‌ చేశారు. ఐఫోన్‌ 16 మోడళ్లను హై-ఎండ్ వేరియంట్‌ల కంటే ఎక్కువగా ఉత్పత్తి చేయొచ్చని తెలుస్తోంది. కాగా, గత ఏడాది ఐఫోన్‌ 15 సిరీస్‌ తయారీ ఆగస్ట్‌ నెలలో ప్రారంభం కాగా.. ఈ లేటెస్ట్‌ వెర్షన్‌ అంతకంటే ముందే మ్యానిఫ్యాక్చరింగ్‌కు సిద్ధమైంది.

* ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ ‘నారాయణన్ వాఘుల్’ చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో కన్నుమూశారు. రెండు రోజులకు ముందు ఇంట్లో పడిపోవడం వల్ల అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ సపోర్ట్‌తో చికిత్స పొందుతూ.. శనివారం తుది శ్వాస విడిచారు. నారాయణన్ వాఘుల్ వయసు 88 ఏళ్లు. ఈయన భార్య పద్మా వాఘల్, పిల్లలు మోహన్, సుధ.. మనవళ్లు సంజయ్, కావ్య, అనువ్, సంతోష్ ఉన్నారు. భారతీయ బ్యాంకింగ్‌లో కొత్త శకానికి నాంది పలికిన దిగ్గజం నారాయణన్ వాఘుల్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. నారాయణన్ వాఘుల్ 1936లో దక్షిణ భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో జన్మించారు. అతని కుటుంబం చెన్నైకి (అప్పటి మద్రాసు) వెళ్లింది. అక్కడే లయోలా కాలేజీలో చదువుకున్నాడు. బ్యాంకింగ్ రంగంలో గొప్పగా ఎదిగిన వాఘల్.. ప్రారంభంలో సివిల్ సర్వీసెస్‌లో చేరాలనుకున్నారు. అయితే కొత్తగా ఏర్పడిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ప్రవేశించడానికి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ఆ పరీక్షను వాఘుల్ కేవలం ప్రాక్టీస్ టెస్ట్ మాదిరిగా ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. తండ్రి ప్రోత్సాహంతో 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఎస్‌బీఐ నుంచి వైదొలిగారు. ఆ తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్‌లో చేరి దాని డైరెక్టర్ అయ్యారు. 39 సంవత్సరాల వయస్సులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిని చేపట్టారు. నారాయణన్ వాఘుల్ 1981లో బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చెప్పారు. 1981 – 1985 మధ్య కాలంలో ఐసీఐసీఐ లిమిటెడ్‌కి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ఇలా ఆయన దినదినాభివృద్ధి చెందుతూ.. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. 2006లో ఎకనామిక్ టైమ్స్ ద్వారా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z