Business

కారు లోన్ తీసుకునేవారికి శుభవార్త-BusinessNews-May 19 2024

కారు లోన్ తీసుకునేవారికి శుభవార్త-BusinessNews-May 19 2024

* ప్రముఖ విమానయాన సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ (Singapore Airlines) రికార్డు స్థాయిలో లాభాలు నమోదు చేసింది. అంచనాలకు మించి లాభాలు నమోదు చేయడంతో తన సిబ్బందికి బంపర్‌ ఆఫర్‌ అందించాలని నిర్ణయించింది. ఎనిమిది నెలల జీతాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపుగా అన్ని ఎయిర్‌లైన్‌ సంస్థలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించి.. చైనా, హాంకాంగ్‌, జపాన్‌, తైవాన్‌ దేశాల సరిహద్దులు పూర్తిగా తెరచుకోవడమే తిరిగి సంస్థ లాభాల బాట పట్టడానికి కారణం అని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో విమానయాన సంస్థ రికార్డు స్థాయిలో 1.98 బిలియన్‌ డాలర్ల వార్షిక నికర లాభాన్ని నమోదు చేసింది. దీంతో మార్చి ముగిసే సమయానికి ఎయిర్‌లైన్‌ నికర ఆదాయం 24 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లకు చేరింది.

* భారతదేశంలో బీమా రంగంలో ఎల్ఐసీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రకటిస్తూ అగ్రగామిగా నిలుస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుమార్తెల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. ప్రతి నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది. కన్యాదాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పాలసీ కుమార్తెల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారి కుమార్తెల వివాహానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.28 లక్షలను పొందవచ్చు. రోజుకు రూ. 121 డిపాజిట్ చేయడం అంటే నెలకు సుమారుగా రూ.3600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ పిల్ల ఒక సంవత్సరం వయస్సు నుంచి 25 సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా కన్యాదాన్ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుండి రూ. 10 లక్షల మొత్తాన్ని పొందుతారు. అదనంగా మీరు ఇందులో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ కన్యా దాన్ పాలసీని రూపొందించారు. కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం అలాగే తండ్రి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెడితే మీకు మంచి మొత్తంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద 80సీ కింద పాలసీదారులు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.

* సొంత కారు అనేది ప్రతి మధ్యతరగతి ఉద్యోగి కల. ఈ కలను నెరవేర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ తాము పొదుపు చేసుకునే సొమ్ముతో పాటు బ్యాంకు లోన్ల ద్వారా కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులు కార్ల లోన్లపై ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ తక్కువ వడ్డీకి కార్ లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ బ్యాంకులు 8.70 శాతం నుంచి 9.10 శాతం వరకు వడ్డీ రేట్ల వద్ద నాలుగు సంవత్సరాల కాలానికి రూ.10 లక్షల వరకు కార్ లోన్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకులు కార్ల లోన్లపై ఎంత శాతం వడ్డీకు లోన్లు ఆఫర్ చేస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నాలుగు సంవత్సరాల కాలానికి రూ. 10 లక్షల కొత్త కారు రుణాల పై 8.70 శాతం వరకు వడ్డీని వసూలు చేస్తోంది. అందువల్ల ఈఎంఐ రూ.24,565 అవుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
భారతదేశపు అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్ లోన్ పై 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్లతో సహా ఇతర బ్యాంకులు కూడా నాలుగేళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీకి కార్ లోన్లను అందిస్తున్నాయి. ఇందులో ఈఎంఐ రూ.24,587.

బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా కారు లోన్లపై 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. దీని ఈఎంఐ రూ. 24,632గా ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా నాలుగు సంవత్సరాల కాలవ్యవధికి రూ. 10 లక్షల కొత్త కారు రుణంపై 8.90 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఈ సందర్భంలో ఈఎంఐ రూ. 24,655 అవుతుంది.

ఐసీఐసీఐ బ్యాంక్
ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 10 లక్షల రూపాయల కొత్త కారు రుణం పై 9.10 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. అందువల్ల నెలకు రూ. 24,745 ఈఎంఐ కింద చెల్లించాల్సి ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్
యాక్సిస్ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 9.30 శాతం వడ్డీ రేటుతో రూ. 10 లక్షల కారు రుణాన్ని అందిస్తోంది. కాబట్టి రూ. 24,835 అవుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నాలుగు సంవత్సరాల కాలానికి 9.40 శాతం వడ్డీ రేటుతో కార్ లోన్ అందిస్తోంది. రూ. 10 లక్షల కారు రుణంపై ఈఎంఐ రూ. 24,881 అవుతుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z