Business

మైక్రోసాఫ్ట్ నుండి సరికొత్త కంప్యూటర్లు-BusinessNews-May 21 2024

మైక్రోసాఫ్ట్ నుండి సరికొత్త కంప్యూటర్లు-BusinessNews-May 21 2024

* దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సరికొత్త రికార్డు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.414.75 లక్షల కోట్లు) మైలురాయిని దాటింది. ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి. జూన్ నాలుగో తేదీన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో సాగుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు స్టాక్స్ విక్రయిస్తున్నా దేశీయ ఇన్వెస్టర్ల నుంచి స్టాక్స్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. 2023 నవంబర్ 29 నాటికి బీఎస్ఈ లిస్టె్డ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును దాటింది. కేవలం ఆరు నెలల్లోపే బీఎస్ఈ ఎం-క్యాప్ లక్ష కోట్ల డాలర్లు పుంజుకోవడం గమనార్హం. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ ఆల్ టైం గరిష్టానికి 250 పాయింట్ల దూరంలో నిలిచింది. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇండెక్సులు కొత్త గరిష్టాలకు దూసుకెళ్లాయి. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు, రిటైల్ ఇన్వెస్టర్లు, అత్యంత సంపన్నుల (హెచ్ఎన్ఐఎస్) మద్దతుతో స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీసింది. ఈ నెలలో దలాల్ స్ట్రీట్ నుంచి రూ.28 వేల కోట్ల లోపు విలువైన స్టాక్స్‌ను విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు విక్రయించారు.

* ప్రస్తుతం టెక్నాలజీ, ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో కృత్రిమ మేథ‌ ఫీచర్లకు గిరాకీ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్.. తన కస్టమర్ల కోసం కొత్తతరం పర్సనల్ కంప్యూటర్లు ఆవిష్కరించింది. కోపైలట్+ పీసీల (Microsoft Copilot PCs) అనే పేరుతో వీటిని తీసుకొస్తున్నది. ఇంత వరకూ ఆవిష్కరించిన పర్సనల్ కంప్యూటర్లతో పోలిస్తే ఈ పర్సనల్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవి, వేగవంతమైనవని మైక్రోసాఫ్ట్ తెలిపింది. స్నాప్ డ్రాగన్ ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లతో కోపైలట్+ పీసీలను తయారు చేసింది. సెకన్ కు 40 లక్షల కోట్ల ఆపరేషన్స్ పూర్తి చేయడం వీటి స్పెషాలిటీ. వీడియో ఎడిటింగ్, క్లిష్టమైన డేటా అనాలసిస్, మల్టీపుల్ ప్రోగ్రామ్స్ రన్ వంటి పనుల్లో వేగంగా స్పందిస్తాయీ పర్సనల్ కంప్యూటర్లు.. దీర్ఘకాలిక లక్ష్యమైన ఏఐ పీసీల అభివ్రుద్ధిలో భాగంగా వీటిని ఆవిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. పూర్తి సామర్థ్యానికి అనుగుణంగా ఈ ఫీచర్లను వాడుకోవాలంటే అందుకు మద్దతునిచ్చే హార్డ్ వేర్ కూడా ఉండాలి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో ఎసెర్, అసుస్, డెల్, హెచ్ పీ, లెనోవో, శాంసంగ్ వంటి సంస్థలు జత కట్టాయి. వచ్చేనెల 18 నుంచి కోపైలట్ + పీసీలు తెస్తాయి. మైక్రోసాఫ్ట్ కూడా ఈ క్యాటగిరీలో సర్ఫేస్ పేరుతో డివైజ్‌లు విడుదల చేస్తుంది.

* సాధారణంగా యాపిల్‌ ఐఫోన్‌ కొనాలంటే కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆ స్థాయిలో ఉంటాయి వాటి ధరలు. ఎప్పుడో కొత్త మోడల్‌ వస్తే గానీ పాత మోడళ్ల ధరలు తగ్గవు. అందుకే ఐఫోన్‌ వాడాలనుకునేవారు ఏ ఆఫర్‌లోనో తక్కువ ధరకు వచ్చినప్పుడు వీటిని కొనుగోలు చేస్తుంటారు. అలాంటిది చైనాలో యాపిల్ ఐఫోన్ల ధరలను అమాంతం తగ్గిస్తోంది. లేటెస్ట్ మోడళ్లపైనా భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. అమెరికా, భారత్‌ తరహాలోనే యాపిల్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌. ప్రపంచ మార్కెట్‌లో శాంసంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న ఆ సంస్థకు చైనాలో మాత్రం హువావే సవాల్‌ విసురుతోంది. తన అమ్మకాలు పెంచుకుంటూ యాపిల్‌ మార్కెట్‌ వాటాకు గండిపెడుతోంది. ఇది యాపిల్‌ను కలవరపెడుతోంది. అందుకే విక్రయాలు పెంచుకునేందుకు తంటాలు పడుతోంది. ఇందులో భాగంగా మే 28 వరకు యాపిల్‌ తన అధికారిక స్టోర్‌లో భారీ తగ్గింపు ధరకే ఐఫోన్లను విక్రయిస్తోంది. ఐఫోన్‌ లేటెస్ట్‌ మోడల్‌ అయిన ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ 1టీబీ వెర్షన్‌పై 2300 యువాన్లు (318 డాలర్లు) మేర డిస్కౌంట్ అందిస్తోంది. అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.27 వేలు అన్నమాట. ఐఫోన్‌ 15 బేస్‌ వేరియంట్‌పైనా 1400 యువాన్ల (రూ.16వేలు) మేర డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇలా ధరలు తగ్గించడం ఇది రెండోసారి.

* అమెజాన్‌పే- ఐసీఐసీఐ బ్యాంక్‌ కో బ్రాండ్‌ క్రెడిట్‌ కార్డ్‌ వాడుతున్నారా? అయితే మీకో బ్యాడ్‌ న్యూస్‌. క్రెడిట్‌ కార్డు ప్రయోజనాల్లో బ్యాంక్‌ కొంత కోత పెట్టింది. సాధారణంగా క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా చేసే వివిధ రకాల లావాదేవీలపై రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్లను ఐసీఐసీఐ అందిస్తోంది. ఇన్నాళ్లు అద్దె చెల్లింపులపై కూడా 1 శాతం రివార్డు పాయింట్లు ఇస్తోంది. ఇకపై ఈ రివార్డు పాయింట్లు ఉండవని బ్యాంక్‌ తెలిపింది. జూన్‌ 18 నుంచి ఇది అమల్లోకి రానుందని తెలిపింది. ఇప్పటికే యూజర్లకు సందేశాలు పంపుతోంది.

* JSW గ్రూప్‌లో భాగమైన JSW సిమెంట్‌ రాజస్థాన్‌లోని నాగౌర్‌ జిల్లాలో కొత్త సిమెంట్‌ తయారీ కేంద్రంలో రూ.3,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. దీనికి డెట్‌, ఈక్విటీ ద్వారా నిధులు సమకూరుస్తామని కంపెనీ తెలిపింది. ఈ యూనిట్‌లో క్లింకరైజేషన్‌, గ్రైండింగ్‌ యూనిట్లు, 18 మెగావాట్ల వేస్ట్‌ హీట్‌ రికవరీ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ ఉంటాయి. దీని ద్వారా 1,000కి పైగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని అంచనా. గనుల నుంచి సిమెంట్‌ తయారీ కర్మాగారానికి సున్నపురాయిని రవాణా చేయడానికి 7 కిలోమీటర్ల ఓవర్‌ల్యాండ్‌ బెల్ట్‌ కన్వేయర్‌ కూడా ఉంది. రాజస్థాన్‌లోని తమ పెట్టుబడుల్లో ఈ పెట్టుబడి ఒకటని JSW సిమెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్ధ్‌ జిందాల్‌ తెలిపారు. ప్రస్తుతం JSW సిమెంట్‌ వార్షికంగా 1.90 కోట్ల టన్నుల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ సామర్థ్యాన్ని 6 కోట్ల టన్నులకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత తయారీ యూనిట్లు కర్ణాటకలోని విజయనగర్‌, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, ఒడిశాలోని జాజ్‌పూర్‌, మహారాష్ట్రలోని డోల్విలో ఉన్నాయి. JSW సిమెంట్‌, దాని అనుబంధ సంస్థ శివ సిమెంట్‌ ద్వారా ఒడిశాలో క్లింకర్‌ యూనిట్‌ను కూడా నిర్వహిస్తోంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z