Business

ఇండిగోలో బిజినెస్ క్లాస్ సేవలు-BusinessNews-May 23 2024

ఇండిగోలో బిజినెస్ క్లాస్ సేవలు-BusinessNews-May 23 2024

* దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికి తమ విమానాల్లో బిజినెస్‌ క్లాస్‌ (Business Class) సేవలను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గురువారం నాటి మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ ఫైలింగ్‌లో వెల్లడించింది. తొలుత రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో వీటిని ప్రారంభించనున్నట్లు సంస్థ (IndiGo) తెలిపింది. బిజినెస్‌ క్లాస్‌ సేవల ప్రారంభ తేదీ, ఆఫర్లు, ఏయే మార్గాల్లో అందుబాటులో ఉండనున్నాయనే సమాచారాన్ని.. ఈ ఏడాది ఆగస్టులో జరిగే సంస్థ 18వ వార్షికోత్సవ కార్యక్రమంలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రయాణికులకు నిరంతరం వినూత్న సేవలు అందించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఇండిగో సీఈవో పీటర్‌ ఎల్బర్స్‌ తెలిపారు. ‘‘ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా అవతరించేందుకు భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నవ భారత్‌లో పౌరులకు మరింత మెరుగైన ప్రయాణ అవకాశాలు కల్పించడం మేం గర్వంగా భావిస్తాం. ఈ కొత్త సేవలను ప్రారంభించేందుకు మేం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సీఈవో హర్షం వ్యక్తంచేశారు.

* ఆన్‌లైన్‌ వేదికగా బీమా ఉత్పత్తులను విక్రయించే గో డిజిట్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌ (Go Digit listing) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ.272 కాగా.. రూ.281 వద్ద 3.35 శాతం ప్రీమియంతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇంట్రాడేలో ఇంకాస్త లాభపడింది. గతంలో ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) దంపతులు జాక్‌పాట్‌ కొట్టారు. వారు పెట్టిన పెట్టుబడికి నాలుగింతల ప్రతిఫలం లభించింది.

* దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు (Stock market) భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. ఆర్‌బీఐ డివిడెండ్‌, ఐటీ, బ్యాంకింగ్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. సెన్సెక్స్‌ దాదాపు 1200 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,900 ఎగువన ముగిసింది. సెన్సెక్స్‌ ఉదయం 74,253.53 పాయింట్ల (క్రితం ముగింపు 74,221.06) వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. తర్వాత లాభాల జోరు మొదలైంది. ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 75,499.91 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను అందుకుంది. చివరికి 1196.98 పాయింట్ల లాభంతో 75,418.04 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 369.85 పాయింట్ల లాభంతో 22,967.65 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 22,993.60 వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. సెన్సెక్స్‌ 30 సూచీలో సన్‌ఫార్మా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎన్టీపీసీ షేర్లు మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి.

* ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను మరింత సులభతరం చేయడం కోసం గూగుల్‌కు చెందిన పేమెంట్‌ యాప్ గూగుల్‌పే (Google pay) సరికొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. డిజిటల్‌ పేమెంట్లు పెరుగుతున్న తరుణంలో వినియోగదారుల కోసం మూడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. చెల్లింపులు చేసే ముందు కార్డ్‌ ప్రయోజనాలు చూపడం, బై నౌ పే లేటర్‌, కార్డ్‌ వివరాలపై భద్రత కల్పించడం వంటి సదుపాయాలను తాజాగా తీసుకొచ్చింది. ప్రత్యేకమైన రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లంటూ అనేక ప్రయోజనాలతో క్రెడిట్‌ కార్డులు వస్తాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్ల దగ్గర నుంచి విమాన ప్రయాణాలు, హోటళ్లలో బస వరకు ప్రతీ కార్డు ఏదో ఒక ఆఫర్‌ను అందిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉపయోగిస్తున్న వాళ్లకు నిర్దిష్ట కొనుగోళ్లపై ఏ కార్డు అధిక రివార్డు పాయింట్లు అందిస్తుందో గుర్తుంచుకోవడం కష్టం. ఉదాహరణకు ఒక క్రెడిట్‌ కార్డు కిరాణా కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంటే.. మరొకటి ట్రావెల్‌కి మాత్రమే డిస్కౌంట్‌ ఇస్తుంటుంది. ఇలాంటి సమయంలో గూగుల్‌పే తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌ మీకు సాయపడుతుంది. ప్రతీ కార్డ్‌ ప్రయోజనాలను మ్యానువల్‌గా చెక్‌ చేసే పని తప్పుతుందన్నమాట. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉపయోగించే వారికి ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. డెస్క్‌టాప్‌లో క్రోమ్‌ బ్రౌజర్‌లో గూగుల్‌ పేతో కొనుగోళ్లు జరుపుతున్నప్పుడు ఈ ఆప్షన్స్‌ కనిపిస్తాయి.

* మన దేశంలో ఐఐటీలకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివితే చాలు.. మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీల్లాంటి మాటల్నే తరచూ వింటూ ఉంటాం. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో అందుకు భిన్నమైన పరిస్థితులు వెలుగుచూస్తున్నాయి. మన దేశంలోని ఐఐటీల్లో విద్యనభ్యసించిన విద్యార్థుల్లో ఈ ఏడాది దాదాపు 38శాతం మందికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ దక్కకపోవడం గమనార్హం. ఐఐటీ కాన్పూర్‌ పూర్వ విద్యార్థి ధీరజ్‌సింగ్‌ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా సేకరించిన సమాచారంలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

* బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (Sensex) సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ (AEL) చోటు దక్కించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయని ఐఐఎఫ్‌ఎల్‌ ఆల్టర్నేటివ్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. సూచీ అర్ధవార్షిక పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా విప్రో స్థానంలో అదానీ కంపెనీ వచ్చి చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. అదే జరిగితే సెన్సెక్స్‌ సూచీలో చేరిన తొలి అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీగా ఏఈఎల్‌ నిలుస్తుంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z