ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిడదవోలు మండలం రావిమెట్లలో హృదయాలయం మానసిక దివ్యాంగుల పాఠశాలకు చేయూతను అందించారు. నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి ఈ పాఠశాలను సందర్శించారు. మానసిక దివ్యాంగుల చదువుకు వినియోగించే మెటీరియల్ కోసం 50 వేల రూపాయలను నాట్స్ ద్వారా అందించారు. నాట్స్-హోప్ ఫర్ స్పందన సంస్థలు ఈ పాఠశాలకు తోడ్పాటును అందిస్తున్నారు.
నాట్స్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పేదరికం కారణంగా ఎవరూ వైద్యానికి దూరం కాకుడదనే సంకల్పంతో నాట్స్ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు చేయూత, విద్యార్ధులకు ఉపకారవేతనాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సుశీల నేత్రాలయం, మైత్రి హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరంలో దాదాపు 1000 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు ఉచితంగా అందించారు. ఈ శిబిరంలో నాట్స్ సభ్యులతో పాటు స్థానికులు సుబ్బారావు దాసరి, ఎస్ చౌదరి, నారాయణ, బాలకాశి పాల్గొని విజయవంతం చేశారు. నాట్స్ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యులకు, సభ్యులకు నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z