Devotional

తిరుమల కొండపై తెలంగాణ ప్రభుత్వ సత్రం

తిరుమల కొండపై తెలంగాణ ప్రభుత్వ సత్రం

తెలంగాణ నుంచే వెళ్లే భక్తుల కోసం తిరుమల కొండపై ప్రత్యేక సత్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ భక్తులకు తిరుమలలో మెరుగైన సౌకర్యాలు కల్పించేలా, మన రాష్ట్రం నుంచి జారీ అయ్యే సిఫారసు లేఖలకు టీటీడీలో ప్రాధాన్యత లభించేలా తగిన చర్యలు చేపట్టాలని భావిస్తున్నది. రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సివిల్‌ సర్వీస్‌ అధికారులు, దేవాదాయ శాఖ ఇచ్చే సిఫారసు లేఖలకు తిరుమలలో ప్రాధాన్యమిచ్చేవారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి వెళ్లేవారిలో ప్రొటోకాల్‌ ఉన్నవారు మినహా ఇతరులంతా సామాన్య భక్తుల మాదిరిగానే పరిగణిస్తున్నారు. తెలంగాణ మంత్రులు, వీఐపీలు ఇచ్చే సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడంలేదు.

టీటీడీ బోర్డులో తెలంగాణ ప్రతినిధికి అవకాశం కల్పిస్తున్నప్పటికీ రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో బోర్డులో రాష్ర్టానికి ఇస్తున్న ప్రాతినిధ్యం సరిపోవడంలేదు. దీంతో రాష్ట్రం నుంచే వెళ్లే భక్తులకు అసౌకర్యం కలుగుతున్నది. ముఖ్యంగా ప్రత్యేక దర్శనం, వసతి కోసం తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఇచ్చే సిఫారసు లేఖలు చెల్లుబాటు కావడంలేదు. దీంతో ఇటీవల దేవాదాయ శాఖ మంత్రి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. తిరుమలలో తెలంగాణ సత్రాన్ని నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వంతో చర్చించి కొండపై స్థలాన్ని సమకూర్చుకోవాలని, తెలంగాణ భక్తులకు తిరుమలలో మెరుగైన సదుపాయాలు కల్పించేలా అక్కడ ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని ఈ భేటీలో నిర్ణయించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z