* కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రమోదీ.. పీఎం కిసాన్ (PM Kisan) నిధుల విడుదల పైనే తొలి నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పీఎం కిసాన్ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపై సంతకం చేశారు. దీనివల్ల 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం కలగనుంది. పెట్టుబడి సాయం కింద మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున ఏటా కేంద్రం ఈ పథకం కింద రూ.6 వేలు అందిస్తోంది. ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లకు పైగా మొత్తాన్ని కేంద్రం రైతుల ఖాతాల్లో జమ చేసింది. 17వ విడతగా కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాలు త్వరలో బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఆన్‌లైన్‌లోనూ ఆ వివరాలు తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ (pmkisan.gov.in) వెబ్సైట్ ఓపెన్ చేసి.. అందులో బెనిఫిషియరీ స్టేటస్ పేజీపై క్లిక్ చేయాలి. ప్రత్యేకంగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డేటా బటన్‌పై క్లిక్ చేయగానే పేమెంట్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ చేయకపోతే నిధులు జమ కావు. కాబట్టి ఒకవేళ కేవైసీ పూర్తి చేయకుంటే అదే వెబ్సైట్లో ఇ-కేవైసీ బటన్‌ను క్లిక్ చేసి ప్రక్రియను పూర్తి చేయాల్సిఉంటుంది.
* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో ఉదయం లాభాల్లో కదలాడిన సూచీలు.. ఆఖర్లో అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఫైనాన్షియల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు బలహీనపడ్డాయి. దీంతో ఆరంభ లాభాలు ఆవిరయ్యాయి.
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను తమ డివైజుల్లో అందిస్తూ పలు ఎలక్ట్రానిక్ సంస్థలు దూసుకుపోతుంటే.. యాపిల్ మాత్రం కాస్త వెనుకంజలో ఉంది. తాజాగా ఆ లోటును భర్తీ చేస్తూ కీలక ప్రకటన చేసింది. తమ పరికరాల్లో చాట్‌జీపీటీని అనుసంధానం చేయనున్నట్లు వెల్లడించింది. దీనికోసం చాట్‌జీపీటీ (ChatGPT) సంస్థ ఓపెన్ ఏఐ (OpenAI)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక ప్రపంచవ్యాప్త డెవలపర్ల సమావేశంలో (WWDC24) కంపెనీ సీఈఓ టిమ్ కుక్ (Tim Cook) కొత్త ఫీచర్లతో పాటు చాట్‌జీపీటీ గురించి ప్రస్తావించారు. యాపిల్ ఉత్పత్తులను సులభంగా నావిగేట్ చేసేందుకు ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ను ఆవిష్కరించారు. ఇక ఐఫోన్లూ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) సపోర్ట్ చేస్తాయని తెలిపారు. సాధారణ ఎస్సెమ్మెస్/ఎంఎంఎస్ టెక్ట్సింగ్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ అయిన ఈ ఆర్‌సీఎస్‌లో వాట్సప్ తరహా సదుపాయాలు ఉంటాయి. ఇప్పటివరకు కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకే పరిమితమైన కాల్ రికార్డింగ్ ఫీచర్‌ని ఐఫోన్లలోనూ తీసుకొచ్చింది. దీంతో ఇకపై కాల్స్‌ని రికార్డ్ చేసుకోవచ్చు. వీటితోపాటు యాప్ లాక్, యాప్ హైడ్, గేమ్ మోడ్ వంటి ఫీచర్లను జోడించింది. ఐప్యాడ్‌లో క్యాలిక్యులేటర్ సదుపాయం తీసుకొచ్చింది.
* సురక్షిత పెట్టుబడి పథకాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఒకటి. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి నష్ట భయంతో కూడుకున్న పథకాల జోలికి వెళ్లలేని వారు వీటిపైనే ప్రధానంగా ఆధారపడుతుంటారు. పన్ను ఆదా చేసేందుకు కొందరు ఫిక్స్డ్ డిపాజిట్లను ఆశ్రయిస్తుంటారు. వీటికి ఐదేళ్ల లాక్- ఇన్ పీరియడ్ ఉంటుంది. దీన్ని మూడేళ్లకు తగ్గించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రుణాలతో పోలిస్తే డిపాజిట్లు ఆశించిన మేర పెరగకపోవడం పట్ల బ్యాంకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ లోటును పూరించడానికి సర్టిఫికెట్స్ ఆఫ్ డిపాజిట్లపై ఆధారపడాల్సి వస్తోందని, ఇది తమకు భారంగా మారుతున్నట్లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో డిపాజిట్లు తగ్గుముఖం పట్టడంపై బ్యాంకులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు తాజాగా విజ్ఞాపనను సమర్పించాయి. అందులో ప్రస్తుతం ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లకు నిర్దేశించిన కాలపరిమితిని మూడేళ్లకు తగ్గించాలని కోరినట్లు బ్యాంక్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఓ ఆంగ్ల పత్రికకు తెలియజేశారు. 2023-24లో బ్యాంకుల్లో డిపాజిట్లు 12.9 శాతంగా ఉండగా.. రుణాలు 16.3 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z