* పెంపుడు శునకం కరవడంతో కుమారుడు మృతి చెందగా.. మనస్తాపంతో తండ్రి చనిపోయిన ఘటన భీమిలి సమీపంలోని ఎగువపేటలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలిపిల్లి నరసింగరావు(55) భీమిలి బస్టాండ్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన కుమారుడు భార్గవ్(23)ను నెల రోజుల క్రితం ఇంట్లోని పెంపుడు శునకం కరిచింది. దీంతో అతడు నాలుగు రోజుల క్రితం రేబిస్‌తో మృతి చెందాడు. మరోవైపు నరసింగరావు కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య సాయంతో గత పదేళ్లుగా ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నాడు. అనారోగ్యానికి తోడు కుమారుడి మృతితో మనస్తాపం చెందిన ఆయన మంగళవారం ఉదయం మృతి చెందాడు.
* మహిళల దుస్తులు ధరించిన విమానాశ్రయ అధికారి ఒకరు తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లా పంత్‌నగర్‌లోని విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పితోర్‌గఢ్ జిల్లాకు చెందిన ఆశిష్ చౌసాలి విమానాశ్రయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. సోమవారం ఆయన మహిళల దుస్తులు ధరించి, నుదుటన బొట్టు బిళ్ల పెట్టుకుని, లిప్‌స్టిక్ వేసుకుని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉధమ్‌సింగ్‌నగర్ జిల్లా (నగర) ఎస్పీ మనోజ్ కత్యాల్ మంగళవారం ఈ విషయాన్ని తెలిపారు. ఈ ఘటనను ప్రాథమికంగా ఆత్మహత్యగా భావిస్తున్నామని, గదిలో ఎలాంటి ఆధారాలు దొరకలేదని వెల్లడించారు.
* రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని 280 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి తరలిస్తున్న రెండు కార్లతో పాటు మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన భోస్లే అబ మశ్చింద్ర(29), అవినాష్ శివాజీ రాథోడ్(19), సిద్ధ రామేశ్వర్ పూజారి(27) అనే ముగ్గురు యువకులు గంజాయిని ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు తేలింది. ఒడిశాలో తేజ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. మహారాష్ట్రలో గంజాయి వ్యాపారం చేస్తున్న అజయ్ రాథోడ్ వద్ద మశ్చింద్ర, శివాజీ రాథోడ్, రామేశ్వర్ పూజారి పని చేస్తున్నారు. అజయ్ సూచనల మేరకు ఒడిశాకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేశారు. ఒడిశాకు చెందిన తేజ గంజాయిని పండిస్తూ, అవసరమైన వారికి విక్రయిస్తున్నాడు. ఇక ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయిని తరలిస్తుండగా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎస్‌వోటీ పోలీసులు గుర్తించి సీజ్ చేశారు.
* ఆరునెలల క్రితందాకా శాంతి భద్రతలకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్టు కనిపిస్తున్నది. పేట్రేగిపోతున్న సైబర్ ముఠాలు, ఏకంగా ఐపీఎస్‌ల కుటుంబసభ్యుల నుంచే దోపిడీలు.. చెలరేగుతున్న హంతకులు, ఒక్క జూన్ నెలలోనే 26 హత్యలు, మత ఘర్షణలు, డ్రగ్స్ ముఠాలు, దారిదోపిడీ, చైన్‌స్నాచింగులు ఇలా ఎన్నో నేరాలూ-ఘోరాలు. హోంశాఖకు పూర్తిస్థాయి మంత్రి లేకపోవడం, ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు విఫలం కావడం, వ్యవస్థాగత సమీక్షలను పక్కనబెట్టడం, శాంతిభద్రతల పరిరక్షణపై క్రమంతప్పకుండా చేయాల్సిన పనులు చేయకపోవడం ఇందుకు కారణాలని సీనియర్ ఐపీఎస్‌లు విశ్లేషిస్తున్నారు.పోలీసు విభాగంపై సర్కారుకు పట్టుతప్పినట్టు కనిపిస్తున్నదని పోలీస్ స్టేషన్లలోనే సెటిల్‌మెంట్లు, భూదందాలు జరుగుతన్నాయని, ఈ ఏడాది ఏసీబీ అధికారులు నమోదుచేసిన కేసుల్లో 20కి పైగా పోలీసులవే ఉండగా దాదాపు 35 మంది వరకు పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని వారు గుర్తుచేస్తున్నారు. 30మందికి పైగా సీఐలు, ఎస్‌ఐలు సస్పెండ్ అవడం పరిస్థితి తీవ్రతకు సూచిక అని విశ్లేషిస్తున్నారు.ఏకంగా ముఖ్యమంత్రి చర్చలు జరుపుతున్న ప్రదేశానికి సైతం ఇతర పార్టీల నేతలు దూసుకురావడం, హైదరాబాద్ శివార్లలో నాలుగువేల మంది వరకు హఠాత్తుగా గుమిగూటినా ప్రభుత్వాని ముందస్తు సమాచారం లేకపోవడం ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. ఏడెనిదినెలల క్రితం కేవలం 5 నిమిషాలుగా ఉన్న డయల్ 100 రెస్పాన్స్‌టైం ఇప్పుడు గంటల్లోకి జారిపోయిందని పోలీసు వ్యవస్థ వైఫల్యానికి ఇంతకు మించిన మచ్చుతునక అవసరంలేదని వారు వివరిస్తున్నారు.దేశంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా భావిస్తున్న తెలంగాణ పోలీలు సాంకేతిక వ్యవస్థపై కేవలం 20 ఏండ్లు కూడా లేని ఒక పిలగాడు సైబర్‌దాడి చేసి కకావికలు చేయడం పర్యవేక్షణలోపాన్ని పట్టిచూపిస్తున్నదని సీనియర్ ఐపీఎస్‌లు పేర్కొంటున్నారు. అనురాగ్ శర్మ, మహేందర్‌రెడ్డి వంటి సీనియర్ ఐపీఎస్ నెలకొల్పిన వ్యవస్థలను వాడుకోవడం, కాపాడుకోవడం కూడా ఇప్పుడున్న పోలీస్ పెద్దలకు చేతకావడం లేదని వారు తప్పుబడుతున్నారు.
* లైంగిక దాడుల కేసులో గతంలో అన్న ప్రజ్వల్ రేవణ్ణకు పోలీసులు, వైద్యులు లైంగిక పటుత్వ పరీక్షలను నిర్వహించారు. ఇప్పుడు తమ్ముడు సూరజ్‌కు కూడా ఇవే పరీక్షలు చేయడానికి సీఐడీ ప్రత్యేక తనిఖీ బృందం సిద్దమైంది. యువకున్ని బెదిరించి అసహజ లైంగిక దాడి చేశారనే కేసులో ఈ నెల 23వ తేదీన సూరజ్‌ని హాసన్‌లో అరెస్టు చేయడం తెలిసిందే. కేసు విచారణలో భాగంగా అతి త్వరలోనే అతనికి బౌరింగ్ ఆస్పత్రిలో పురుషత్వ పరీక్షలు చేయించే అవకాశముంది. అలాగే స్వలింగ కామం సహజమైందా అనేదానికి మరికొన్ని పరీక్షలు చేయవచ్చని పోలీసులు తెలిపారు. అన్న ప్రజ్వల్‌కు జరిపిన పరీక్షల కంటే కొంతవరకు భిన్నంగా ఉంటాయని తెలిసింది. సూరజ్ ప్రస్తుతం సీఐడీ కస్టడీలో ఉన్నాడు. మూడు కేసుల్లో ప్రజ్వల్‌కు మూడుసార్లు పరీక్షలు చేశారు. ఇదేం బాగాలేదని అతడు కోర్టులో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు సూరజ్ ఆప్తుడు శివకుమార్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతన్ని అరెస్టు చేస్తే కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయంటున్నారు.
* ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే..అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు.ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
* లిక్కర్ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది.లిక్కర్ కేసులో సోమవారం నాడు తీహార్ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది.అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్. అయితే.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.‘‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z