* దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను తిరగరాశాయి. సెన్సెక్స్ తొలిసారి 80వేల మార్కును అందుకుంది. ఇంట్రాడేలో 80,074 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకి కాస్త క్షీణించి 80వేల మార్కు దిగువన ముగిసింది. నిఫ్టీ సైతం 24,307 పాయింట్ల వద్ద సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంకు షేర్లలో కొనుగోళ్ల మద్దతు సూచీలకు ప్రధానంగా కలిసొచ్చింది. సెన్సెక్స్ ఉదయం ఆరంభంలోనే 80,013.77 పాయింట్ల ఎగువన ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇటీవలే 75 వేల మార్కును అందుకున్న సెన్సెక్స్ కేవలం 57 రోజుల్లోనే 80 వేల మార్కును చేరుకోవడం గమనార్హం. ఇంట్రాడేలో 79,754.95 – 80,074.30 మధ్య చలించిన సూచీ.. చివరికి 545.35 పాయింట్ల లాభంతో 79,986.80 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 162.65 పాయింట్లు లాభపడి 24,286.50 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.52గా ఉంది.
* దేశీయ సోషల్ మీడియా యాప్.. కూ (Koo app) మూత పడింది. ఎక్స్ (ట్విటర్‌కు)కు ప్రత్యామ్నాయంగా మారుతుందని అనిపించిన ఈ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్ తన కార్యకలాపాలను తాజాగా నిలిపివేసింది. సంస్థ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ ఈ మేరకు లింక్డిన్‌లో బుధవారం పోస్ట్ చేశారు. డైలీ హంట్ సహా వివిధ కంపెనీలతో విక్రయానికి చర్చలు జరిపినా అవేవీ సఫలీకృతం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కూ యాప్ 2019లో ప్రారంభమైంది. అప్రమేయ రాధాకృష్ణ, మయాంకర్ బిడవట్కా కలిసి దీన్ని ప్రారంభించారు. రాధాకృష్ణ సీఈఓగా వ్యవహరిస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో అకౌంట్ల బ్లాకింగ్ విషయంలో ట్విటర్‌తో కేంద్రానికి ఘర్షణ నెలకొన్నప్పుడు కూ యాప్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ క్రమంలో కేంద్రమంత్రులే స్వయంగా ఆత్మనిర్భర్ యాప్‌గా దీన్ని ప్రమోట్ చేశారు. దీంతో అనతి కాలంలో యూజర్ బేస్ భారీగా పెరిగింది. తర్వాత నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాలకూ తన కార్యకలాపాలను విస్తరించింది. తర్వాతి కాలంలో సంస్థకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి చేరింది. ఈ ఏడాది లేఆఫ్‌లూ ప్రకటించింది.
* ప్రయాణికుల సౌలభ్యం కోసం తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు మహానగరాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటికి వచ్చిన ఆదరణతో త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రైళ్ల ట్రయల్ రన్ ఆగస్టు 15న ప్రారంభం కానుంది. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి, కాచిగూడ-బెంగళూర్ మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వందే భారత్ స్లీపర్ రైళ్లను కూడా కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రతిపాదించారు. ఇక కొత్తగా నడుపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అత్యంత రద్దీ రూట్లైన కాచిగూడ-విశాఖ, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో నడపాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు 16 బోగీలతో నడపనున్నారు. ఇవి ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు కావడంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
* దేశీయ మార్కెట్లోకి నయా వెస్పా అందుబాటులోకి వచ్చింది. లిమిటెడ్ ఎడిషన్‌గా విడుదలైన ఈ వెస్పా 946 డ్రాగన్ స్కూటర్ 155 సీసీ సామర్థ్యంతో తీర్చిదిద్దింది. కేవలం అంతర్జాతీయంగా 1,888 యూనిట్లు మాత్రమే విక్రయిస్తున్న ఈ మాడల్ ధర రూ.14,27,999(ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి)గా నిర్ణయించింది. భారత్‌లో ఎన్ని యూనిట్లు విక్రయిస్తున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ స్కూటర్ కోసం ముందస్తు బుకింగ్‌లు ఆరంభించింది కూడా సంస్థ. డ్యూయల్ చానెల్ ఏబీఎస్, 200 ఎంఎం డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్స్‌తో రూపొందించిన ఈ స్కూటర్ యువతకు నచ్చుతుందని పేర్కొంది.
* దేశీయ టెలికం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు రీచార్జి ప్లాన్ల ధరలను పెంచుతూ టెలికం కస్టమర్లకు షాకిచ్చిన విషయం తెలిసిందే. గతవారంలో జియో తన ప్లాన్ల ధరలను 10 శాతం నుంచి 21 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకోగా.. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా ప్లాన్ల ధరలను 25 శాతం వరకు సవరించాయి. అయితే చార్జీలు పెంచిన తర్వాత జియో ప్లాన్లే చౌక ధరకు లభిస్తుండటం విశేషం. ఉదాహరణకు రోజుకు 1 జీబీ డాటా, అన్‌లిమిటెడ్ ప్లాన్ ధర రూ.249 కాగా, అదే ఎయిర్‌టెల్/వొడాఫోన్ ఐడియాలు రూ.299కి అందిస్తున్నాయి. అంటే 20 శాతం తక్కువ ధరకే లభిస్తుండటంతో రూ.50 ఆదా కానున్నది. అలాగే రోజుకు 2 జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్ జియో రూ.249కి అందిస్తుండగా, ఎయిర్‌టెల్/వొడాఫోన్ ఐడియాలు రూ.379గా ఉన్నది. జియో కస్టమర్లు 9 శాతం తక్కువ ధరకే ఈ ప్లాన్ లభిస్తుండటం విశేషం. మరోవైపు, మూడు నెలల ప్లాన్ విషయానికి వస్తే 6జీబీ డాటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌ను జియో రూ.479కి అందిస్తుండగా, అదే ఎయిర్‌టెల్/వొడాఫోన్ ఐడియాలు ఆరు శాతం అధికంగా రూ.509కి అందిస్తున్నాయి. రోజుకు 1.5 జీబీ డాటా ప్లాన్ జియో ధర రూ.799 ఉండగా, అదే పోటీ సంస్థలైన ప్లాన్లు 8 శాతం ఎక్కువగా రూ.859కి అందిస్తున్నాయి.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z