రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు ఇప్పట్లో తాను హైదరాబాద్ తిరిగి రాలేనని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇవ్వడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు అరెస్టయిన నలుగురు అధికారుల వాంగ్మూలం, స్వాధీనం చేసుకున్న ధ్వంసమైన కొన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తప్ప ఈ కేసులో చెప్పుకోదగిన పురోగతి కనిపించడంలేదు. ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో నిందితుడు శ్రవణ్‌రావు విదేశాల్లో ఉండటమే ఇందుకు కారణం.
తామే అనుమతి ఇచ్చుకొని, తామే ట్యాపింగ్ చేయడం ఎక్కడా ఉండదు. ఫోన్ ట్యాపింగ్ కోసమే అప్పటి ప్రభుత్వం ప్రభాకర్‌రావుకు ఆ అధికారాన్ని కట్టబెట్టింది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొచ్చంటూ ముక్తాయింపు ఇచ్చినా అదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభాకర్‌రావు ముఠా చెలరేగింది. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తు… ప్రభాకర్‌రావు స్వదేశానికి తిరిగొస్తేనే ముందుకు సాగుతుంది. కేసు నమోదవడానికి ముందే ఆయన వైద్యం కోసం అమెరికా వెళ్లిపోయారు. అయితే… తాను పారిపోలేదని, జూన్ 26నాటికి తిరిగొచ్చి, దర్యాప్తునకు సహకరిస్తానని న్యాయస్థానంలో మెమో దాఖలు చేయించారు. గడువులోగా రాకపోగా చికిత్స కోసం మరికొన్ని రోజులు విదేశాల్లోనే ఉండాల్సి వస్తోందని రెండు రోజుల క్రితం మెయిల్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు… ఆయనపై బ్లూకార్నర్ నోటీసు జారీ చేయించేందుకు ప్రయత్నించారు. విదేశాల్లో ఉన్న నిందితుల ఆచూకీని ఇంటర్‌పోల్ ద్వారా కనుక్కునేందుకు బ్లూకార్నర్ నోటీసు ఇస్తుంటారు. ఈ మేరకు ఇంటర్‌పోల్ విభాగానికి లేఖ రాయాలని సీఐడీ ద్వారా స్థానిక పోలీసులు సీబీఐని కోరారు. ఆ విన్నపం ఇంకా సీబీఐ వద్దే పెండింగ్‌లో ఉంది. ఇది ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కేసు నమోదవకముందే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లారు. అంతకుముందు కూడా చికిత్స కోసమే పలుమార్లు వెళ్లివచ్చారు. ఈ కారణంగానే ఆయన పరారీలో ఉన్నట్లు నిర్ధారించడం అంత సులభం కాదు. అలాంటప్పుడు ఇంటర్‌పోల్ లాంటి సంస్థ బ్లూకార్నర్ నోటీసు జారీ చేయడం అనుమానమే.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z