తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాతిరోజు సీనియర్ నేత కే కేశవరావు బీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలే ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ నా సొంత ఇల్లు. నేను కాంగ్రెస్ మనిషిని. తిరిగి పార్టీలోకి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎంతో స్వేచ్ఛగా కూడా ఉంది. నైతిక విలువలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను. ఇదే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ కూడా అదే చెప్పాను అని అన్నారాయన. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపైనా స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిందే కాంగ్రెస్ ఎంపీల పోరాటం వల్లే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక పాలన ప్రజాస్వామ్య బద్దంగా ఉంది. ఆరు నెలల్లో ఎవరిని కూడా అంచనా వెయలేం. గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఫ్యామిలీ పబ్లిసిటీ చేసేవాళ్లు. కానీ, ఈ ఆరు నెలల్లో తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలనే చూశా అని అన్నారు. రెండేళ్ల పదవీకాలం ఉండగానే కేకే రాజ్యసభకు రాజీనామా చేశారు. దీంతో ఆ సీటు మరొకరికి దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే త్వరలో కేకేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవి దక్కవచ్చనే ప్రచారం ఒకటి మొదలైంది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z