NRI-NRT

రిషి సునాక్ ఘోర పరాజయం-NewsRoundup-July 05 2024

రిషి సునాక్ ఘోర పరాజయం-NewsRoundup-July 05 2024

* తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్‌ ఇచ్చిన డాక్టర్‌ పోస్ట్‌పై సమంత స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని.. డబ్బులు లేని వాళ్లు అలాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని ఆమె (Samantha) తెలిపారు. సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్ట్‌ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబ్యులైజేషన్‌ గురించి పోస్ట్ పెట్టారు. ‘మాములుగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ.. నెబ్యులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. దీనిపై కొందరు డాక్టర్లు ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్‌ టిప్‌ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిలో ఒక డాక్టర్‌ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘సమంతకు హెల్త్‌, సైన్స్‌ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతోమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమెను జైల్లో వేయాలి. జరిమానా విధించాలి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా దీనిపై సమంత స్పందించారు. తన సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

* వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువారం ఆదిత్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్‌కల్యాణ్‌కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది.

* ఐదేళ్లు పాలించిన వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ భవనాలకు కనీసం సున్నం కూడా వేయలేదని శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అమరావతిలోని ఎమ్మెల్యేల క్వార్టర్స్‌, అసెంబ్లీ పరిసరాలను ఆయన పరిశీలించారు. స్పీకర్ వెంట ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, అధికారులు ఉన్నారు.

* భారాస అధ్యక్షుడు కేసీఆర్‌పై విశ్వాసం లేకపోవడంతోనే ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందెవరో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు.

* రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024)ను అందుకొన్న ఏకైక భారత క్రికెటర్ కెప్టెన్ రోహిత్ శర్మ. మొదట 2007లో ఎంఎస్ ధోనీ నాయకత్వంలో విజేతగా నిలిచిన జట్టులో రోహిత్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతడి కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా విశ్వవిజేతగా నిలిచింది.

* ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ (Sanjay Singh)ను ఆప్ పార్లమెంటరీ ఛైర్‌పర్సన్‌గా ఆ పార్టీ నియమించింది. సంజయ్‌ సింగ్‌ 2018లో తొలిసారిగా రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

* అమర్‌నాథ్‌ యాత్ర (Amarnath Yatra) ముగిసిన అనంతరం జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) నిర్వహించనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర భాజపా (BJP) నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదేశించినట్లుగా సమాచారం.

* బిహార్‌లో గత కొద్దిరోజులుగా వరుసగా బ్రిడ్జ్‌లు కూలిపోతున్నాయి. 17 రోజుల వ్యవధిలో 12 వంతెనలు కూలిపోవడం (Bihar Bridge Collapse) చర్చనీయాంశంగా మారింది. దీనికి కేంద్ర మంత్రి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జితన్‌ రామ్‌ మాంఝీ ఇచ్చిన వివరణ నివ్వెరపరుస్తోంది. ‘‘ఇది రుతుపవనాల సమయం. ప్రస్తుతం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. బ్రిడ్జ్‌లు కూలడానికి కారణం అదే. ఈ ఘటనలపై దర్యాప్తు విషయంలో ముఖ్యమంత్రి సీరియస్‌గా ఉన్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని మంత్రి వెల్లడించారు.

* బ్రిటన్ పార్లమెంట్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ (Conservative Party) ఓటమి పాలైంది. దీంతో ఆ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు చెప్పారు. బ్రిటన్‌ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘన విజయంతో 14ఏళ్ల కన్జర్వేటివ్‌ల పాలనకు తెరపడింది. కష్టకాలంలో పాలనా పగ్గాలు చేపట్టిన రిషి సునాక్‌.. ఓటమిని అంగీకరిస్తూ, ఇదో ‘కష్టమైన రాత్రి’ అని పేర్కొన్నారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నప్పటికీ అంతకుముందు అధికారం చేపట్టిన టోరీల నిర్ణయాలే ఈ దుస్థితికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో (UK Parliament Elections) రిషి సునాక్‌ నేతృత్వంలోని కన్జర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమికి పూర్తి బాధ్యత వహించిన సునాక్‌ (Rishi Sunak) పదవి నుంచి దిగిపోయారు. అంతకుముందు తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ ముందు నిలబడి ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘‘ముందుగా మీ అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నా. ప్రధానిగా నా బాధ్యతలను ఏ లోటు లేకుండా నిర్వర్తించానని భావిస్తున్నా. కానీ, యూకేలో ప్రభుత్వం కచ్చితంగా మారాల్సిందేనని మీరు (ప్రజలు) స్పష్టమైన సందేశమిచ్చారు. మీ తీర్పే అంతిమం. మీ ఆగ్రహాన్ని, అసంతృప్తిని నేను విన్నాను. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే’’ అంటూ తన భార్య అక్షతామూర్తిని చూసుకుంటూ సునాక్‌ ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

* ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండ్రోజుల దిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల జగన్‌ పాలనతో సరిదిద్దలేనంత నష్టం జరిగిందన్నారు. ‘‘దక్షిణాదిలో ఏ రాష్ట్రానికీ లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయి. నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చు. గోదావరి నుంచే మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు నీరు ఇవ్వొచ్చు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులూ ఆశించలేదు. వాజ్‌పేయీ ప్రభుత్వంలోనూ పదవులు ఆశించలేదు. ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్‌పేయీ కోరినా అంగీకరించలేదు. ఎన్డీయే ఉన్నందున అప్పుడు స్పీకర్‌ పదవి తీసుకున్నాం. ఇప్పుడు కూడా ఎన్డీయే ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నాం.

* ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఇద్దరి నుంచి మాత్రమే నామినేషన్లు రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైందని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్న సి.రామచంద్రయ్య, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌ వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. వారిలో ఇక్బాల్‌ ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేయగా, రామచంద్రయ్యపై అనర్హత వేటు పడింది. దాంతో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఉప ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవమయ్యాయి. తెదేపా సీనియర్‌ నేత సి.రామచంద్రయ్యకు ఎన్‌డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. మరో స్థానాన్ని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి.హరిప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. శాసనసభలో ఎన్‌డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వారిద్దరి ఎన్నిక లాంఛనంగా పూర్తయింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z