Politics

రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చర్యలు-NewsRoundup-July 10 2024

రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చర్యలు-NewsRoundup-July 10 2024

* తెలంగాణలో రహదారుల నిర్మాణంపై బుధవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రహదారులకు భూసేకరణ ప్రక్రియలో ఎందుకు జాప్యం జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌, మార్కెట్‌ ధరల మధ్య భారీ వ్యత్యాసంతో రైతులు ముందుకు రావట్లేదని కలెక్టర్లు వివరణ ఇచ్చారు. దీంతో భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించాలని, నిబంధనల ప్రకారం రైతులకు ఎక్కువ పరిహారం దక్కేలా చూడాలని సీఎం సూచించారు. భూములు కోల్పోతున్న రైతులను పిలిచి కలెక్టర్లు మాట్లాడాలని, ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణ, ఉత్తర భాగాలకు ఒకే నంబర్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్‌హెచ్‌ఏఐ త్రైపాక్షిక ఒప్పందానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

* తెలంగాణలో 15 ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

శాంతి భద్రతల అదనపు డీజీపీగా మహేశ్‌ భగవత్‌
హోంగార్డుల, ఆర్గనైజేషన్‌ అదనపు డీజీగా స్వాతి లక్రా
గ్రేహౌండ్స్‌ ఏడీజీగా స్టీఫెన్‌ రవీంద్ర
పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీగా విజయ్‌ కుమార్‌ (పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు బాధ్యతలు)
టీజీఎస్పీ బెటాలియన్ల అదనపు డీజీగా సంజయ్‌ కుమార్‌
రాచకొండ పోలీస్‌ కమిషనర్‌గా సుధీర్‌ బాబు
ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ జోషి
మల్టీజోన్‌-1 ఐజీగా ఎస్‌.చంద్రశేఖర్‌రెడ్డి
మల్టీజోన్ -2 ఐజీగా వి.సత్యనారాయణ
రైల్వే, రోడ్‌ సేఫ్టీ ఐజీగా కె.రమేశ్‌ నాయుడు
మెదక్‌ ఎస్పీగా ఉదయ్‌ కుమార్‌రెడ్డి
వనపర్తి ఎస్పీగా ఆర్‌.గిరిధర్‌
హైదరాబాద్‌ తూర్పు మండలం డీసీపీగా జి.బాలస్వామి
హైదరాబాద్‌ పశ్చిమ మండలం డీసీపీగా జి.చంద్రమోహన్‌
సీఏఆర్‌హెడ్‌ క్వాటర్స్‌ డీసీపీగా రక్షితమూర్తి

* ఏపీలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడితో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రోకెమికల్‌ కారిడర్‌ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. బుధవారం భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటిడ్‌(బీపీసీఎల్‌) ఛైర్మన్‌, ఎండీ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను సీఎం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

* ‘వాల్తేరు వీరయ్య’లోని ‘వేర్‌ ఈజ్‌ ది పార్టీ..’ సాంగ్‌లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసి ఉర్రూతలూగించిన బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela). ప్రస్తుతం ‘ఎన్‌బీకే 109’ (వర్కింగ్‌ టైటిల్‌)లో నటిస్తున్నారామె. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. షూటింగ్‌లో భాగంగా ఊర్వశీకి స్వల్ప గాయాలయ్యాయని వార్తలొచ్చాయి. దీంతో, తమ అభిమాన నటి ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై నటి స్పందించారు. ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్న సంబంధిత దృశ్యాలు పంచుకున్నారు. అందులో విక్టరీ సింబర్‌ చూపుతూ కోలుకున్నట్టు పరోక్షంగా వెల్లడించారు.

* ఉస్మానియా యూనివ‌ర్సిటీలో పోలీసులు.. రౌడీలా మాదిరి ప్ర‌వ‌ర్తించారు. డీఎస్సీ వాయిదా వేయాల‌ని నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా నిర‌స‌న తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుల ప‌ట్ల పోలీసులు అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బీఆర్ఎస్వీ నాయ‌కుల‌ను చుట్టుముట్టిన పోలీసులు.. వారిపై దాడి చేశారు. అనంత‌రం పోలీసు వ్యాన్‌లో ఎక్కించారు. అక్క‌డున్న మ‌రికొంత మంది నాయ‌కులు.. శాంతియుతంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న త‌మ‌పై దాడులు ఏంట‌ని పోలీసుల‌ను నిల‌దీశారు. ఈ క్ర‌మంలో అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

* ఉస్మానియా యూనివ‌ర్సిటీ మెయిన్ లైబ్ర‌రీ వ‌ద్ద డీఎస్సీ అభ్య‌ర్థుల ఆందోళ‌న‌ల‌ను క‌వ‌రేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్ట‌ర్ ప‌ట్ల పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించిన సంగ‌తి తెలిసిందే. జీ న్యూస్ రిపోర్ట‌ర్ చొక్కా ప‌ట్టుకుని పోలీసులు లాక్కెళ్లారు. నేను జ‌ర్న‌లిస్టును.. మీ ప‌ని మీరు చేసుకోండి.. మా ప‌ని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోకుండా, బ‌ల‌వంతంగా పోలీసు వాహ‌నంలో ఎక్కించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ స‌ర్కార్‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు.

* ఉస్మానియా యూనివ‌ర్సిటీలో మ‌ళ్లీ ఉద్య‌మ కాలం నాటి ప‌రిస్థితులు పున‌రావృతం అవుతున్నాయ‌ని, విద్యార్థుల‌ను ఉగ్ర‌వాదులా మాదిరి పోలీసులు వెంటాడుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ భ‌వ‌న్‌లో బాల్క సుమ‌న్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ పాల‌న‌లో పేరుకే ప్ర‌జా పాల‌న.. కానీ ద‌గా పాల‌న న‌డుస్తోంది. గురుకులాలు, య‌నివ‌ర్సిటీ హాస్ట‌ళ్ల‌లో విద్యార్థుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అర‌ణ్య రోద‌న అయిపోయింది. సుల్తాన్‌పూర్ జెఎన్టీయూలో చ‌ట్నీలో చిట్టెలుక‌ వ‌చ్చింది. కోమ‌టిప‌ల్లి హాస్ట‌ల్‌లో ఉప్మాలో బ‌ల్లి ప‌డింది. భువ‌న‌గిరి సాంఘిక‌ సంక్షేమ హాస్ట‌ల్‌లో 20 మంది దాకా విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు అని బాల్క సుమన్ గుర్తు చేశారు.

* తెలంగాణ రాష్ట్ర డీజీపీగా జితేందర్‌ నియామకయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీజీపీగా కొనసాగుతున్న రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాకు ఎస్పీగానూ సేవలందించారు. ఢిల్లీలో సీబీఐలో కొంతకాలం పనిచేశారు.

* కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Bengaluru Metro) తరచూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. అయితే, ఈ సంస్కృతి ఇప్పుడు బెంగళూరు నగరానికి పాకింది. తాజాగా రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో (Bengaluru Metro) రైల్లో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. రద్దీగా ఉన్న రైల్లో ఇద్దరు ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ దూషించుకున్నారు (Two Passengers Exchange Blows). ఏకంగా బాక్సింగ్‌ క్రీడ (boxing match) తరహాలో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. తోటి ప్రయాణికులు కలుగజేసుకుని వీరి మధ్య గొడవను ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించడం చాలా విధాలుగా ప్రమాదకరం అని ఒకరు కామెంట్‌ చేయగా.. ‘ఒత్తిడి’ కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయంటూ మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

* విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గానికి చెందిన అనాధలకు ఇన్‌స్పెక్టర్‌ ప్రసాదరావు ( Inspector Prasada Rao) శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జునస్వామిని దైవదర్శనం చేయించి శభాష్‌ అనిపించుకున్నారు. వావిలవలస గ్రామంలోని రాహుల్ సౌరబ్ నిత్య అన్నదానసత్రంలో ఉంటున్న 15 మంది అనాధలు(Orphans) ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇన్‌స్పె్క్టర్‌ స్వామివారి దర్శనం ఏర్పాటు చేయించి, రాత్రికి భోజనాలు ఏర్పాటు చేసి, రెండు ఆటోలు ఏర్పాటు చేసి సమీప ఆలయాల్లోనూ దర్శనభాగ్యం కల్పించారు. అనాధలకు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా అనాధల సత్రం నిర్వాహకుడు, సామాజిక సేవాకర్త పాలూరి సిద్ధార్థ సీఐ ప్రసాదరావుకు ధన్యవాదాలు తెలిపారు.

* కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలుపై ఎవ‌రూ ఊహించ‌ని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయ‌న సునీల్ క‌నుగోలు కాదు.. సునీల్ కొనుగోలు అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు వీహెచ్. గాంధీ భ‌వ‌న్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల ఓట‌మి జ‌రిగింది.. కొన్ని చోట్ల గెలిచారు. ఓట‌మి గ‌ల కార‌ణాల‌పై ఏఐసీసీ ప్ర‌తినిధులు ఎంక్వైరీ చేస్తున్నారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాల‌ను, ఎవ‌రి ఆలోచ‌న వారు త‌ప్ప‌నిస‌రిగా చెబుతారు. అన్నింటి కంటే ముందు కొనుగోలును అడ‌గాలి. సీఎంను కాదు. సునీల్ కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఏం ఇచ్చాడో తెలియ‌దు. సునీల్ కొనుగోలులోనే అంతా ఉంది. ఆయ‌న ఏం రిపోర్టు ఇచ్చిండు అనేది తేలాలి. దీపా మున్షి కూడా ఇక్క‌డే ఉన్నారు. ఎవ‌రి ఓపీనియ‌న్ వారు చెబుతారు. నేను కూడా ఒక క్యాండిడేట్‌ను. నాకు కూడా తీవ్ర అన్యాయం జ‌రిగింది. నేను చెప్పుకోలేక‌పోతున్నాను అని వీహెచ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

* దేశ చరిత్రలో మొదటిసారిగా ఓ ఐఆర్‌ఎస్‌ అధికారిణి ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన లింగం, పేరును మార్పు చేయించుకున్నారు. పుట్టుకతో స్త్రీగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చైన్నెకు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి ఎం.అనసూయ(M Anusuya) ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్ (అధీకృత ప్రతినిధి) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌(Joint Commissioner)గా విధులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆమె తన పేరును ఎం.అనుకతిర్‌ సూర్య(Anukathir Surya)గా, లింగాన్ని స్త్రీకు బదులుగా పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ఈవిధంగా పేర్కొంది. “ఇటీవల మాకు ఓ విన్నపం అందింది. 2013 బ్యాచ్ కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని CESTAT చీఫ్ కమిషనర్ (AR) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును, లింగాన్ని మార్చాల్సిందిగా అభ్యర్థించారు. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాం’’ అని వెల్లడించింది.

* అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఒక ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారి బదిలీ అయ్యారు. ప్రత్యేక వసతులు అందించాలని ఆమె డిమాండ్‌ చేయడంతో వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో ఆమెపై మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెలో అసిస్టెంట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్‌ (Pooja Khedkar) ఉన్నతాధికారుల అనుమతి తీసుకోకుండానే తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్‌ లైట్లు, వీఐపీ(VIP) నంబర్ ప్లేట్‌ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాక కారుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్‌ సైతం అమర్చారు. వీటితోపాటు తనకు వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బంది, కానిస్టేబుల్‌తో ఓ అధికారిక ఛాంబర్‌ను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z