Videos

తెలుగు యూట్యూబర్ అరెస్ట్-CrimeNews-July 10 2024

తెలుగు యూట్యూబర్ అరెస్ట్-CrimeNews-July 10 2024

* జమ్మూ-కశ్మీర్‌లో సైనిక వాహనంపై ఉగ్రవాదులు మెరుపుదాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే, తమ వాహనంపై సాయుధ మూకలు దాడి మొదలుపెట్టిన వెంటనే స్పందించిన భారత సైన్యం.. ప్రతిదాడులతో విరుచుకుపడింది. గాయపడిన సైనికులను రక్షించుకోవడంతోపాటు మరింత ప్రాణనష్టం జరగకుండా ఉండేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో భారత సైన్యంలోని ‘22 గడ్వాల్‌ రెజిమెంట్‌’ దాదాపు 5189 రౌండ్ల కాల్పులు జరిపినట్లు వెల్లడైంది. దాంతో తోకముడిచిన ఉగ్రమూకలు సమీప అడవుల్లోకి పారిపోయినట్లు తెలిసింది. కఠువాకు 150కి.మీ దూరంలో ఉన్న బద్‌నోతా గ్రామ సమీపంలోని మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు వారిని దీటుగా ఎదుర్కొనేందుకు ఎదురు కాల్పులు జరిపారు. అప్పటికే ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జవాన్లు.. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించడంతోపాటు ఆయుధాలను ఎత్తుకెళ్లిపోకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రతిఘటించారు. అదనపు బలగాలు అక్కడకు చేరుకునే వరకు నిరంతరంగా కాల్పులు కొనసాగించారు. ఓ సైనికుడి చేతికి తీవ్రంగా గాయమైనప్పటికీ తన ఆయుధం జామ్‌ అయ్యేవరకు ఒక్క చేతితోనే కాల్పులు కొనసాగించడం గమనార్హం.

* చిన్న పిల్ల‌ల విష‌యంలో అసభ్యంగా ప్రవర్తిస్తూ నీచంగా వీడియోలు చేసిన తెలుగు యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగ‌ళూరులో పోలీసులు హైద‌రాబాద్‌లో అత‌డిని అరెస్ట్ చేశారు.ఫ‌నుమంతు (phanumantu) అనే పేరుతో యూట్యూబ్ ఛాన‌ల్ ర‌న్ చేస్తున్న ప్రణీత్ త‌న ఛాన‌ల్‌లో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి లైవ్ వీడియోస్‌కి రియాక్ష‌న్ ఇవ్వ‌డం, కామెంట్ల్ చేయ‌డం వంటివి చేస్తాడు. అయితే త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి ఒక వ్లాగ్ చేస్తూ.. తండ్రీకూతుళ్ల అనుబంధంపై లైంగిక కామెంట్లు చేశాడు. దీంతో ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. ఈ వీడియోపై బెంగ‌ళూరుకు చెందిన ఒక అత‌ను ఫిర్యాదు చేయ‌గా.. ఈ ఫిర్యాదు సీరియస్ గా తీసుకున్న బెంగళూర్ పోలీసులు నేడు అతడిని హైద‌రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.ఈ విష‌యంపై ఇప్ప‌టికే నెటిజ‌న్ల‌తో పాటు టాలీవుడ్ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్, సింగ‌ర్ చిన్మాయి, అడివిశేష్, సూధీర్ బాబు, మంచు మ‌నోజ్, స్పందిస్తూ.. అత‌డిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పాటు, డిప్యూటీ సీఎంల‌ను విజ్ఞప్తి చేశారు.

* విజయవాడలో సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్‌ (Kidney rocket) వ్యవహారంలో పోలీసులు 5గురిపై కేసు (Police case) నమోదు చేశారు. బాషా, వెంకట్‌, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్‌ శరత్‌బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశంపై కేసు నమోదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కిడ్నీ కోల్పోయిన మధుబాబుకు గుంటూరు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి.కిడ్నీ దానం(Kidney donate) చేస్తే రూ. 30 లక్షలు ఇస్తామని కొందరు ఆశచూపి గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబును మోసం చేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మధుబాబు (Madubabu) అనే యువకుడిని విజయవాడకు చెందిన బాషా అనే వ్యక్తి సోషల్‌మీడియాలో పరిచయమయ్యాడు. మధుబాబు అవసరాన్ని ఆసరాగా చేసుకున్న బాషా.. కిడ్నీ దానం చేస్తే రూ.30 లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు.30 లక్షల డబ్బు వస్తే తన సమస్యలు అన్నీ తీరుతాయని ఆశపడిన మధుబాబు కిడ్నీ విక్రయానికి ఒప్పుకున్నాడు. దీంతో ఈ నెల మొదటి వారంలో విజయవాడలోని విజయ హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఆపరేషన్‌ చేయించి కిడ్నీ తీసుకున్నారు. ఆపరేషన్‌ తర్వాత మధు బాబుకు 30 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ. 1.10 లక్షలు మాత్రమే బాషా ఇచ్చాడు.మిగిలిన డబ్బులు అడిగేసరికి బాషా తన నిజస్వరూపం బయటపెట్టాడు. స్నేహితుడిలా కిడ్నీ దానం చేసినట్లు సంతకం చేశావని మధుబాబుకు తెలిపాడు. కాబట్టి నీకు మిగిలిన డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ బెదిరించాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. డాక్టర్‌ శరత్‌బాబు (Dr. Sarathbabu ) , మధ్యవర్తి బాషాపై గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదుచేయగా పోలీసులు విచారణ జరిపి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సంయమనం పాటించాలని తెలంగాణ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్దాంతం చేయొద్దని, జడ్జిలు, వారి కుటుంబ సభ్యుల పేర్లు బహిర్గతం చేయొద్దని స్పష్టం చేసింది. ఫోన్‌ నంబర్లు, ఫొటోలు బహిర్గతం చేయొద్దని సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

* నంద్యాల జిల్లాలో బాలిక (8) అదృశ్యం ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారం సాయంత్రం ముచ్చుమర్రి పార్కు వద్ద బాలిక ఆడుకుంటుండగా సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని.. అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z