Health

నీట్ లీకేజీ సూత్రధారి అరెస్ట్-CrimeNews-July 11 2024

నీట్ లీకేజీ సూత్రధారి అరెస్ట్-CrimeNews-July 11 2024

* నీట్‌-యూజీ (2024) పరీక్షలో అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్‌ లీకేజీలో కీలక సూత్రధారిగా భావిస్తోన్న రాజేశ్‌ రంజన్‌ అనే వ్యక్తిని పట్నాలో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం పట్నా, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ నేరానికి సంబంధించి కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. నిందితుడిని విచారించేందుకుగాను స్థానిక కోర్టు 10 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ కేసులో బుధవారం ఇద్దరిని అరెస్టు చేయగా.. ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య పది దాటింది.

* వరంగల్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు ఓ యువకుడు ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులను హతమార్చాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బానోతు శ్రీనివాస్‌(45), బానోతు సుగుణ (40) దంపతులు పదహారు చింతల తండాలో నివాసముంటున్నారు. వారి కుమార్తె దీపికను గుండెంగ గ్రామానికి చెందిన బన్నీ అనే యువకుడు గత నవంబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. జనవరిలో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఆ యువతిని తల్లిదండ్రులతో పంపించారు. అప్పటి నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ హనుమకొండలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

* బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టి ఓ మహిళ మృతికి కారణమైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ముంబయి పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, శివసేన (శిందే వర్గం) నేత రాజేష్‌ షా తనయుడు మిహిర్‌ షాను విచారిస్తున్న పోలీసులు.. గురువారం పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు. ఆదివారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం సేకరించడంలో భాగంగా పోలీసులు గురువారం తెల్లవారు జామున ఘటనా స్థలం వద్ద సీన్‌ను రీక్రియేట్‌ చేశారు.

* మంచీచెడుల విచక్షణ మరచి తండ్రి, కూతురు బంధానికి అశ్లీలం జోడించి మాట్లాడిన బూతు యూట్యూబర్‌ ప్రణీత్‌ హనుమంతుకు హైదరాబాద్‌ నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్‌ విధించింది. ప్రణీత్‌పై 67బీ ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్ ,79, 294 బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్‌ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్‌, ఏ4గా సాయి ఆదినారాయణను చేర్చారు.

* ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జూన్‌ 23న ఆయన జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ రాశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుతో తనకు సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. జూన్‌ 26న తాను భారత్‌కు రావాల్సిందని.. ఆరోగ్యం బాగోలేక అమెరికాలో ఉండిపోవాల్సి వచ్చిందని వివరించారు. క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు చెప్పారు. అమెరికా వైద్యుల సూచనతో అక్కడే చికిత్స పొందుతున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.

* డ్రగ్ కంట్రోల్ అధికారులు సికింద్రాబాద్‌లో భారీగా స్టెరాయిడ్స్‌ పట్టుకున్నారు. వాటిని సరఫరా చేస్తున్న ఖాసిం అనే యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు జిమ్‌లలో స్టెరాయిడ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దేహదారుఢ్యం కోసం వీటిని యువకులకు ఇస్తున్నారని అధికారులు తెలిపారు. స్టెరాయిడ్స్‌ స్వాధీనం చేసుకున్న డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z