* గత ఐదేళ్లలో వైకాపా నేతలు సహజ వనరులను దోపిడీ చేశారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. అడవులను కూడా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందని అన్నారు. గత ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైకాపా హయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. ‘‘కొత్త విధానం ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారు.’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
* కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘క’ (Ka). సుజీత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. టీజర్ విడుదల అనంతరం హీరో.. మీడియాతో ముచ్చటించారు. ‘పవన్ కల్యాణ్‌లాంటి వారే పాన్ ఇండియా చిత్రాలు చేయట్లేదు. మీ స్థాయి హీరోలు, మీరు పాన్ ఇండియా సినిమాలు చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనుకుంటున్నారు?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా కిరణ్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ప్రస్తుతం కంటెంటే సినిమా స్థాయిని నిర్ణయిస్తోంది. మలయాళ సినిమా ‘మంజుమ్మల్ బాయ్స్’ను తెలుగు ప్రేక్షకులు హిట్ చేశారు. అందులోని నటుల పేర్లు ఎవరికైనా తెలుసా? ‘కాంతార’కు ముందు రిషబ్ శెట్టి గురించి మనకు పెద్దగా తెలియదు. నా స్థాయి పెద్దదా, చిన్నదా అనే దానికంటే సినిమాలో కంటెంట్ ఉందా, లేదా అన్నదే ముఖ్యం. కథ బాగుంటే సినిమాని మీరంతా ఆదరిస్తారు. ‘క’లో కంటెంట్ ఉందనే నమ్మకంతోనే ఇతర భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని తెలిపారు.
* మహారాష్ట్రలో పనిచేస్తున్న ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (Puja Khedkar) విద్యకు సంబంధించి సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఎంబీబీఎస్‌లో చేరినట్లు ఇప్పుడు అనుమానాలు బలపడుతున్నాయి. పుణెలోని శ్రీమతి కాశీబాయి నవలె మెడికల్ కాలేజీ అండ్ జనరల్ హాస్పిటల్లో 2007లో ఎన్టీ-3 కేటగిరీ కింద నాన్ క్రిమీలేయర్ ఓబీసీ ధ్రువీకరణపత్రంతో సీట్ పొందారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ వద్ద సోమవారం మెడికల్ కాలేజీ డైరెక్టర్ అరవింద్ బొహ్రె ధ్రువీకరించారు.
* బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలతో ఇకపై అక్కడి అంబులెన్స్‌లకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇకనుంచి బెంగళూరులో అంబులెన్స్‌కు దారి ఇవ్వడానికి వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించినా జరిమానా విధించమని పోలీసులు పేర్కొన్నారు. అటువంటి సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ కెమెరాల ద్వారా జరిమానాలు జారీ చేస్తే ప్రయాణికులు ఇన్ఫాంట్రీ రోడ్‌లోని ట్రాఫిక్ మేనేజ్మెంట్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. కర్ణాటక స్టేట్ పోలీస్ (KSP)యాప్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) అనుచేత్ పేర్కొన్నారు.
* ఒడిశాలోని విశ్వప్రసిద్ధ శ్రీక్షేత్రంలో పూరీ జగన్నాథుని రత్నభాండాగారాన్ని అధికారులు ఆదివారం తెరిచిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న వేళ 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలోని రహస్య గది తలుపులు మెజిస్ట్రేట్ సమక్షంలో తెరిచారు. ఈ సందర్భంగా స్వామివారికి చెందిన విలువైన వస్తువుల్ని లెక్కించేందుకు 11మందితో ఏర్పాటు చేసిన బృందానికి సారథ్యం వహిస్తున్న ఒడిశా హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ మాట్లాడారు. మేజిస్ట్రేట్ సమక్షంలో గది తాళాలు పగలగొట్టిన తర్వాత తమ బృందం గదిలోకి ప్రవేశించిందని తెలిపారు. ఆ ‘రహస్య గది’ లోపల భాండాగారానికి పాములు కాపలాగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున జరిగిన ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. తమ బృందంలో ఏడెనిమిది మంది ఆలయ మేనేజ్మెంట్ సభ్యులు ఉన్నారని.. వీరంతా బహుడా యాత్ర సన్నహాల్లో బిజీగా ఉన్నందున తనిఖీలకు, ఆభరణాల తరలింపునకు తగిన సమయం లభించలేదని చెప్పారు. అందువల్ల దేవతామూర్తుల ఆభరణాలు, విలువైన రత్నాలను తరలింపునకు మరో తేదీని నిర్ణయిస్తామని తెలిపారు.
* ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన విజయం సాధించడంపై సర్వత్రా చర్చ జరుగుతోందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడి పెళ్లి్కి వెళ్లినప్పుడు అందరూ వంద శాతం జనసేన సాధించిన ఫలితాల గురించే అడిగారని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జనసేన ప్రజాప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
* క్రమపద్ధతిలో తనపై కుట్రలు చేస్తున్నారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొన్ని మీడియా ఛానళ్లు.. ఆదివాసీ మహిళా అధికారిణితో సంబంధాలు అంటగట్టి అవాస్తవాలను ప్రసారం చేశాయన్నారు. నిరాధార ఆరోపణలు చేశారని ఆక్షేపించారు. పలువురు మీడియా ప్రతినిధులను పేరు పెట్టి హెచ్చరించారు. ఆయా ఛానళ్లపై ఫిర్యాదు చేస్తానని.. తనపై బురదచల్లే వారిని వదిలి పెట్టబోనని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘‘ఆదివాసీ ఆడబిడ్డను బజారుకీడ్చి నా వ్యక్తిత్వంపై కుట్ర పన్నారు. గత మూడు రోజులుగా ట్రోల్ చేశారు. ఆరోపణలు చేసే ముందు వివరణ తీసుకోవాలి. అలా చేయకుండా అవాస్తవాలు టెలికాస్ట్ చేయడం ఘోర తప్పిదం. వారితో ఎలా క్షమాపణలు చెప్పించాలో తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నారు.. ఏం చేస్తారు అనుకోవద్దు. దీనిపై పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడంతో పాటు ప్రైవేటు బిల్లు పెడతా. ఎడిటర్స్ గిల్డ్, మహిళా కమిషన్, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. పరువు నష్టం దావా వేస్తా. గతంలో ప్రజాదర్బార్ నిర్వహించేవాడిని. చాలా మంది తమ సమస్యలపై వచ్చి కలిసేవారు. అలా కలిస్తేనే సంబంధాలు అంటగడతారా? తారతమ్యాలు లేవా? వయసు తెలియదా? సాయిరెడ్డి తండ్రిలాంటివారని స్వయంగా అధికారిణే చెప్పింది. నేను కూడా త్వరలోనే నా సొంత మీడియాను ప్రారంభిస్తా. ఇప్పటికే కాలయాపన చేశాను.. మళ్లీ నిర్ణయం తీసుకున్నా. ఈసారి ఎవరు చెప్పినా వినేది లేదు. అందరి దుశ్చర్యలను ఎండగడతా’’ అని విజయసాయిరెడ్డి అన్నారు.
* ప్రపంచమంతా అబ్బురపడేలా ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ వివాహం రాధికా మర్చంట్‌తో జరిగింది. ఈ పెళ్లి ఇంత ఘనంగా జరగడం వెనక నీతా అంబానీదే కీలకపాత్ర. ఈ విషయాన్ని ఆమె చిన్నకోడలు రాధికనే స్వయంగా వెల్లడించారు. ‘మా వెడ్డింగ్ సీఈఓ మా అత్తయ్యే. ఆమె దార్శనికత, నిబద్ధతే వేడుకలు ఘనంగా జరిగేందుకు కారణమయ్యాయి’అని తెలిపింది.
* పంటల రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 13 వరకు తీసుకున్న పంట రుణాల బకాయిలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుందని, రైతు కుటుంబం గుర్తింపునకు రేషన్‌కార్డు ప్రామాణికమని తెలిపింది. పంట రుణమాఫీ కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేయనున్నారు. రుణమాఫీ నగదు నేరుగా లబ్ధిదారుల రుణఖాతాల్లోనే జమకానుంది. ఆరోహణ క్రమంలో రుణమాఫీ సొమ్ము విడుదల చేస్తారు. ఎస్‌హెచ్‌జీ, జేఎల్‌జీ, ఆర్ఎంజీ, ఎల్ఈసీఎస్ రుణాలకు, రీషెడ్యూల్ చేసిన రుణాలకు మాఫీ వర్తించదు. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రైతు సమస్యలు ఉంటే 30 రోజుల్లో పరిష్కారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని వివరాలకు వెబ్ పోర్టల్ చూడొచ్చు. లేదా మండల సహాయ కేంద్రాలను సంప్రదించవచ్చని తెలిపింది.
* రాగల ఐదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతోపాటు షియర్ జోన్ ఏర్పడిందని ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ (సోమవారం) కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
* అఖిల్ (Akhil Akkineni) కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ (Agent). సాక్షి వైద్య కథానాయిక. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసిన ఈ చిత్రం ఇప్పటివరకూ ఓటీటీలో విడుదల కాలేదు. విడుదలైన మూడు వారాలకే సినిమాను ఓటీటీ విడుదల చేస్తున్నట్లు స్ట్రీమింగ్ వేదిక సోనీలివ్ గతంలో తెలిపింది. ఇప్పటివరకూ అది సాధ్యం కాలేదు. ఇటీవల మళ్లీ ‘ఏజెంట్ ఓటీటీ’ టాక్ బాగా వినిపించింది. అయితే, ఏ ఓటీటీ వేదికా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో గోల్డ్‌మైన్స్ టీవీ ఛానల్ జులై 28వ తేదీ రాత్రి 8గంటలకు ఏజెంట్‌ను ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.
* మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు నిందితులకు గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ నిరాకరించింది. నిందితుల బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. అనారోగ్య కారణాలతో గిరి రాంబాబు అనే వ్యక్తికి మాత్రం బెయిల్ మంజూరు చేసింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z