కూరగాయలు, పండ్లు, మాంసం, గుడ్డు వంటి పదార్థాలు తిననివారికి, అలాగే పాలిష్ పట్టిన తెల్లటి బియ్యం, పాత బియ్యాన్ని అదీ చాలాసార్లు కడిగి, గంజి వార్చి వండిన అన్నం మాత్రమే ప్రధానంగా తినే పేదవారిలో థయమిన్ లోపం తలెత్తుతుంది. ఇది బెరిబెరి అనే జబ్బుకు దారితీస్తుంది. ఇలాంటి అన్నం రోజూ తినేవారికి కేలరీలు బాగానే లభిస్తాయి గానీ అవి శక్తిగా మారవు. ఎందుకంటే మనం తినే ఆహారంలోని కేలరీలు శక్తిగా మారటానికి థయమిన్ తప్పనిసరి. దీని లోపం గలవారిలో ఏటీపీ (జీవశక్తి) ఉత్పత్తి కాదు. అందుకే బెరిబెరిని డిసీస్ ఆఫ్ ఎంప్టీ కేలరీస్ అని పరిగణిస్తారు. ఏటీపీ అనేది అడినోసిన్ డైఫాస్ఫేట్ (ఏడీపీ) నుంచి పుట్టుకొస్తుంది. ఈ ప్రతిచర్యకు థయమిన్ అవసరం. గ్లూకోజు ద్వారా థయమిన్ సమక్షంలోనే ఏడీపీ నుంచి ఏటీపీ వస్తుంది. థయమిన్ లోపిస్తే కొన్ని రసాయన ప్రతిచర్యల వల్ల గ్లూకోజు లాక్టేట్‌గా మారుతుంది. ఇది శరీరంలో పోగుపడుతుంది. ఏటీపీ తయారు కాకపోవటం వల్ల ఏడీపీ కూడా పోగుపడుతుంది. ఇది కొన్ని సమస్యలకు దారితీస్తుంది.
పిల్లల్లో వచ్చే ఇన్‌ఫెంటైల్ బెరిబెరిని వైద్యశాస్త్రం నాలుగు రకాలుగా పేర్కొంటుంది.
1. ఎన్‌కెఫలైటిక్ బెరిబెరి: ఏటీపీ ప్రధానంగా మెదడుకు.. ముఖ్యంగా మస్తిష్క మూలం, బేసల్ గ్యాంగ్లియాన్ భాగాలకు అవసరం. ఏటీపీ లేకపోతే ఇవి సరిగా పనిచేయవు. చివరికి మెదడు మొత్తంగానే పని చేయకపోవచ్చు. శ్వాస, గుండెకు సంబందించిన పనులను నియంత్రించే భాగాలూ మస్తిష్క మూలంలోనే ఉంటాయి. అందువల్ల గుండెతో పాటు శ్వాసకు సంబంధించిన సమస్యలూ తలెత్తుతాయి. గుండె వేగం పెరగటం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2. కార్డియాక్ బెరిబెరి: మెదడుకే కాదు.. గుండెకూ ఏటీపీ పెద్ద మొత్తంలో కావాలి. ఇది తగినంత లభించకపోతే పంపింగ్ సామర్థ్యం తగ్గి, గుండె విఫలం (సీసీఎఫ్) కావొచ్చు. రక్తనాళాలు, సమీపంలోని కణజాలాలకు మధ్య ద్రవాల మార్పిడి అస్తవ్యస్తమై శరీరవ్యాప్తంగా వాపు (అనసర్కా) తలెత్తొచ్చు. ఈ సమస్యల ద్వారా కూడా ఎక్కువ మంది పిల్లలు చనిపోతుంటారు.
3. ఎఫోనిక్ బెరిబెరి: ఇందులో స్వరతంత్రులు బలహీనం కావటం వల్ల మాట పీలగా మారుతుంది (ఎఫోనియా).
4. డ్రై బెరిబెరి: ఇది నాడులను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కాళ్లు చేతుల్లో నాడులు దెబ్బతింటాయి (పెరిఫెరల్ న్యూరైటిస్). దీంతో కండరాల పటుత్వం తగ్గుతుంది. చివరికి కండరాల పక్షవాతమూ రావొచ్చు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z