* మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిహాడ్ జైలు నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. దిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్టయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు. ఆమెపై సీబీఐ, ఈడీలు వేర్వేరు కేసులు నమోదు చేశాయి.
* ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ (kalki 2898 ad) బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాల క్లబ్‌లో చేరింది. ప్రస్తుతం థియేటర్‌లో ‘కల్కి’ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ మూవీ ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే, ‘కల్కి’ ఓటీటీలో చూడాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. థియేటర్‌లో విడుదలై 10 వారాలు పూర్తయిన తర్వాతే ఓటీటీలో విడుదల చేయనున్నారు. అంటే సెప్టెంబరు రెండో వారంలో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఓటీటీ వేదికతో ఒప్పందం జరిగినట్లు చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ‘కల్కి’ (kalki 2898 ad ott release date) ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న సంగతి తెలిసిందే.
* పంట రుణాల మాఫీ విషయంలో రేషన్‌కార్డు నిబంధనపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. పాస్‌బుక్ ఆధారంగానే రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని వెల్లడించారు. కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్‌కార్డు నిబంధన పెట్టినట్లు చెప్పారు. ఈ నెల 18న రూ.లక్ష లోపు రుణాలు మాపీ చేయనున్నట్లు తెలిపారు. ఎల్లుండి సాయంత్రంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రుణమాఫీ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. రుణ మాఫీ నిధులు పక్కదారి పట్టకుండా బ్యాంకర్లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కలెక్టర్ల సమావేశంలో రుణమాఫీ మార్గదర్శకాలపై సీఎం వివరించారు.
* హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించకపోవడంపై ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన భూములను కబ్జాదారులు ఆక్రమించారని ఉన్నతాధికారులకు ఆయన లేఖ రాశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఫిర్యాదుతో అధికారులను మంత్రి శ్రీధర్‌బాబు అప్రమత్తం చేశారు. ఎమ్మె్ల్యే ఫిర్యాదును ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
* బాలీవుడ్ పాట ‘తౌబా తౌబా’ను తమ స్టైల్‌లో రీక్రియెట్ చేసి చిక్కుల్లో పడ్డారు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్, సురేశ్ రైనా. ఈ వీడియో ద్వారా దివ్యాంగులను అవమానపరిచారంటూ పలు వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ముగ్గురు మాజీ ఆటగాళ్లపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
* భారత జట్టు టెస్టు స్పెషలిస్టులకు బీసీసీఐ (BCCI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టులో జరగనున్న దులీప్ ట్రోఫీకి టెస్టు జట్టు రెగ్యులర్ సభ్యులందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి ఆటగాడు కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశించింది. సెప్టెంబరులో స్వదేశంలో ప్రారంభంకానున్న టెస్టు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు జాతీయ జట్టు విధులకు దూరంగా ఉంటే దేశవాళీ టోర్నీలకు అందుబాటులో ఉండాలని బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నారు. అయితే, స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రాకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు. కీలకమైన ఈ ముగ్గురు ఆటగాళ్లు గాయాలబారినపడకుండా ఉండేందుకు ఈ మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.
* రేషన్ కార్డుల (Ration Cards) కోసం ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికుల (Migrant Labourers) వెరిఫికేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్న రాష్ట్రాలపై సుప్రీంకోర్టు (Supreme Court) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. ఈ ప్రక్రియను నాలుగు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్రాలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా వలస కార్మికులకు రాష్ట్రాలు రేషన్ అందించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ-శ్రమ్ (e-shram Portal) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే, ఇప్పటివరకు తెలంగాణ, బిహార్ రాష్ట్రాలు మాత్రమే వారికి రేషన్ కార్డుల జారీ కోసం 100శాతం వెరిఫికేషన్ పూర్తి చేశాయి.
* నీట్ యూజీ-2024 (NEET UG-2024) పరీక్ష పేపర్ లీక్, అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐ (CBI) వేగం పెంచింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ.. తాజాగా మరో ఇద్దరు కీలక వ్యక్తులను కస్టడీలోకి తీసుకుంది. ఇందులో ఓ వ్యక్తి.. పరీక్ష జరగడానికి ముందు ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఉన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ట్రంక్ పెట్టె నుంచి నీట్ పేపర్‌ను తస్కరించినట్లు గుర్తించారు.
* ఆ కన్న తల్లి గుండె తరుక్కుపోతోంది. పేగు తెంచుకుపుట్టిన బిడ్డ ఇక ఇంటికి రాడని తెలియడంతో.. ఆమె హృదయం బరువెక్కుతోంది. కన్నీరు ధారలై కారుతోంది. మరోవైపు గుండె లోతుల్లో ఏదో తెలియని గర్వం. తన బిడ్డ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడన్న ఆత్మ సంతృప్తి. జమ్ముకశ్మీర్‌లోని (Jammu Kashmir)డోడా (Doda) ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన కెప్టెన్ బ్రిజేశ్ (Captain Brijesh) థపా తల్లి ఆవేదన.. అక్కడి వారి కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగేలా చేస్తోంది. తన బిడ్డను పొట్టన పెట్టుకొని.. ఇంత క్షోభకు గురిచేసిన ఉగ్రవాదులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలంటూ విలపిస్తున్న తీరు.. ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది. ముష్కరుల దాడిలో 27 ఏళ్ల బ్రిజేశ్ ప్రాణాలు కోల్పోవడంతో అతడి స్వగ్రామం పశ్చిమబెంగాల్‌లోని సిలిగుడిలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలాగైనా ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
* దేశ రాజధాని దిల్లీ (Delhi) సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్-హరియాణా (Punjab-Haryana) సరిహద్దులోని శంభూ ప్రాంతంలో జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన అడ్డుకట్టల్ని తొలగించగానే.. దిల్లీకి ర్యాలీ చేపట్టే యోచనలో ఉన్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) నేతలు చెబుతున్నారు. జంతర్‌మంతర్‌లో గానీ, రామ్‌లీలా మైదానంలో గానీ శాంతియుత నిరసనకు దిగుతామన్నారు. ఈసారి తమను అడ్డుకున్నా, రహదారిపై బారికేడ్లు ఏర్పాటుచేసినా.. హరియాణా ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీకేయూ స్పష్టం చేసింది.
* అమెరికాలో ట్రంప్ తమ రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా సెనేటర్ జేడీ వాన్స్ పేరు ప్రకటించటంతో భారత సంతతికి చెందిన న్యాయవాది, ఆయన సతీమణి ఉషా చిలుకూరి వార్తల్లో నిలిచారు. నవంబర్ 5న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్, వాన్స్ గెలిస్తే.. తొలి ఇండో-అమెరికన్ ద్వితీయ మహిళగా ఆమె రికార్డులకు ఎక్కనున్నారు. అమెరికాకు వలస వెళ్లిన తెలుగు కుటుంబానికి చెందిన ఉషా.. శాంటియాగో సబర్బన్‌లో పుట్టి పెరిగారు. భర్త జేడీ వాన్స్ విజయ ప్రస్థానంలో ఆమె కీలక పాత్ర పోషించారు.
* వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో ఇటీవల ప్రేమోన్మాది చేతిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. నిందితుడి దాడిలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఇద్దరు పిల్లలకి భారాస తరఫున రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు వెల్లడించారు. పిల్లలిద్దరూ దీర్ఘకాలం చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేలా ప్రభుత్వం రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z