Agriculture

నేడు తెలంగాణా రైతుల రుణమాఫీ

నేడు తెలంగాణా రైతుల రుణమాఫీ

రైతులకు రుణమాఫీ పథకం గురువారం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు సచివాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 110 రైతువేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.లక్ష లోపు రుణాల మాఫీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం 11.50 లక్షల మంది రైతుల రుణ ఖాతాల్లో రూ.లక్ష వరకు జమవుతాయి. ఈ సందర్భంగా రైతువేదికల్లో జరిగే సంబురాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ పార్టీ నేతలు పాల్గొంటారు. గురువారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థికశాఖ బుధవారం బ్యాంకులలో జమ చేసింది. రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించే రైతుల జాబితాలను బుధవారం ప్రభుత్వం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు పంపించింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు అభ్యుదయ రైతులను, లబ్ధిదారులను రైతువేదికల వద్దకు ఆహ్వానించారు. గురువారం.. మాఫీ నిధులు రుణఖాతాల్లో జమ అయ్యాయనే సమాచారం ఫోన్‌లో వచ్చిన వెంటనే ఆయా రైతులను మంత్రులు, ఎమ్మెల్యేలు అభినందించనున్నారు. ఈ సందర్భంగా సీఎం, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z