Devotional

తితిదే వెంగమాంబ కార్మికుల ధర్నా-NewsRoundup-July 18 2024

తితిదే వెంగమాంబ కార్మికుల ధర్నా-NewsRoundup-July 18 2024

* తమిళనాడులో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి తరఫున గెలిచిన పలువురు నేతల ఎన్నికను సవాల్‌ చేస్తూ వారి ప్రత్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం, భాజపా నేత నాగేంద్రన్‌, డీఎండీకే నేత వి.విజయ ప్రభాకరన్‌ గురువారం మద్రాస్‌ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. రామనాథపురం సీటు నుంచి ‘ఇండియా’ కూటమి తరఫున బరిలో నిలిచి గెలిచిన ఐయూఎంఎల్‌ నేత కె. నవాస్‌ ఎన్నికను పన్నీర్‌ సెల్వం సవాల్‌ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పన్నీర్‌పై నవాస్‌ 1,66,782 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. మరోవైపు, తిరునల్వేలి సీటు నుంచి గెలిచిన కాంగ్రెస్‌ నేత రాబర్ట్‌ బ్రూసె ఎన్నికపై భాజపా నేత నాగేంద్రన్‌ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నాగేంద్రన్‌.. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసి 1.65లక్షల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇకపోతే, విరుద్‌నగర్‌ నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ ఎన్నికపై డీఎండీకే నేత విజయ ప్రభాకరన్‌ పిటిషన్‌ వేశారు.ఈ ఎన్నికల్లో మాణికం ఠాగూర్‌పై విజయ ప్రభాకరన్‌ 4వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

* ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ (Giorgia Meloni) పరువుకు భంగం కలిగించినందుకు ఓ జర్నలిస్టు చిక్కుల్లో పడ్డారు. నష్టపరిహారం కింద ప్రధానికి 5వేల యూరోలు చెల్లించాలంటూ మిలాన్ న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. 2021లో జర్నలిస్టు గిలియా కార్టిసి.. మెలోనీపై ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ‘ఆమెపై విమర్శలు గుప్పిస్తూ ఎత్తును ఉద్దేశించి హేళన చేశారు. ‘‘మెలోనీ మీరు నన్ను భయపెట్టలేరు. మీ ఎత్తు కేవలం 1.2 మీటర్లు(నాలుగు అడుగులు) మాత్రమే. మీరు అసలు నాకు కనిపించరు’’ అని వ్యంగ్యంగా పోస్టు పెట్టారు. దీనిపై మెలోనీ కేసు పెట్టారు. కేసును విచారించిన మిలాన్‌ కోర్టు తాజాగా సదరు జర్నలిస్టుకు 5వేల యూరోల జరిమానా విధించింది. అయితే తీర్పుపై కార్టిసి అప్పీల్ చేసుకోవడానికి వీలుంది. ఒకవేళ ఈ జరిమానా డబ్బులు అందితే.. ప్రధాని వాటిని ఛారిటీకి ఇస్తారని ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు.

* తిరుమలలోని అన్నప్రసాద వితరణ కేంద్రాల్లో పని చేసే కార్మికులు ధర్నాకు దిగారు. మూడు నెలలుగా జీతాలివ్వడం లేదంటూ వెంగమాంబ కేంద్రం వద్ద బైఠాయించారు. కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

* దేశంతోపాటు ప్రజల భవిష్యత్తును శాశ్వతంగా మార్చగల సామర్థ్యం యుద్ధానికి ఉంటుందని సీడీఎస్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. కార్గిల్‌ యుద్ధం 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. గతంలో చేసిన తప్పిదాలను పునరావృతం చేయకూడదన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పోరాడిన సైనికులను సీడీఎస్‌ ఈ సందర్భంగా కొనియాడారు. ‘‘యుద్ధం, యుద్ధక్షేత్రం వేగంగా మారుతున్నాయి. సాంకేతికతలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలతో యుద్ధం స్వభావం కూడా మారుతోంది. కార్గిల్‌ యుద్ధంతో ఇది నిజంగానే మారింది. సైనికులు చేసిన త్యాగాల జ్ఞాపకాలు మన జానపద సాహిత్యంలో భాగం కావాలి. గతంలో నేర్చుకున్న పాఠాలు మన సైన్యంలో ఇమిడిపోవాలి’’ అని త్రివిధ దళాల అధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

* తెలంగాణ శాసనసభ సమావేశాలు జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. అక్కడికి ఒక రోజు వ్యవధిలో 24 నుంచి మండలి సమావేశాలు కూడా ప్రారంభమవుతాయి. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది.

* కాంగ్రెస్‌ మాట ఇస్తే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రుణమాఫీ అమలు చేస్తున్నామన్నారు. తొలివిడతగా రూ.1 లక్ష లోపు రైతు రుణాల మాఫీని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది.

* మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్‌ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు నాలుగింటిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇసుక, విద్యుత్‌, పోలవరం-నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసాలను వీటి ద్వారా ప్రజలకు వెల్లడించారు.

* ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్‌-డిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. గోండా సమీపంలో గురువారం మధ్యాహ్నం 2.35 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కొన్ని బోగీలు పట్టాలు తప్పగా.. మరికొన్ని పూర్తిగా బోల్తా పడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

* హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్టు చేశారు. “”రాష్ట్రంలో బాధితులనే నిందితులుగా చేసిన చీకటి రోజులు పోయి నెల దాటింది. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకలించేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ అసత్య ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.”

* చిన్నారులపై వీధికుక్కల దాడిపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల దాడిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది. శునకాల బారి నుంచి పిల్లలను రక్షించేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించింది. వచ్చే వాయిదాకు పరిష్కార మార్గాలతో రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

* ఇటీవల విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలతో భారత సీనియర్‌ స్పిన్నర్ అమిత్ మిశ్రా వార్తల్లో నిలిచాడు. ఈసారి సంజూ శాంసన్ టీ20 భవితవ్యంపై కామెంట్లు చేశాడు. టీ20 ప్రపంచ కప్‌ 2024 జట్టులో సంజూకు స్థానం దక్కినప్పటికీ ఒక్క మ్యాచ్‌ ఆడలేకపోయాడు. రిషభ్‌ పంత్‌ ఫామ్‌లో ఉండటంతో సంజూ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. మరో రెండేళ్లలో మళ్లీ పొట్టి కప్‌ జరగనుంది. ప్రస్తుతం సంజూ వయసు 29. వచ్చే ప్రపంచ కప్‌ (2026) నాటికి అతడు 31 ఏళ్లకు చేరతాడు. అప్పటికి యువ క్రికెటర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురు కానుంది. శాంసన్ తుది జట్టులో ఉండాలని భావిస్తే.. ఇప్పటి కంటే ఇంకా దూకుడుగా ఆడితేనే అవకాశం లభిస్తుందని మిశ్రా వ్యాఖ్యానించాడు.

* వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఆస్పత్రి పాలయ్యారు. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడమే అందుకు కారణం. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి బోనీ కపూర్‌ వెల్లడించారు. ప్రస్తుతం జాన్వీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉన్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. వరుస సినిమాలతో ఈ బ్యూటీ బిజీబిజీగా ఉన్నారు. జాన్వీ, గుల్షన్‌ దేవయ్య, రోషన్‌ మ్యాథ్యూ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉలఝ్‌’ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్‌ డ్రామా ‘దేవర’లో జాన్వీ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరోవైపు బుచ్చిబాబు, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంలోనూ కథానాయికగా జాన్వీ ఎంపికైంది.

* టీ20 ప్రపంచ కప్‌ తర్వాత రోహిత్‌ శర్మ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో టీ20ల్లో టీమ్ఇండియా తదుపరి కెప్టెన్‌గా ఎవరిని నియమిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. గతంలో కొన్ని సిరీస్‌లకు భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)నే పగ్గాలు అందుకుంటాడని అనుకున్నా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) రేసులోకి వచ్చాడు. కొత్త హెడ్‌ కోచ్‌గా వచ్చిన గౌతమ్‌ గంభీర్ (Gautam Gambhir) సూర్యకుమార్‌కు జట్టు పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయం గురించి సెలక్టర్లతో చర్చించినట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వద్దని గంభీర్‌ పరోక్షంగా సెలక్టర్లతో చెప్పాడని సమాచారం.

* మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందేపై జ్యోతిర్‌మఠం శంకారాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద (Swami Avimukteshwaranand) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ద్రోహి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ఎంపీ, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఘాటుగా స్పందించారు. రాజకీయ నాయకులు రాజకీయాలు చేయకుండా పానీపూరీ అమ్ముకోవాలా? అని మండిపడ్డారు. స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల మంబయిలో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఉద్ధవ్‌ ఠాక్రేకు కొందరు ద్రోహం చేశారని చాలామంది ప్రజలు వేదనకు గురవుతున్నారు. ఠాక్రేను మోసం చేసిన వారిపై ప్రజల వ్యతిరేకత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిబింబించింది. ఆయన మళ్లీ సీఎం అయ్యేవరకు ప్రజల బాధ తీరదు’’ అని వ్యాఖ్యానించారు.

* అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (joe biden) పై సొంత పార్టీ నుంచే ముప్పేటలా ఒత్తిడి పెరిగిపోతోంది. డెమోక్రటిక్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కూడా బైడెన్‌పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అమెరికా పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆమె నేరుగా బైడెన్‌కే ఫోన్‌ చేసి.. ‘2024లో నువ్వు ట్రంప్‌ను ఓడించలేవని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయి’ అని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతోపాటు 81 ఏళ్ల బైడెన్‌ కనుక అధ్యక్ష రేసులో కొనసాగితే.. నవంబర్‌ ఎన్నికల్లో ప్రతినిధుల సభలో కూడా డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆంగ్ల పత్రిక సీఎన్‌ఎన్‌ కథనంలో పేర్కొంది. మరోవైపు బైడెన్‌ మాత్రం తాను చూసిన పోలింగ్‌ అంచనాలు మొత్తం తనకు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నట్లు ఆ కథనంలో వెల్లడించారు.

* అమెరికాలో జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్‌ అడెరెర్‌ అనే పోలీసు అధికారిని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. ఆయన మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ సూ రహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి (Jaahnavi Kandula) 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తుపై పోలీసు అధికారి డేనియల్‌ అడెరెర్‌.. చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్విన వీడియో ఒకటి ఆ మధ్య వైరల్‌ అయ్యింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువలేదు’ అన్నట్లుగా ఆయన మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం సైతం డిమాండ్‌ చేసింది. దీంతో అతణ్ని అప్పట్లోనే సస్పెండ్‌ చేశారు. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z